ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

పటాన్​చెరు, వెలుగు: దేశ అభివృద్ధికి కృషి చేస్తున్నామని గొప్పలు చెబుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం ఏం చేసిందో చెప్పాలని మంత్రి హరీశ్​రావు 
డిమాండ్​ చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే  చేనేతకు ఉపయోగకరంగా ఉండే నేషనల్​హ్యాండ్లూమ్ ​సంస్థను రద్దు చేయడం, కార్మికుల బీమా పథకాన్ని రద్దు చేయడం తప్ప బీజేపీ చేసిందేమీలేదని ఆరోపించారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు లో మంత్రి  పర్యటించారు.

పట్టణ బస్టాండ్ ​సమీపంలో ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్​ బాపూజీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం రూ.5.10 కోట్లతో ఏర్పాటు చేసిన గాంధీ థీం పార్కు, జిమ్ముతో పాటు  లయన్స్ క్లబ్ ఆఫ్​ ఇంటర్నేషనల్​ ఆధ్వర్యంలో  నిర్మించిన భవనాన్ని ఎంపీ కొత్త ప్రభాకర్, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తో  కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గాంధీజీ, బాపూజీ లాంటి వారి ఆదర్శాలతోనే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం కొత్త సంస్థలను ఏర్పాటు చేయాల్సింది పోయి ఉన్న సంస్థలను అమ్మేస్తోందని ఆరోపించారు. చేనేతకు బీజేపీ ప్రభుత్వం చేసింది శూన్యమన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్​ రైతు బీమా తరహాలో  నేతన్న బీమా తీసుకొచ్చారని తెలిపారు. వర్క్​షెడ్లను పెద్ద ఎత్తున నిర్మిస్తున్నామని, నూలుపై సబ్సిడీ ఇస్తున్నామని చెప్పారు.  పటాన్​ చెరును అద్భుతమైన జంక్షన్ గా మార్చారని ఎమ్మెల్యేను  అభినందించారు. కరోనా సమయంలో అద్భుతమైన సేవలు అందించిన పోలీస్, వైద్యులు, సఫాయి కార్మికులు విగ్రహాలను పార్కు వద్ద  ఏర్పాటు చేసి వారి సేవను గుర్తించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింత ప్రభాకర్, ఎమ్మెల్సీ రమణ, ఎస్పీ రమణ కుమార్, శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి,   జడ్పీటీసీలు, ఎంపీపీలు,  సర్పంచులు పాల్గొన్నారు. 

పారిశుధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ

కోహెడ, వెలుగు : బతుకమ్మ, దసరా పండుగను పురస్కరించుకుని కోహెడ పారిశుధ్య కార్మికులకు, పంచాయతీ సిబ్బందికి సింగిల్ ​విండో చైర్మన్ పేర్యాల దేవేందర్ రావు సర్పంచ్ పేర్యాల నవ్యతో కలిసి దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దేవేందర్​రావు మాట్లడుతూ ప్రజల ఆరోగ్యం కోసం పారిశుధ్య కార్మికులు చేస్తున్న శ్రమ వెలకట్టలేనిదన్నారు. చెత్తాచెదారం లేకుండా ఎప్పటికప్పుడు శుభ్ర పరుస్తూ, స్వఛ్ఛ గ్రామంగా తీర్చిదిద్దుతూ ప్రజలందరి ఆరోగ్యాలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు.

ఆలయ నిర్మాణానికి రూ.లక్ష విరాళం 

మునిపల్లి, వెలుగు : మండ‌‌‌‌లంలోని చిన్నచెల్మెడ  గ్రామంలో  నిర్మించ‌‌‌‌నున్న ఆంజ‌‌‌‌నేయ స్వామి దేవాలయ నిర్మాణానికి బుసారెడ్డిప‌‌‌‌ల్లి  గ్రామ స‌‌‌‌ర్పంచ్ మంతూరి స్వప్న, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి శశికుమార్  రూ.ల‌‌‌‌క్ష  విరాళం అందజేశారు. ఆదివారం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులకు విరాళాన్ని అందజేసి వారు మాట్లాడారు.  దేవాలయాల అభివృద్ధికి త‌‌‌‌మ వంతు  కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో  ఉప స‌‌‌‌ర్పంచ్ ద‌‌‌‌త్తుగౌడ్,  మాజీ స‌‌‌‌ర్పంచ్ బాల‌‌‌‌కిష్టయ్య, గ్రామ‌‌‌‌స్తులు న‌‌‌‌ర్సింలు, వీర‌‌‌‌న్న, మొగుల‌‌‌‌య్య, ఖాద‌‌‌‌ర్ త‌‌‌‌దిత‌‌‌‌రులు పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్ ను కలిసిన చింత ప్రభాకర్​

సంగారెడ్డి, వెలుగు:  రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత చింత ప్రభాకర్ ఆదివారం ప్రగతిభవాన్ లో మంత్రి హరీశ్​రావు సమక్షంలో సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకంతో టీఎస్ హెచ్ డీసీ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించినందుకు ఆయన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. వారి వెంట ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. 

