కొత్త పార్లమెంట్‌ను శవపేటికతో పోల్చిన ఆర్‌జేడీ.. బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్

కొత్త పార్లమెంట్‌ను శవపేటికతో పోల్చిన ఆర్‌జేడీ.. బీజేపీ స్ట్రాంగ్  కౌంటర్

కొత్త పార్లమెంట్ భవనాన్ని శవపేటికను  పోలి ఉందని బీహార్ కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ ట్వీట్ చేయడంపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా దీనిపై బీహార్  బీజేపీ స్పందించి స్ట్రాంగ్  కౌంటర్  ఇచ్చింది.  ఇందులో మొదటిది మీ భవిష్యత్తు కాగా మరోకటి భారతదేశ భవిష్యత్తు అని ట్వీట్ చేసింది.  

రాష్ట్రీయ జనతాదళ్ పార్టీపై దేశద్రోహం కేసు పెట్టాలని రాజ్యసభ ఎంపీ, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ  డిమాండ్ చేశారు.   శాశ్వతంగా పార్లమెంట్‌ను బహిష్కరించే విధంగా ఆర్‌జేడీ భావిస్తోందా అని నిలదీశారు.  

బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మాట్లాడుతూ.. 2024లో దేశ ప్రజలు మిమ్మల్ని ఒకే శవపేటికలో పాతిపెడతారని, ప్రజాస్వామ్యం అనే కొత్త దేవాలయంలోకి అడుగుపెట్టే అవకాశం ఇవ్వరని, పార్లమెంటు భవనం దేశానిదేనని అన్నారు. 

కాగా  కొత్త పార్లమెంటు భవనం శవపేటిక ఆకారంలో ఉందని సూచిస్తూ శవపేటిక ఫోటో ప‌క్కన కొత్త పార్లమెంట్ భ‌వ‌నం ఫొటోను షేర్ చేస్తూ.. 'యే క్యా హై (ఇది ఏమిటి?)' అని ఆర్‌జేడీ ప్రశ్నించింది.

అటు సర్వ మత ధర్మ ప్రార్ధనలతో పార్లమెంట్ ప్రారంభోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. సెంగోల్‌కు మోడీ సాస్టాంగ నమస్కరం చేశారు. అనంతరం నూతన పార్లమెంట్‌లో స్పీకర్ కుర్చీ వద్ద సెంగోల్‌ను ప్రధాని మోడీ ప్రతిష్టించారు.