రాష్ట్ర బీజేపీకి రామ మందిర ఇష్యూ కలిసొస్తదా?.. లోక్​సభ ఎన్నికల్లో విస్తృత ప్రచారానికి ప్లాన్

రాష్ట్ర బీజేపీకి రామ మందిర ఇష్యూ కలిసొస్తదా?.. లోక్​సభ ఎన్నికల్లో విస్తృత ప్రచారానికి ప్లాన్
  • జాతీయ స్థాయి నేతలతోనూ చెప్పించే యత్నం

హైదరాబాద్​, వెలుగు: రానున్న లోక్​సభ ఎన్నికలపై అయోధ్య రామ మందిరం ఎఫెక్ట్​ ఉంటుందని బీజేపీ నేతలు అంటున్నారు. ఆ ఎజెండాతోనే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు పార్టీ పెద్దలు. మందిరం సెంటిమెంట్ ను క్యాష్​ చేసుకోవాలన్న యోచనలో బీజేపీ నేతలు ఉన్నారు. ఇప్పటికే అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఇంటింటికీ అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్ట్​ తరఫున అక్షింతలు పంచిపెట్టారు. మందిరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన తీరును నేతలు వివరించనున్నారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న విజయ సంకల్ప యాత్రల్లో మందిరం అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ఈసారి ఎన్నికల్లో కనీసం పది స్థానాలను గెలిచేలా ప్రణాళిక రచిస్తున్నారు. 

బీఆర్ఎస్  ఓటు బ్యాంకును తిప్పుకుంటారా?

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటు షేర్​ 17 శాతానికిపైగా ఎగబాకింది. అంతకుముందున్న 8 శాతం ఓటు బ్యాంకుతో పోలిస్తే ఇప్పుడు దాదాపు డబుల్​ అయింది. అసెంబ్లీ ఎన్నికలు, లోక్​సభ ఎన్నికలను ప్రజలు వేర్వేరుగా చూస్తారని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక పరిస్థితులను బేరీజు వేసుకుంటారని, లోక్​సభ ఎన్నికలకు వచ్చేసరికి జాతీయ స్థాయిలో ఉన్న అంశాలను చూస్తారని చెబుతున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్​ పరిస్థితి దిగజారిపోవడంతో అది తమ పార్టీకి  కలిసి వస్తుందని పార్టీ పెద్దలు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్​ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునేందుకు ఇదే మంచి సమయమని భావిస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్​ ఓటు బ్యాంకును కూడా రామాలయం సెంటిమెంట్​తో ముడిపెడితే పార్టీ వైపు చాలా మంది మొగ్గు చూపే అవకాశాలుంటాయని ఆలోచిస్తున్నారు. గత లోక్ సభ  ఎన్నికల్లో బీజేపీకి 18.6 శాతం ఓట్లు పోలవగా.. ఇప్పుడు మందిరం సెంటిమెంట్ తో దానిని రెట్టింపు చేసుకోవాలన్న టార్గెట్​తో పనిచేస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల జోష్​తో

రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బలం మూడు నుంచి ఎనిమిది స్థానాలకు చేరింది. ఉత్తర తెలంగాణలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో గతంతో పోలిస్తే ఓట్​ షేర్​ పెరిగింది. ఇప్పుడు దానిని మరింత పెంచుకోవాలని భావిస్తున్నది. అయితే, దక్షిణ తెలంగాణలో పార్టీ చాలా వీక్​గా ఉంది. ఇక్కడ బీజేపీకి ఓటు బ్యాంకు చాలా తక్కువగా ఉంది. ఇక్కడ ఓటు బ్యాంకును పెంచుకునేందుకు ఏం చేయాలన్న దానిపై బీజేపీ నేతలు కసరత్తు  ప్రారంభించారు. అందులో భాగంగానే అయోధ్య రామాలయాన్ని ఎజెండాలో పెట్టుకోవాలని భావిస్తున్నారు. క్లస్టర్ల వారీగా చేపడుతున్న విజయ సంకల్ప యాత్రల్లో రామాలయం విశిష్టతను పార్టీ నేతలు వివరించనున్నారు. ఆ ఆలయ నిర్మాణం కోసం బీజేపీ పడిన శ్రమను ప్రజలకు తెలియజేయనున్నారు. ఇప్పటికే ప్రజల్లో రామాలయం సెంటిమెంట్​ పెరిగిందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జాతీయ స్థాయి నేతలు వచ్చి రామాలయంపై ప్రచారం చేస్తే.. ఆ సెంటిమెంట్ మరింత పెరుగుతుందన్న యోచనలో పార్టీ పెద్దలు ఉన్నారు. అందుకే కేంద్ర మంత్రులు, ఉత్తరాది రాష్ట్రాల సీఎంలను యాత్రలకు పిలిపించి వారితో రామాలయం గురించి ప్రచారం చేయించనున్నారు.

ALSO RAED : మేడారానికి పోటెత్తిన భక్తులు.. ఆదివారం ఒక్క రోజే 5లక్షల మంది దర్శనం