పాలమూరు బీజేపీ లీడర్లకు .. గ్రౌండ్​ రిపోర్ట్ టెన్షన్​

పాలమూరు బీజేపీ లీడర్లకు ..  గ్రౌండ్​ రిపోర్ట్ టెన్షన్​
  • పోటీలో ఎవరుంటే బాగుంటుందనే విషయంపై ఆరా
  • కేంద్ర మంత్రి అమిత్​షాకు చేరిన రిపోర్ట్
  • నేటి నుంచి అసెంబ్లీ అభ్యర్థిత్వాల కోసం అప్లికేషన్లు తీసుకోనున్న హైకమాండ్​

మహబూబ్​నగర్​, వెలుగు : బీజేపీ లీడర్లకు రిపోర్ట్​ టెన్షన్  పట్టుకుంది. ఇటీవల కర్నాటక రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉమ్మడి పాలమూరులోని 14 నియోజకవర్గాల్లో పర్యటించి సేకరించిన వివరాలతో రూపొందించిన గ్రౌండ్​ రిపోర్ట్​ను కేంద్ర మంత్రి అమిషాకు అందజేశారు. అయితే, ఈ రోజు నుంచి ఈ నెల 10 వరకు అసెంబ్లీ అభ్యర్థిత్వాల కోసం హైదరాబాద్​లో అప్లికేషన్లు తీసుకోనుంది. ఈ అప్లికేషన్లతో పాటు కర్నాటక లీడర్లు ఇచ్చిన ఫీడ్ బ్యాక్​ను హైకమాండ్​ పరిగణలోకి తీసుకొని టికెట్లు కేటాయించే చాన్స్​ ఉంది. ఇక రెండు, మూడు నియోజకవర్గాలు మినహా మిగతా చోట్ల ముగ్గురు, నలుగురు చొప్పున పోటీకి సిద్ధం అవుతున్నారు.

ఐదు రోజులు పర్యటన..

బీజేపీ హైకమాండ్​ ఉమ్మడి పాలమూరు జిల్లాలో పార్టీ పరిస్థితులపై రెండు నెలలుగా ఫోకస్​ పెట్టింది. కర్నాటక ఎన్నికల ఫలితాల​తర్వాత ఆ పార్టీకి చెందిన జాతీయ లీడర్లు ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల్లో పర్యటించారు. అనంతరం ఆగస్టు 22 నుంచి కర్నాటకకు  చెందిన 11 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఉమ్మడి జిల్లాలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లకు పంపింది. వీరు ఐదు రోజుల పాటు ఆయా సెగ్మెంట్లలో పర్యటించారు. పార్టీ పరిస్థితులపై ప్రజలతో నేరుగా మాట్లాడారు. బీజేపీ నుంచి ఎవరూ పోటీ చేస్తే బాగుంటుంది? ఆ లీడర్​ రూలింగ్​ పార్టీ సిట్టింగులను ఢీ కొట్టగలడా? నియోజకవర్గాల్లో బీజేపీ లీడర్లు ఎవరెవరు యాక్టివ్​గా తిరుగుతున్నారు? సెంట్రల్​ స్కీమ్స్​ గురించి ఫీల్డ్​ లెవెల్​లో పబ్లిక్​కు అవగాహన ఉందా? తదితర అంశాలపై ఆరా తీశారు. అలాగే బుత్​ కమిటీలతో సమావేశాలు నిర్వహించారు. బూత్​ కమిటీలు లేని చోట్ల కొత్త కమిటీలను వేశారు. ఈ రిపోర్టును కేంద్ర మంత్రి అమిత్​ షాకు అప్పగించారు. 

టికెట్ల కోసం పోటీ..

ఉమ్మడి జిల్లాలోని గద్వాల, అలంపూర్​, కల్వకుర్తి మినహా.. మిగిలిన చోట్ల టికెట్ల కోసం ఆశావహులు పోటీ పడుతున్నారు. సోమవారం నుంచి అభ్యర్థిత్వాల కోసం హైకమాండ్​ అప్లికేషన్లు తీసుకోనుండడంతో ప్రతి నియోజకవర్గం నుంచి ముగ్గురు, నలుగురు చొప్పున అప్లికేషన్లు పెట్టుకునే చాన్స్​ ఉంది. ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు కలిపి 60కి పైగా అప్లికేషన్లు వస్తాయని ఆ పార్టీ అంచనా వేస్తోంది. 

