సీఎం కేసీఆర్ పై వివేక్ వెంకటస్వామి ఫైర్ 

సీఎం కేసీఆర్ పై వివేక్ వెంకటస్వామి ఫైర్ 
  • ఢిల్లీలో రాష్ట్ర మంత్రులు డ్రామాలాడుతున్నారు
  • కేసీఆర్ జిమ్మిక్కులను ప్రజలు గమనిస్తున్నారు

మహదేవపూర్, వెలుగు: ‘‘దళితులకు మూడెకరాల భూమి అన్నవ్, ఇయ్యలే.. దళిత ముఖ్యమంత్రి అన్నవ్, చెయ్యలే.. ఉద్యోగ నోటిఫికేషన్లు ఎయ్యలే.. నిరుద్యోగ భృతి అని చెప్పి ఇయ్యలే.. దళిత బంధు కూడా అమలు చేస్తలేవ్.. ఇన్ని హామీలిచ్చిన నువ్వు ఒక్కదానికన్నా లెటర్​ రాసియ్యలేవ్. మరి కేంద్రం వడ్లు కొంటమని చెబుతున్నా, నమ్మకుండా లెటర్ రాసివ్వమని ఎందుకు అడుగుతున్నవ్?” అని సీఎం కేసీఆర్ పై బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. వానాకాలం వడ్లు కొనకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని, రాష్ట్ర మంత్రులు ఢిల్లీకి వెళ్లి డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో జరిగిన బీజేపీ శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో వివేక్ పాల్గొన్నారు. అనంతరం అక్కడే పార్టీ జిల్లా అధ్యక్షుడు కన్నం యుగేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశానికీ హాజరయ్యారు. మాజీ మంత్రి విజయ రమణరావుతో కలిసి సమావేశాన్ని ప్రారంభించారు. బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గా ఎన్నికై తొలిసారి కాళేశ్వరానికి వచ్చిన వివేక్ ను నాయకులు ఘనంగా సన్మానించారు. 

టీఆర్ఎస్ పై ప్రజల్లో వ్యతిరేకత.. 
కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని సంస్థలనూ నాశనం చేశారని, మిగులు రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని వివేక్ ఆరోపించారు. కేసీఆర్ జిమ్మిక్కులను జనం గమనిస్తున్నారని, టీఆర్ఎస్ పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని చెప్పారు. సమస్యలపై పోరాడుతున్న బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు జనం సిద్ధంగా ఉన్నారన్నారు. టీఆర్ఎస్ అవినీతిపై ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన 50 మంది యువకులు వివేక్ సమక్షంలో బీజేపీలో చేరారు. అనంతరం జిల్లా రాజకీయ తీర్మానాన్ని భూపాలపల్లి నియోజకవర్గ ఇన్​చార్జి చంద్రుపట్ల కీర్తి రెడ్డి ప్రతిపాదించగా, రాష్ట్ర నాయకుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి ఆమోదించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చదువు రాంచంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుకల గణపతి, జిల్లా ఉపాధ్యక్షులు రాంబాబు, శ్రీధర్ పాల్గొన్నారు.