టెస్కో చైర్మన్ కు సన్మానం

సంగారెడ్డి టౌన్, వెలుగు : టెస్కో చైర్మన్​గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన చింత ప్రభాకర్ ను ఆదివారం సంగారెడ్డిలోని జిల్లా ప్రజా పరిషత్ ఆవరణలో రాష్ట్ర గొర్రెల మేకల పెంపకందారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాపు మలిశెట్టి ఆధ్వర్యంలో సన్మానించారు. సంఘం గౌరవ అధ్యక్షుడు తొంట అంజయ్య, జిల్లా అధ్యక్షుడు మల్లేశం, ప్రధాన కార్యదర్శి పురా నారాయణ, గోవింద్, శివ శంకర్, కృష్ణయ్య, నరేశ్​ ఉన్నారు.

వైభవంగా బతుకమ్మ సంబురాలు 

వెలుగు, నెట్​వర్క్: మెదక్​ కలెక్టరేట్ ఆవరణలో వైద్య, ఆరోగ్య, రోడ్డు రవాణా శాఖల ఆధ్వర్యంలో ఆదివారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళా ఉద్యోగులు పాల్గొని పూజలు చేసి బతుకమ్మ ఆడారు. శివ్వంపేట మండల కేంద్రంలోని  సంబరాల్లో రాష్ట్ర మహిళా కమిషన్​ చైర్​పర్సన్​ సునీతారెడ్డి, నర్సాపూర్​ ఎమ్మెల్యే మదన్ రెడ్డి పాల్గొని బతుకమ్మను ఎత్తుకున్నారు. జహీరాబాద్ లోని వాసవి కల్యాణ మండపంలో ఆర్య వైశ్య మహిళ సంఘం ఆధ్వర్యంలో సంబరాలు కన్నులపండువగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన మహిళలకు నగదు బహుమతులను అందజేశారు. మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.   ​

317 జీవో రద్దు చేయాలి

సంగారెడ్డి టౌన్, వెలుగు: జీవో 317 రద్దు చేసి బాధితులకు న్యాయం చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వై.అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం గాంధీ జయంతి సందర్భంగా 317 జీవో బాధిత సంఘం ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఉపాధ్యాయ, ఉద్యోగులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలు స్థానికులకు దక్కాలన్న నినాదంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, కానీ నేడు స్థానికతే ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జీవో కారణంగా స్థానికేతర జిల్లాలకు బదిలీ చేసిన ఉద్యోగులను తిరిగి స్థానికత ఆధారంగా సొంత జిల్లాలకు బదిలీ చేయాలని టీపీటీఎఫ్​​ జిల్లా ప్రధాన కార్యదర్శి అనుముల రామచందర్ డిమాండ్​ చేశారు. 

మహిళా మోర్చా ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్

సంగారెడ్డి టౌన్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలలో భాగంగా ఆదివారం మహిళా మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని 37వ వార్డు వీరభద్ర నగర్ లో స్వచ్ఛ భారత్ నిర్వహించారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ డాక్టర్ అరుణ, జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, నాయకులు విష్ణువర్ధన్​రెడ్డి, చంద్రశేఖర్, 
తదితరులు పాల్గొన్నారు.

కౌడిపల్లిని ఆదర్శంగా తీర్చిదిద్దుతా

మెదక్ (కౌడిపల్లి), వెలుగు : కౌడిపల్లి మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని నర్సాపూర్​ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. కౌడిపల్లిలో ఆదివారం 50 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనేక గ్రామాలకు, తండాలకు కూడలిగా ఉన్న కౌడిపల్లిలో ఉన్న పీహెచ్​సీ.. సీహెచ్​సీగా అప్​ గ్రేడ్​ అయినందున ఆసుపత్రికి కొత్త బిల్డింగ్​ మంజూరైందని తెలిపారు.

