కమలంలో గులాబీ కన్ ఫ్యూజన్.. పొత్తుపై బీజేపీ లీడర్ల క్లారిటీలు

 కమలంలో గులాబీ కన్ ఫ్యూజన్..   పొత్తుపై బీజేపీ లీడర్ల  క్లారిటీలు

హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల్లో పొత్తలపై కమలం పార్టీలో కన్ ఫ్యూజన్ కొనసాగుతోంది.  ఇంతకూ గులాబీ పార్టీతో పొత్తు ఉంటుందా..? ఉండదా..? రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయా..? ఒంటరిగా బరిలోకి దిగుతాయా..? అన్నది గందరగోళంగా మారింది. దీనిపై బీఆర్ఎస్ నుంచి ఎలాంటి క్లారిటీ రాకపోగా.. కమలం నేతల స్టేట్ మెంట్లు కన్ఫ్యూజన్ కు గురి చేసేలా ఉన్నాయి. మొన్న ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ మాత్రం బీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత మాట మార్చి తానలా అనలేదని వివరణ ఇచ్చారు.

ఆ తర్వాత కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ దుకాణం బందైతదని, ఆ పార్టీ ఆఫీసుకు తాళాలు పడ్తాయంటూ కామెంట్ చేశారు. అదే సందర్బంగా ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ చెప్పుకొచ్చారు. ఇదే అంశంపై పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి హైదరాబాద్ లో క్లారిటీ ఇచ్చారు. తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పారు. మెజార్టీ సీట్లలో విజయం సాధిస్తామని అన్నారు. ఇవాళ చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద విజయ సంకల్ప్ యాత్ర బస్సులను ప్రారంభించిన సందర్భంలో ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్​ మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోదని, కాళ్లు మొక్కినా వారితో కలిసి ఎన్నికల బరిలోకి దిగబోమని అన్నారు. 

వన్ సైడ్ లవ్వేనా..?


బీజేపీ, బీఆర్ఎస్ పొత్తుల అంశం హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ ఈ అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తోందని బీజేపీ చెబుతోంది. ఇందుకోసం బీఆర్ఎస్ సోషల్ మీడియా టీంలు యాక్టివ్ గా పని చేస్తున్నాయని ఆరోపిస్తోంది. ఎన్డీఏలో చేరిక,  బీజేపీతో పొత్తు అంశాలపై బీఆర్ఎస్ నేతలు ఖండించకపోవడం ఇందుకు బలాన్ని చేకూర్చుతోంది.

త్వరలో ఢిల్లీకి కేసీఆర్!?


బీజేపీ, బీఆర్ఎస్ పొత్తులపై చర్చించేందుకు మాజీ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారని సమాచారం. ఇప్పటికే ఎన్డీఏలో చేరికపై ఎమ్మెల్యేల ఒపీనియన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. బీజేపీతో పొత్తుకు మెజార్టీ ఎమ్మెల్యేలు మొగ్గు చూపారని సమాచారం. 

మజ్లిస్ కటీఫ్​


బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పొత్తు కుదిరితే.. ఇప్పటి వరకు గులాబీ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న మజ్లీస్ కటీఫ్ చేయడం ఖాయం. బీజేపీ, మజ్లిస్ మధ్య సైద్దాంతిక వైరుధ్యం కారణంగా పతంగ్ పార్టీ కారు దిగి చేయిపట్టుకుంటుందా..? అన్నది చర్చనీయాంశంగా మారింది.