ఆంజనేయులు కుటుంబాన్ని పరామర్శించిన ఈటల

 ఆంజనేయులు కుటుంబాన్ని పరామర్శించిన ఈటల
  • ఆంజనేయులు మృతిపై అనుమానాలున్నాయి
  • సీఎం ఫామ్​హౌజ్​ బావిలో పడి చనిపోయిన యువకుడు
  • ఆంజనేయులు కుటుంబాన్ని పరామర్శించిన ఈటల
  • ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్

గజ్వేల్, వెలుగు: సీఎం కేసీఆర్​ ఫామ్​ హౌజ్​లో బావిలో పడి చనిపోయిన ఆంజనేయులు మృతిపై చాలా అనుమానాలున్నాయని, ఈ ఘటనపై  విచారణ జరిపించి నిజాలు బయటపెట్టాలని బీజేపీ నేత, హుజూరాబాద్​ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన సిద్దిపేట జిల్లా మర్కూక్​ మండలంలోని వరదరాజ్​పూర్​లో ఆంజనేయులు కుటుంబాన్ని పరామర్శించి రూ. 50వేల సాయాన్ని అందజేశారు. బాగా ఈత వచ్చిన ఆంజనేయులు  నీటిలో మునిగి చనిపోయాడంటే నమ్మకం కలగడంలేదని, అసలు ఆయన పనికే రాలేదని ముందు పోలీసులు బుకాయించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ సమాచారాన్ని బయటకు పొక్కకుండా చూశారని, అక్కడే  పోస్టుమార్టం చేశారని,  డెడ్​బాడీని  ఊరికి తీసుకొచ్చిన వెంటనే అంత్యక్రియలు చేసేయాలని తొందర పెట్టారని ఆరోపించారు.  సీఎం కేసీఆర్​ ఈ ప్రాంతానికొస్తే తమకు  రక్షణ ఉంటుందని ఆశించిన ప్రజలను ఈ ఘటన భయపెడుతోందన్నారు. ఈ ఫామ్​ హౌజ్​ వచ్చిన తర్వాత హింస అనుభవిస్తున్నట్టు ప్రజలు వాపోతున్నారనితెలిపారు. సీఎం ఫామ్​హౌజ్​లో చనిపోయిన ఆంజనేయులు కుటుంబాన్ని ఆదుకుంటామన్న భరోసా కూడా ఎవరూ ఇవ్వలేదన్నారు. తమ పొలంలో పనిచేస్తూ ఎవరైనా చనిపోతే యజమానులు  బాధిత కుటుంబాన్ని పరామర్​శిస్తారని, సీఎం మాత్రం వారిని  పట్టించుకోకపోవటం దారుణమన్నారు. చావు ఖర్చులకు రూ.50 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని అన్నారు.

వడ్లు కొంటున్నది కేంద్రమే 
జడ్చర్ల,వెలుగు : గత ఏడేండ్లుగా వడ్లను కొంటున్నది కేంద్రమేనని, టీఆర్​ఎస్​ ఆధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క గింజ కూడా కేసీఆర్​ కొనలేదని హుజూరాబాద్​ఎమ్మెల్యే ఈటల రాజేందర్​  అన్నారు.  కేసీఆర్​ యాసంగి వడ్లపై రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. మహాబూబ్​నగర్​ జిల్లా రాజాపూర్​ మండలం ఈద్గాన్​పల్లి లో ఆదివారం  స్వామి వివేకానందుని విగ్రహాన్ని బీజేపీ నేషనల్​ వైస్​ ప్రెసిడెంట్​  డీకే అరుణతో కలిసి ఆవిష్కరించారు. మొదటి నుంచి  కేంద్రమే వడ్లు కొనుగోలు చేస్తే ,అవి  రాష్ట్రమే కొంటున్నట్టు కేసీఆర్​ జిమ్మిక్కులు చేశారన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ హుజూరాబాద్​ ఫలితాలే రిపీట్​అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్​ఎస్​ను  గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్​ అవినీతి బట్టబయలు కానుందని  డీకే అరుణ  అన్నారు.రాష్ట్రంలో అవినీతి రాజ్యం ఏలుతోందని తెలిపారు.

మల్లన్నకు పట్టుబట్టలు పెట్టిన ఈటల 
కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి మల్లికార్జున స్వామిని మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం మల్లన్న కల్యాణానికి హాజరై, పట్టువస్త్రాలు సమర్పించారు. హూజూరాబాద్​లో ధర్మం గెలవాలని కోటొక్క దేవుళ్లను మొక్కానని, ప్రజలు కోరుకున్నట్టుగానే ధర్మ గెలిచిందని ఆయన విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. అందుకే  కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్నట్టు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని,  కొమురవెల్లితో సహాతెలంగాణలోని అన్ని గుడులను గొప్పగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ లీడర్లు బూరుగు సురేష్,  దండ్యాల వెంకట్ రెడ్డి,  పంజాల మల్లేశం, ఉడత మల్లేశం యాదవ్, గన్నబోయిన శ్రీను తదితరులు  
పాల్గొన్నారు.