మళ్లీ గెలిపిస్తే మెరుగైన అభివృద్ధి : రఘునందన్​ రావు

మళ్లీ గెలిపిస్తే మెరుగైన అభివృద్ధి : రఘునందన్​ రావు

చేగుంట, దుబ్బాక, వెలుగు: ఉప ఎన్నికల్లో ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మండలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశానని, మరొకసారి అవకాశమిస్తే నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని బీజేపీ దుబ్బాక అభ్యర్థి రఘునందన్​రావు అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని ఇబ్రహీంపూర్​, రుక్మాపూర్​, కరీంనగర్​, సోమ్లా తండాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్​ తమది రైతు ప్రభుత్వమని గొప్పలు చెబుతున్నా వారి సమస్యలు పట్టించుకునే నాథుడే కరువయ్యారన్నారు. 

రైతుల కోసం ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎన్నోఅభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. గ్రామాల్లో చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో చేపట్టినవేనన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు చింతల భూపాల్, యువమోర్చా అధ్యక్షుడు చంద్రశేఖర్​గౌడ్, జిల్లా కార్యదర్శి ఎల్లారెడ్డి, సీనియర్​ నాయకులు వెంగళ్​రావు, నాగభూషణం, ఎంపీటీసీ భాగ్యమ్మ పాల్గొన్నారు. 

దుబ్బాక:  బీజేపీకి ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోందని ఎమ్మెల్యే రఘునందన్​రావు అన్నారు. మండలంలోని  రఘోత్తంపల్లి గ్రామానికి చెందిన ఒకటో వార్డు సభ్యురాలు కొడిమాల భాగ్యమ్మ గురువారెడ్డితో పాటు మరో 20 మంది యువత, పట్టణ కాంగ్రెస్​ నాయకుడు గున్నాల సాయి కుమార్​ ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీలో చేరారు. దౌల్తాబాద్​ మండలం దీపాయంపల్లి ఉప సర్పంచ్​ గొల్ల దుర్గవ్వ, వార్డు సభ్యులు రెడ్డి నర్సింహారెడ్డితో పాటు మరో 50 మంది బీజేపీలో చేరారు. 

వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి ఆహ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుబ్బాకలో బీజేపీ గెలుపును ఎవరూ అపలేరని, సీఎం కేసీఆర్​కు మరొక్కసారి దుబ్బాక పౌరుషాన్ని చూపెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. దేశం కోసం, ధర్మం కోసం దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.