ఈడీ నోటీసులిస్తే.. మహిళా రిజర్వేషన్లు యాదికొచ్చినయా?

ఈడీ నోటీసులిస్తే.. మహిళా రిజర్వేషన్లు యాదికొచ్చినయా?

ఈడీ నోటీసులిస్తే.. మహిళా రిజర్వేషన్లు యాదికొచ్చినయా?
కవిత కూడా కేజ్రీవాల్‌‌ లెక్కనే మాట్లాడుతున్నరు: బీజేపీ
సీఎం కూతురు అయితే.. దర్యాప్తు సంస్థలను ఇంటికొచ్చి ప్రశ్నించమంటరా?
చట్టం అందరికీ ఒక్కటే.. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం కూడా ఈడీ 
ముందు విచారణకు హాజరయ్యారు
లిక్కర్ స్కామ్‌‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా

న్యూఢిల్లీ, వెలుగు : లిక్కర్ స్కామ్ గురించి ప్రశ్నిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాదిరి మాట్లాడుతున్నారని బీజేపీ నేతలు విమర్శించారు. ‘‘లిక్కర్ స్కాం గురించి అడిగితే.. ఢిల్లీ స్కూళ్ల గురించి కేజ్రీవాల్ మాట్లాడుతున్నారు. కవితకి నోటీసులు ఇస్తే.. మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు” అని ఎద్దేవా చేశారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌‌‌‌కు వ్యతిరేకంగా శుక్రవారం ఢిల్లీ బీజేపీ ఆధ్వర్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీసు ఉన్న దీన్ దయాళ్ మార్గ్‌‌‌‌లో ఆందోళన చేపట్టారు. పార్టీ ఎంపీలు పర్వేశ్ వర్మ, రమేశ్ బిధూరి, రాష్ట్ర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న మాజీ మంత్రులు మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్ ఫొటోలతో నిరసన తెలిపారు. లిక్కర్ స్కామ్‌‌‌‌కు బాధ్యత వహిస్తూ సీఎం కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. బీజేపీ నేతలు ఆప్ ఆఫీసులోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు. పలువురిని అదుపులోకి తీసుకుని స్టేషన్​కు తరలించారు.

బీజేపీ ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ, సీఎం కూతురు కాబట్టి కవిత దర్యాప్తు సంస్థలను ఇంటికొచ్చి ప్రశ్నించమంటున్నారని మండిపడ్డారు. స్కామ్​ చేస్తే జైలుకు వెళతారని.. చెయ్యకపోతే దర్యాప్తు సంస్థల ముందు ధైర్యంగా చెప్పాలన్నారు. చట్టం అందరికీ ఒక్కటేనని, ఈ స్కాంలో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం కూడా ఈడీ ముందు విచారణకు హాజరయ్యారని చెప్పారు.