ప్రస్తుతానికి గద్వాల నుంచి డీకే అరుణ, మహబూబ్​నగర్  నుంచి​ ఏపీ జితేందర్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​రెడ్డి, అలంపూర్​ నుంచి బంగారు శ్రుతి, కల్వకుర్తి నుంచి టి.ఆచారి, వనపర్తి నుంచి అయ్యంగారి ప్రభాకర్​రెడ్డి, ఎన్ఆర్ఐ అనుజ్ఞారెడ్డి, అశ్వాత్థామరెడ్డి, బీసీ లీడర్​ బి.కృష్ణ, మాజీ అడిషనల్​ ఎస్పీ సర్వేశ్వర్​రెడ్డి పోటీలో ఉండే చాన్స్​ ఉంది. దేవరకద్ర నుంచి డోకూరు పవన్​కుమార్​రెడ్డి, ఎగ్గని నర్సింహులు, దేవరకద్ర బాలన్న, పాలమూరు సీడ్స్​ వల్లపురెడ్డి సుదర్శన్​రెడ్డి, జడ్చర్ల నుంచి ఆర్. బాలా త్రిపుర సుందరి, శాంతికుమార్, నారాయణపేట నుంచి నాగూరావు నామాజీ, రతంగ్​పాండురెడ్డి, సత్యనారాయణ యాదవ్​, అయ్యప్ప, పగడాకుల శ్రీనివాస్​, మక్తల్ నుంచి జలంధర్​రెడ్డి, బి.కొండయ్య, భాస్కర్, కొడంగల్ నుంచి రాజు, పాండురంగారెడ్డి, పున్నమ్​చంద్​ లాహోటి, కొల్లాపూర్​ నుంచి ఎల్లేని సుధాకర్​రావు, అచ్చంపేట నుంచి సతీశ్, శ్రీకాంత్​ భీమా, నాగర్​కర్నూల్​ నుంచి దిలీపాచారి, కొండా మణెమ్మ, షాద్​నగర్​ శ్రీవర్ధన్​రెడ్డి, అందె బాబయ్య, మిథున్​రెడ్డి, పాలమూరు విష్ణువర్ధన్​రెడ్డి అభ్యర్థిత్వాల కోసం పోటీ పడుతున్నారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్​ ఆశావహులకు గాలం..

బీఆర్ఎస్​, కాంగ్రెస్​ పార్టీలోని ఆశావహులకు బీజేపీ గాలం వేస్తోంది. పబ్లిక్​లో పలుకుబడి, ఆర్థిక బలం ఉండి ప్రత్యర్థిని ఢీకొట్టే ఇమేజ్​ ఉన్న లీడర్లను కాషాయ దళంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో కల్వకుర్తి టికెట్​ ఆశించి నిరుత్సాహంలో ఉన్న బీఆర్ఎస్​ పార్టీకి చెందిన మాజీ మంత్రి చిత్తరంజన్​దాస్​తో బీజేపీ రాష్ట్ర లీడర్లు సంప్రదింపులు జరుపుతున్నారు. ఆయన పార్టీలోకి వస్తే జడ్చర్ల టికెట్​ కేటాయిస్తామనే హామీ ఇస్తున్నట్లు సమాచారం. 

ఆయనకు జడ్చర్ల టికెట్​ కేటాయించడం వల్ల ఈ అసెంబ్లీ సెగ్మెంట్​తో పాటు కల్వకుర్తి అసెంబ్లీ పరిధిలో టి.ఆచారికి చిత్తరంజన్​దాస్​ సపోర్ట్​ సమకూరుతుందనే ప్లాన్​ చేస్తున్నారు. తద్వారా ఈ రెండు నియోజకవర్గాల్లో పైచేయి సాధించాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ నెల రెండో వారం నాటికి ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్​, కాంగ్రెస్​ పార్టీల్లోని ‘కీ’ లీడర్లను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.