బీజేపీది ఫ్యూడల్ మైండ్​సెట్

బీజేపీది ఫ్యూడల్ మైండ్​సెట్
  •      పేదల సంక్షేమం ఆ పార్టీకి పట్టదు: ఖర్గే 
  •     మా పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ కాంగ్రెస్ చీఫ్​

న్యూఢిల్లీ: బీజేపీది ఫ్యూడల్ మైండ్ సెట్ అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. పేదల కోసం తాము పథకాలు ప్రకటిస్తుంటే, ఉచితాల పేరుతో రాజకీయాలు చేస్తున్నామంటూ ప్రధాని మోదీ విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ‘‘మేం పేదల కోసం ఎప్పుడు పథకాలు ప్రకటించినా, వాళ్లు (బీజేపీ) మమ్మల్ని విమర్శిస్తూనే ఉంటారు. యూపీఏ హయాంలో ఉపాధి హామీ పథకం, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, రూరల్ హెల్త్ మిషన్, భూసంస్కరణలు, బ్యాంకుల జాతీయీకరణ తదితర తీసుకొచ్చినప్పుడు వ్యతిరేకించారు. 

ఇప్పుడు మేం అధికారంలోకి వస్తే పేదలకు డబుల్ రేషన్ (10 కిలోల బియ్యం) ఇస్తామని ప్రకటిస్తే, దానిపైనా తప్పుడు ప్రచారం చేస్తున్నారు” అని ఫైర్ అయ్యారు. పీటీఐ వార్తాసంస్థకు ఖర్గే ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మాట్లాడారు. కాంగ్రెస్ పై ప్రధాని మోదీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అయోధ్య రామమందిరంపైకి బుల్డోజర్లను పంపుతుందని మోదీ చేసిన కామెంట్లపై స్పందిస్తూ.. ‘‘ఇది పచ్చి అబద్ధం. మా పార్టీ నేతలెవరూ అలా మాట్లాడలేదు. మేం అన్ని మతాలను గౌరవిస్తాం. ప్రధాని మోదీ ఓట్ల కోసం ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారు” అని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ 55 ఏండ్ల పాలనలో పూజలు చేయకుండా ఎప్పుడూ ఎవరినీ అడ్డుకోలేదని, ఎవరి మంగళసూత్రాలను తీసుకోలేదని చెప్పారు. 

పదేండ్లలో 100 లక్షల కోట్ల అప్పు.. 

మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తామని తామెప్పుడూ చెప్పలేదని ఖర్గే స్పష్టం చేశారు. ‘‘తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అదే విధంగా అన్నిచోట్ల రిజర్వేషన్లను పెంచుతామని మేం చెప్పాం. ఇందులో ముస్లింల ప్రస్తావన ఎక్కడుంది? బడుగు బలహీనవర్గాలకే రిజర్వేషన్లు ఇస్తాం. బీజేపీ వాళ్లు కావాలనే దుష్ర్పచారం చేస్తున్నారు” అని మండిపడ్డారు. తాము పేదల కోసం పని చేస్తుంటే, బీజేపీ పెద్దల కోసం పని చేస్తున్నదని విమర్శించారు. 

‘‘మేం అధికారంలోకి వస్తే మహిళలకు రూ.లక్ష ఇస్తామని ప్రకటించాం. మేం ఎప్పుడూ పేదల గురించే ఆలోచిస్తాం. కానీ బీజేపీ పేదలకు రూపాయి ఇవ్వలేదు. వ్యాపారవేత్తలకు మాత్రం రూ.16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసింది” అని అన్నారు. మోదీ పదేండ్లలో రూ.100 లక్షల కోట్ల అప్పు చేసి, దేశాన్ని అప్పులకుప్పగా మార్చారని విమర్శించారు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నదన్న కామెంట్లపై స్పందిస్తూ.. ‘‘అన్యాయాన్ని అడ్డుకోవడం బుజ్జగింపు ఎలా అవుతుంది? పేదలకు మంచి చేయడం, స్కాలర్ షిప్ లు అందజేయడం, ముస్లింలకు స్పెషల్ స్కూల్స్ ద్వారా విద్యనందించడం బుజ్జగింపు కిందికి రాదు. నిజానికి బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నది బీజేపీనే” అని అన్నారు.