రెండో రోజూ దీక్ష.. క్షీణిస్తున్న బీజేపీ నేత ఆరోగ్యం

రెండో రోజూ దీక్ష.. క్షీణిస్తున్న బీజేపీ నేత ఆరోగ్యం

కామారెడ్డి, వెలుగు: ధరణితో రైతుల గోస, కామారెడ్డిలో  అక్రమ దందాపై కలెక్టర్​ స్పందించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇన్‌‌‌‌చార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి చేపట్టిన ఆమరణ నిరహార దీక్ష బుధవారం రెండో రోజు కూడా కొనసాగింది.  రైతుల సమస్యలపై కలెక్టర్​ స్పందించే వరకు దీక్ష విరమించే ప్రసక్తే లేదని వెంకటరమణారెడ్డి ప్రకటించారు. పార్టీ శ్రేణులతో పాటు, వివిధ సంఘాల ప్రతినిధులు,  రైతులు మద్దతు తెలిపారు. ఆరు రోజులుగా నిరసన, నిరాహార దీక్ష చేపట్టినా కలెక్టర్​ స్పందించకపోవడంతో మంగళవారం నుంచి వెంకటరమణారెడ్డి ఆమరణ నిరాహార దీక్ష దిగారు.

మొదటి రోజు ఇంటి వద్దనే ఆయనను ఆరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లలో ఉంచగా అక్కడ కూడా దీక్ష  కొనసాగించారు. మంగళవారం రాత్రి పోలీసులు ఆయనను ఇంట్లో వదిలిపెట్టడంతో అక్కడే దీక్ష సాగిస్తున్నారు. గంటగంటకు ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని డాక్టర్లు చెబుతున్నారు. బుధవారం సాయంత్రం పోలీసులు గవర్నమెంట్​డాక్టర్‌‌‌‌‌‌‌‌ను తీసుకొచ్చి చెకప్ చేయించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ మెంబర్ వివేక్​ వెంకటస్వామి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, జిల్లా ప్రెసిడెంట్ అరుణతార పరామర్శించి సంఘీభావం తెలిపారు.  

ప్రజా సంఘాల మద్దతు..

ప్రజాసంఘాలు, అడ్వకేట్లు,  భారతీయ కిసాన్ సంఘ్​ ప్రతినిధులు, రైతులు, రిటైర్డు ఎంప్లాయీస్‌‌‌‌, ఏబీవీపీ ప్రతినిధులు తదితరులు వెంకటరమణారెడ్డికి మద్దతు తెలిపారు.  సీనియర్​ అడ్వకేట్లు జగన్నాథం, వి.ఎల్ నర్సింహ్మారెడ్డి, వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ ఆమరణ నిరహార దీక్ష చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. తమ భూముల వివరాలు కూడా ధరణిలో నమోదు కాక అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. కాగా, దీక్షకు సంఘీభావం తెలిపేందుకు హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ కార్యవర్గ మెంబర్ ఈటెల రాజేందర్ గురువారం కామారెడ్డి వస్తున్నట్లు పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ తేలు శ్రీనివాస్​ తెలిపారు.