నిజామాబాద్: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మరోసారి బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రజల సొమ్మును ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాళ్ల దగ్గర మంత్రి ప్రశాంత్ రెడ్డి దారబోస్తున్నారని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎంపీ అరవింద్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. బాల్కొండ నియోజకవర్గంలో కట్టిన ప్రతీ బిడ్జిపై ఎమ్మెల్సీ కవితకు కమీషన్ వెళ్తోందన్నారు. ఒకే పనికి ఓ వైపు రోడ్ కార్పొరేషన్ డెవలెప్ మెంట్, మరోవైపు కేంద్రం నిధులు ఇచ్చినట్లు డబుల్ బిల్లింగ్ చేస్తున్నారని ఆరోపించారు. రోడ్ కార్పోరేషన్ డెవలప్‌మెంట్ నుంచి కట్టినట్టు శిలాఫలకం వేసి.. కేంద్రం ద్వారా నిధులు పొందినట్టు కేంద్రానికి యుటిలైజేషన్ సర్టిఫికెట్ ఇచ్చారని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా రూ.5వేల కోట్లకు పైగా స్కామ్ జరిగిందని ఎంపీ అరవింద్ ఆరోపణలు చేశారు.
