వాళ్లది కబ్జాల ఆరాటం.. నాది పేదల పోరాటం : బండి సంజయ్ 

వాళ్లది కబ్జాల ఆరాటం.. నాది పేదల పోరాటం : బండి సంజయ్ 

కరీంనగర్ సిటీ, వెలుగు: బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్, కాంగ్రెస్ అభ్యర్థి పురుమళ్ల శ్రీనివాస్‌‌‌‌ది భూకబ్జాల పంచాయితీ అని, తనది పేదల కోసం ఎంతకైనా తెగించే నైజమని ఎటువైపు ఉంటారో మీరే తేల్చుకోండని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు.  బీఆర్ఎస్‌‌‌‌కు రెండుసార్లు అధికారమిస్తే ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసి పుట్టబోయే ప్రతి బిడ్డపై రూ.లక్షన్నర అప్పు మోపారని మండిపడ్డారు.

కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీనగర్,  ఫకీర్​పేట, సిటీలోని కిసాన్‌‌‌‌నగర్, అంబేద్కర్ స్టేడియం సర్కిల్, 10,11, 12 డివిజన్లలో ప్రచారం నిర్వహించారు. సంజయ్ మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థికి భూకబ్జాలు తప్ప కరీంనగర్ గురించే తెల్వదని, రేషన్ కార్డులు ఎట్లస్తిరో.. పెన్షన్ ఎట్లస్తిరో కూడా ఆయనకు తెల్వదన్నారు. ఆయన ప్రజల కోసం ఎన్నడైనా కొట్లాడాడా?  అని ప్రశ్నించారు.  కేంద్రం నుంచి రూ.9 వేల కోట్లు తీసుకొస్తే.. గంగుల కమలాకర్ ఆ నిధులు తానే తెచ్చినట్లు ఫోజులు కొడుతున్నాడని మండిపడ్డారు. కేసీఆర్ ఇంట్లో ఐదుగురికి పదవులున్నాయని, మరి రాష్ట్రంలోని నిరుద్యోగులు ఏం పాపం చేశారన్నారు.  

బీజేపీలో చేరికలు

సుభాష్ నగర్ లోని గాంధీ విగ్రహం వద్ద బండి సంజయ్ సమక్షంలో సుమారు 200 మంది విశ్వ బ్రాహ్మణ ప్రతినిధులు  బీజేపీలో చేరారు. విశ్వకర్మ ఐక్యవేదిక సంఘం జిల్లా అధ్యక్షుడు పాములపర్తి వేణుగోపాలాచారి పాల్గొన్నారు.