వరంగల్ లో బీజేపీ కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తం

వరంగల్ లో  బీజేపీ కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తం

హనుమకొండ/ములుగు/జనగామ అర్బన్‌, వెలుగు: డబుల్‌‌‌‌‌‌‌‌ ఇండ్లతో పాటు, ఎన్నికల టైంలో సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తంగా మారింది. హనుమకొండలో బీజేపీ లీడర్లు కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా వారిని అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసి సుబేదారి స్టేషన్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ మాట్లాడుతూ పేదలకు ఇండ్లు కట్టించి ఇస్తామని చెప్పిన బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. పేదలందరికీ డబుల్‌‌‌‌‌‌‌‌ ఇండ్లు రావాలంటే బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పాలన అంతమై బీజేపీ అధికారంలోకి రావాలన్నారు.

కార్యక్రమంలో జిల్లా ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి మురళీధర్‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌, నాయకులు గురుమూర్తి శివకుమార్, పెసరు విజయ చందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, దేశిని సదానందంగౌడ్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు. అలాగే ములుగులో బీజేపీ లీడర్లు ర్యాలీ నిర్వహించిన అనంతరం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌ ముట్టడికి ప్రయత్నించారు. బీజేపీ లీడర్లు, కార్యకర్తలు కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌ గేట్‌‌‌‌‌‌‌‌ ఎక్కి లోపలికి దూకేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరుగగా ఇద్దరు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్‌‌‌‌‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ యువకుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ నిజాం రాక్షస పాలన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమలుకాని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రజల కోసం ప్రశ్నించే బీజేపీ లీడర్లపై దాడులు చేస్తూ అణచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అర్హులందరికీ డబుల్‌‌‌‌‌‌‌‌ ఇండ్లు, దళితులకు మూడు ఎకరాల భూమి, నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపు రమేశ్‌‌‌‌‌‌‌‌, గాజుల కృష్ణ, గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తాటి కృష్ణ, పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ జాయింట్ కన్వీనర్‌‌‌‌‌‌‌‌ తక్కెలపల్లి దేవేందర్‌‌‌‌‌‌‌‌రావు, అసెంబ్లీ కన్వీనర్ సిరికొండ బలరాం, జిల్లా ఉపాధ్యక్షుడు జవహర్‌‌‌‌‌‌‌‌లాల్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు. జనగామలో జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి ఆధ్వర్యంలో కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌ను ముట్టడించారు. అనంతరం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి క్యాంప్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ను ముట్టడించగా బీజేపీ లీడర్లను పోలీసులు అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసి స్టేషన్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. కార్యక్రమంలో ఉడుగుల రమేశ్‌‌‌‌‌‌‌‌, లేగ రామ్మెహన్‌‌‌‌‌‌‌‌రెడ్డి, సౌడ రమేశ్‌‌‌‌‌‌‌‌, శివరాజ్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌, బల్ల శ్రీనివాస్, బేజాడి బీరప్ప పాల్గొన్నారు.