టీఆర్ఎస్ కార్యకర్తలు గూండాల్లా వ్యవహరిస్తున్నరు

టీఆర్ఎస్ కార్యకర్తలు గూండాల్లా వ్యవహరిస్తున్నరు

హైదరాబాద్: టీఆర్ఎస్ కార్యకర్తలు గూండాల్లా ప్రవర్తిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్రలో ఉన్న బండి సంజయ్ పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని ఈటల రాజేందర్ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేకే టీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బండి సంజయ్ పై జరిగిన దాడిని చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోందని తెలిపారు. ప్రతిపక్ష నాయకులపై దాడి చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ఇలాంటి నీచమైన సంస్కృతిని రాజకీయాలకు అంటిస్తే.. టీఆర్ఎస్ అందులోనే మాడి మసై పోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీఆర్ఎస్ పై రోజురోజుకు ప్రజల్లో విశ్వాసం తగ్గుతోందన్న ఆయన... అందుకే టీఆర్ఎస్ నేతలు అసహనానికి గురవుతున్నారని చెప్పారు. చట్టపరంగా వ్యవహరించాల్సిన పోలీసులు టీఆర్ఎస్ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా పోలీసులు తమ వైఖరి మార్చుకోవాలని సూచించారు. భవిష్యత్తులో టీఆర్ఎస్ నాయకులు ఇదే తరహాలో ప్రవర్తిస్తే...తమ ఆగ్రహానికి గురుకాక తప్పుదని ఈటల రాజేందర్ హెచ్చరించారు.