రాజకీయంగా ఎదుర్కోలేకే దాడులు

రాజకీయంగా ఎదుర్కోలేకే దాడులు
  • ఎంపీ అర్వింద్ పై దాడిన ఖండించిన బీజేపీ నేతలు
  • బీజేపీని చూసి టీఆర్ఎస్ భయపడుతుందని కామెంట్
  • రాజ్యాంగాన్ని కేసీఆర్ పక్కన పెట్టారు
  • మేం దాడి చెయ్యలేదంటున్న రైతులు

రాజకీయంగా ఎదుర్కోలేకే దాడులు: వివేక్

తెలంగాణలో రోజు, రోజుకు బీజేపీ బలపడుతుండడం చూసి భయపడుతున్న టీఆర్ఎస్.. రాజకీయంగా ఎదిరించలేక పార్టీ నేతలను టార్గెట్ చేసుకొని ఈ దాడులకు పాల్పడుతోందని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి టీఆర్ఎస్ పై మండిపడ్డారు. ఎంపీ అర్వింద్ పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పిందని, పోలీసులు టీఆర్ఎస్ కు కొమ్ముకాసే రీతిలో వ్యవహరించడం సరికాదని హెచ్చరించారు. అర్వింద్ పై దాడికి పాల్పడ్డ టీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

పోలీసులు పట్టించుకోకపోవడం దారుణం: ఎమ్మెల్యే ఈటల

టీఆర్ఎస్ సర్కార్ తీరుతో తెలంగాణలో శాంతి భద్రతలు లేకుండా పోతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. ఎంపీ అర్వింద్ పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. దాడులకు పాల్పడ్డ టీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల సమక్షంలోనే బీజేపీ నేతలను కత్తితో పొడిచేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు.

రాజ్యాంగాన్ని పక్కన పెట్టిన కేసీఆర్: ఎమ్మెల్యే రాజాసింగ్

సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి పాలన సాగిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. అర్వింద్‌పై దాడిని ఆయన ఖండించారు. ప్రజాప్రతినిధిగా ప్రజల్లోకి వెళ్లడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని.. కానీ  కేసీఆర్ ఈ హక్కును కాలరాసేలా దాడులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. దాడిని ఎంపీ సోయం బాపూరావు,  బీజేపీ నేతలు ప్రేమేందర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, శాంతి కుమార్, రాకేశ్ రెడ్డి తదితర నేతలు తీవ్రంగా ఖండించారు.

అర్వింద్‌‌‌‌ను అడ్డుకున్నది పసుపు రైతులే: జీవన్ రెడ్డి 
ఎంపీ అర్వింద్ ను అడ్డుకున్నది టీఆర్ఎస్ శ్రేణులు కాదని, పసుపు రైతులేనని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రైతులకు సమాధానం చెప్పలేకనే మామిడిపల్లి వద్ద నడిరోడ్డుపై అర్వింద్ నాటకాలు ఆడారని, రైతుల ముందుకెళ్లే ధైర్యం లేకనే టీఆర్ఎస్‌పై ఆరోపణలు చేశారని విమర్శించారు. ‘‘ఎంపీగా గెలిపిస్తే పసుపు బోర్డు తెస్తానని చెప్పావా? లేదా? పసుపుబోర్డు తేలేకపోతే రాజీనామా చేస్తానని బాండ్ పేపర్ రాసిచ్చావా? లేదా?” అని అర్వింద్ ను ప్రశ్నించారు. కేసీఆర్ జోలికొస్తే బొందపెడతామని హెచ్చరించారు.

మేం దాడి చెయ్యలే: రైతు ఐక్య వేదిక 

ఎంపీ అర్వింద్‌పై జరిగిన దాడికి, పసుపు రైతులకు ఎలాంటి సంబంధం లేదని రైతు ఐక్య వేదిక ప్రతినిధులు సంతోశ్ రెడ్డి, వెంకట్ రెడ్డి చెప్పారు. అర్వింద్‌పై దాడిని ఖండిస్తున్నామని మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. కొంతమంది టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే దాడి చేసి, పసుపు రైతులు చేశారని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల పేరుతో రాజకీయాలు, తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలన్నారు. అలాంటి వారిని రానున్న ఎన్నికల్లో రాజకీయ సమాధి చేస్తామని చెప్పారు.