అప్పటి నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల విఠల్ రెడ్డి ఎంతో శ్రమించి ఆరు పడకల ఆసుపత్రికి బిల్డింగ్​ నిర్మించారని, ఇక్కడ పెద్దాసుపత్రి కావాలన్న తన చిన్ననాటి కల ఇప్పుడు నెరవేరిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల​ ఫోరం అధ్యక్షుడు చిలుముల వెంకటేశ్వర్​రెడ్డి, ఎంపీపీ రాజు నాయక్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు గుంజరి ప్రవీణ్ కుమార్, ఇన్​చార్జి డీఎం అండ్ హెచ్ వో విజయ నిర్మల, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వెంకట్ యాదవ్, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు రామాగౌడ్, సొసైటీ వైస్ చైర్మన్ చిన్నంరెడ్డి 
పాల్గొన్నారు.

దళితబంధుతో దళితుల జీవితాల్లో వెలుగులు

ఎమ్మెల్యే రసమయి బాలకిషన్

కోహెడ(బెజ్జంకి), వెలుగు: దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్​దళిత బంధు స్కీంను ప్రవేశపెట్టారని మానకొండూర్​ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​అన్నారు. ఆదివారం బెజ్జంకి మండలం చీలాపూర్​పల్లి (ఎర్రవెల్లివాడ)లో దళితబంధు స్కీంలో మంజూరైన యూనిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్నటి వరకు కూలీగా ఉన్న వ్యక్తి నేడు ఓనర్​గా మారడం గర్వకారణం అన్నారు.

దళితుల సంక్షేమం కోసం ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్​ నేతృత్వంలో దళితుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. లబ్ధిదారులు వీటిని  సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. అంతకుముందు రేగులపల్లి, కల్లెపల్లి, చీలాపూర్​పల్లి, గూడెం, గుండారం గ్రామాల్లో కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. బెజ్జంకిలో గాంధీ జయంతి వేడుకలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్​రెడ్డి, ఏఎమ్​సీ చైర్మన్​రాజయ్య, రాష్ర్ట నాయకులు చింతకింది శ్రీనివాస్​గుప్తా, లింగాల లక్ష్మణ్, శేఖర్ ​బాబు పాల్గొన్నారు.

చదువుల తల్లిగా ఏడుపాయల దుర్గామాత

పాపన్నపేట, వెలుగు : శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆదివారం చదువుల తల్లి సరస్వతీ మాతగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా గోకుల్​ షెడ్​లో ప్రతిష్ఠించిన ఉత్సవ విగ్రహాన్ని సరస్వతీ మాత రూపంలో అలంకరించి పూజలు నిర్వహించారు. ఆదివారంతోపాటు, స్కూళ్లు, కాలేజీలకు దసరా పండగ సెలవులు ఉండటంతో వివిధ ప్రాంతాల నుంచి  ఏడుపాయలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 

దుర్గమ్మ సన్నిధిలో వీహెచ్​పీ, భజరంగ్​దళ్​రాష్ట్ర అధ్యక్షులు

మెదక్​ టౌన్, వెలుగు: వనదుర్గామాతను విశ్వహిందూ పరిషత్​(వీహెచ్​పీ) రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్​రెడ్డి, భజరంగ్​దళ్​రాష్ట్ర అధ్యక్షుడు శివరామ్​ ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం మెదక్​ జిల్లా వ్యాప్తంగా వీహెచ్​పీ, భజరంగ్​దళ్​ చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించారు.  ఆతర్వాత మెదక్​లోని వేణుగోపాలస్వామి ఆలయంలో శ్రీదేవీనవరాత్రుల్లో ప్రతిష్ఠించిన అమ్మవారిని 
దర్శించుకున్నారు.

చికెన్ ​సెంటర్లకు ఫైన్

మెదక్​టౌన్, వెలుగు: మహాత్మాగాంధీ జయంతి రోజు మెదక్​పట్టణంలో తెరచి ఉంచిన చికెన్ ​సెంటర్లపై మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఆకస్మిక దాడులు చేశారు. ఆదివారం ఉదయం పట్టణంలోని మెయిన్​రోడ్డులో తెరసి ఉన్న  సుప్రీమ్ చికెన్ ​సెంటర్​కు రూ.3 వేలు, ఆటోనగర్​లోని బిలాల్ ​చికెన్​సెంటర్ కు​ రూ.2 వేల ఫైన్​ విధించారు. తనిఖీల్లో మున్సిపల్​ శానిటరీ ఇన్స్​పెక్టర్​ మహేశ్, సిబ్బంది కిరణ్​, కృష్ణ ​పాల్గొన్నారు. 

ఘనంగా దేవీ త్రిరాత్రోత్సవాలు ప్రారంభం

కొమురవెల్లి, వెలుగు: మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం దుర్గాదేవి త్రిరాత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ఈవో బాలాజీ ఆధ్వర్యంలో ఉత్సవాలను అర్చకులు, అధికారులు ప్రారంభించారు. గణపతి పూజ, నవగ్రహ పూజ, దుర్గా మాత పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.