నిర్భందాలు, కేసులతో రాజ్యం నడపలేరు

నిర్భందాలు, కేసులతో రాజ్యం నడపలేరు

పోలీసుల దాడులు బీజేపీ ఉద్యమాన్ని ఆపలేవన్నారు బీజేపీ నేతలు.  అధికార పక్షానికి ఓ న్యాయం..ప్రతిపక్షానికి ఓ న్యాయమా అని ప్రశ్నించారు. మంత్రులు కేటీఆర్, గంగుల మాస్క్ లు లేకుండానే కార్యక్రమాల్లో పాల్గొన్నారన్నారు. నిర్బంధం, కేసుల ద్వారా రాజ్యం నడపలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల తరుపున బీజేపీ పోరాటం కొనసాగుతుందన్నారు ఎమ్మెల్యేలు. బండి సంజయ్‌ను అరెస్టు చేసిన తీరును ఖండిస్తూ బీజేపీ నేతలు, ఎమ్మెల్యేలు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

బీజేపీ కేసులకు భయపడదు

పోలీసులు అధికార పక్షానికి కొమ్ము కాస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. బండి సంజయ్‌ను అరెస్ట్ చేసిన తీరు ప్రభుత్వ క్రూరత్వానికి నిదర్శనమన్నారు. అధికార పార్టీ కరోనా పేరుతో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని ఫైర్ అయ్యారు. నల్గొండలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పర్యటనలో వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారని, అప్పుడు అడ్డురాని కరోనా ఇప్పుడు అడ్డొచ్చిందా అని ప్రశ్నించారు. జీవో 317తో టీచర్లకు, ఉద్యోగులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ సంజయ్ తన కార్యాలయంలో జాగరణ కార్యక్రమంతో నిరసన వ్యక్తం చేస్తుంటే.. ఏదో శత్రు సైన్యంతో ఘర్షణ పడినట్టుగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ వ్యవహరించారని అన్నారు. టీచర్లు, ఉద్యోగుల పక్షాన నిలబడిన బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడం సిగ్గు చేటన్నారు. టీఆర్ఎస్‌కు రాబోయే రోజుల్లో చెడు అనుభవాలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో కేసీఆర్ తన సొంత రాజ్యంగం అమలు చేస్తూ.. ఒక చక్రవర్తిలా పాలన చేస్తున్నారని మండిప్డారు ఈటల. బీజేపీ కేసులకు భయపడదని, హుజూరాబాద్ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీఆర్‌‌ఎస్ ఆగమవుతోందని, కాళ్ల కింద భూమి కదులుతోందని అన్నారు.

రాష్ట్రంలో ప్రతి సమస్యపైనా ఉద్యమిస్తాం

317జీవో ఎందుకు సవరించరో చెప్పాలన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి. రాష్ట్రంలోని ప్రతి సమస్యపై ఉద్యమిస్తామన్నారు. ప్రతిపక్షాల దీక్షలకు, ధర్నాలు ఎందుకు పర్మిషన్ ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. బీజేపీ ఎదుగుదలను అడ్డుకోవాడానికి టీఆర్ఎస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఎన్ని అక్రమ కేసులు, అరెస్టులు చేసినా జీవో 317 రద్దేయ్యే వరకు బీజేపీ పోరాటం చేస్తుందన్నారు.

డీజీపీ.. మీకు సోకు ఉంటే రాజకీయాల్లోకి రండి

కొవిడ్ నిబంధనలపై డిసెంబర్ డిసెంబర్ 25 న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, ఆ తర్వాత నల్గొండ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్ కనీసం మాస్క్ కూడా పెట్టుకోలేదని ఎమ్మెల్యే రఘునందన్‌ అన్నారు. ఆ తర్వాత మంత్రి కేటీఆర్‌‌ కూడా నల్గొండలో పర్యటించారని, ఆయనా మాస్క్ పెట్టుకోలేదని చెప్పారు. నిన్న కరీంనగర్‌‌లో మంత్రి గంగుల కమలాకర్ పర్యటించగా.. ఆయన కూడా కరోనా నిబంధనలను ఉల్లంఘించారని గుర్తు చేశారు. ఈ టీఆర్‌‌ఎస్ నేతలందరి పర్యటనల్లో భారీగా జనాలు పాల్గొన్నారని, వీరెవరికీ వర్తించని నిబంధనలు తన కార్యాలయంలో బండి సంజయ్ జాగరణ కార్యక్రమం పెట్టుకుంటే వర్తిస్తుందాఅని ఎమ్మెల్యే రఘునందన్ నిలదీశారు. కరీంనగర్ సీపీ వివాదాస్పదుడని, ఆయన ఆధ్వర్యంలో లా అండ్ ఆర్డర్ పరిరక్షణ సాధ్యం కాదన్నారు. ఓల్డ్ సిటీలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వేల మందితో కార్యక్రమం నిర్వహిస్తున్నారని, అక్కడ ఎంత మందిపై కేసు పెట్టారని అన్నారు. డీజీపీకి కూడా సోకు ఉంటే రాజకీయాల్లోకి రావాలని సూచించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల కోసం బీజేపీ పోరాటం చేస్తోందని చెప్పారు.