వనపర్తి జిల్లాలో పట్టు సాధించేందుకు బీజేపీ కసరత్తు

వనపర్తి జిల్లాలో పట్టు సాధించేందుకు బీజేపీ కసరత్తు

వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లాలో పట్టు సాధించేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. పార్టీలోని సీనియర్ నాయకులను అలర్ట్ చేస్తూనే కొత్త వారిని పార్టీ లో కి తీసుకోవడంపై పార్టీ అగ్రనాయకులు ఫోకస్​ చేశారు. రాష్ట్ర స్థాయి నేతలు వనపర్తి జిల్లా నేతలతో తరచు సమావేశాలు నిర్వహిస్తూ బలాబలాలను తెలుసుకుంటున్నారు. నియోజకవర్గాల్లో బీజేపీ పరిస్థితి, బీఆర్ఎస్ బలహీనతలు, కాంగ్రెస్ ప్రాబల్యం పై ఇప్పటికే రెండు సార్లు సర్వేలు నిర్వహించారు. పైగా వనపర్తి నియోజకర్గంలో బీజేపీ తరఫున గెలిచే అభ్యర్థినే బరిలోకి దింపాలని చూస్తోంది. ప్రస్తుతం పార్టీలో సీనియర్ నేతగా కొనసాగుతున్న ఆర్టీసీ యూనియన్ నేత అశ్వథ్థామ రెడ్డి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తూ నియోజకవర్గంలో ముఖ్య నేతలతో కలిసి పర్యటిస్తున్నారు. చీమనగుంటపల్లి గ్రామానికి చెందిన ఈయనకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు,ఇతర కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలున్నాయి. తనకే టికెట్ ఇవ్వాలని బీజేపీ అధిష్ఠానం పై ఒత్తిడి తెస్తున్నారు. అలాగే పార్టీలోని బీసీ వర్గాలకు చెందిన సీనియర్ నేత, వనపర్తి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బి.కృష్ణ ఈసారి పార్టీ నుంచి తానే పోటీలో ఉంటానంటూ ప్రచారం చేస్తున్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో బీజేపీ కి మంచి పట్టు ఉంది. గతంలో వనపర్తి మున్సిపాలిటీలో టీడీపీ తో కలిసి ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ వ్యవహరించింది. దీనికి తోడు గ్రామాల్లోనూ ఈ మధ్య కాలంలో పార్టీ బలోపేతం అయింది. దీంతో వనపర్తి టికెట్ పై నేతలంతా ఆశలు పెంచుకుంటున్నారు. జిల్లా మాజీ అధ్యక్షులు అయ్యగారి ప్రభాకర్ రెడ్డి, ప్రస్తుత అధ్యక్షులు రాజవర్ధన్ రెడ్డితో పాటు ఆ పార్టీ బీసీ వర్గానికి చెందిన రాష్ట్ర నాయకులు డి.నారాయణ కూడా రేసులో ఉన్నారు. 

బీఆర్ఎస్ లో అసంతృప్తులపై నజర్​

బీఆర్ఎస్ లో ఇమడలేక పార్టీ నుంచి బయటకు వస్తున్నవారిపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. తమ పార్టీ లోకి రావాలంటూ కొందరిని ఆహ్వానిస్తున్నట్టు, కొందరిపై ఒత్తిడి పెంచుతున్నట్టు తెలుస్తోంది. జిల్లా పరిషత్ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి బీఆర్ఎస్ పై అసంతృప్తిలో ఉన్నారు. ఆ పార్టీని వీడుతారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తనకు టికెట్​ ఇస్తే బీజేపీలో చేరుతానని షరతు పెట్టడంతో హైకమాండ్​ ఆయన చేరికను పెండింగ్ లో పెట్టింది. మరో పక్క పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి ఆ పార్టీ నుంచి బయటికి వస్తారన్న ప్రచారం జరుగుతోంది. సివిల్ కాంట్రాక్టర్ అయిన మేఘారెడ్డి తన బిల్లుల చెల్లింపు లో రాష్ట్ర ప్రభుత్వం పై అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు బీజేపీ, టీడీపీ పొత్తు పెట్టుకుంటాయని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వనపర్తి ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యులు గా పనిచేసిన రావుల చంద్రశేఖర్ రెడ్డిని వనపర్తి నుంచి ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దింపుతారని చెబుతున్నారు. అయితే జిల్లాలో జరిగే పార్టీ కార్యక్రమాలు, ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు చేపట్టే విషయంలో పార్టీలో ఐక్యత కనిపించడం లేదు. దీంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. 

గెలుపు గుర్రాల కోసం బీజేపీ సర్వే...

జిల్లాలోని వనపర్తి , కొల్లాపూర్ , దేవరకద్ర, మక్తల్ నియోజక వర్గాల్లో గ్రామస్థాయిలో బీజేపీ పరిస్థితిపై ఇప్పటికే రెండు సార్లు సర్వేలు నిర్వహించింది. ఏ నియోజకవర్గంలో ప్రస్తుతం ఏ పార్టీకి ఎంత బలం ఉందని, విజయానికి బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రత్యేకంగా పార్టీ హైకమాండ్​ సర్వే రిపోర్ట్ ను తీసుకుంది. ఇందులో భాగంగా హైకమాండ్​ వనపర్తి నియోజకవర్గంపై స్పెషల్​ ఫోకస్​ పెట్టింది. ఓటర్ల లో కులాల వారీగా వివరాలు తీసుకొని అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇతర పార్టీల్లో అసంతృప్తులను దగ్గరికి తీసుకునేందుకు ఆ పార్టీ ముఖ్య నేతనలను నియోజకవర్గానికి పంపిస్తోంది. కేవలం నరేంద్ర మోడీ ఛరిష్మా, బీజేపీ ఇమేజ్ పైనే ఆధారపడకుండా అభ్యర్థులకు అన్ని రకాల అర్హతలు ఉండేలా చూస్తున్నదని పార్టీ లోని ఓ సీనియర్ నాయకుడు చెప్పారు. నియోజక వర్గంలో హేమాహేమీలుగా ఉన్న మంత్రి నిరంజన్ రెడ్డి, చిన్నారెడ్డికి దీటుగా ఉండే అభ్యర్థినే పోటీకి దింపుతామని జిల్లాలోని నాయకులకు సందేశాలు పంపుతోంది.