బీజేపీ ఎంపీ.. ఫోన్ ఆర్డర్ పెడితే రాయి వచ్చింది

బీజేపీ ఎంపీ.. ఫోన్ ఆర్డర్ పెడితే రాయి వచ్చింది
  • ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టింది శాంసంగ్ ఫోన్
  • ఓపెన్ చేస్తే రెడ్ మీ బాక్స్.. దానిలో మార్బుల్ స్టోన్స్

దీపావళి ఆఫర్ లో ఓ ఈ-కామర్స్ సైట్ లో నచ్చిన ఫోన్ మంచి డిస్కౌంట్ లో కనిపించింది. కొనేద్దాం అని ఆర్డర్ పెట్టారు పశ్చిమ బెంగాల్లోని మాల్దా నియోజకవర్గ బీజేపీ ఎంపీ ముర్ము. కానీ, సోమవారం దాని డెలివరీ అందుకున్న తర్వాత ఆయనకు షాకులు మీద షాకులు తగిలాయి. ఫోన్ బదులు రాళ్లు ఉండడంతో అవాక్కయ్యారాయన.

రెడ్ మీ బాక్స్ లో మార్బుల్ స్టోన్స్

సోమవారం ఉదయం డెలివరీ బాయ్ ఇంటికి వచ్చి ప్యాకేజీ ఇచ్చి వెళ్లాడు. ఆ సమయంలో ఎంపీ లేకపోవడంతో ఆయన భార్య దాన్ని తీసుకున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత ముర్ము దాన్ని ఓపెన్ చేస్తే రెడ్ మీ 5ఏ ఫోన్ బాక్స్ కనిపించింది. కానీ ఆయన ఆర్డర్ చేసిందేమో శాంసంగ్ ఫోన్. ఇదేంట్రా బాబు అనుకుంటూ బాక్స్ తెరిచి చూసి అవాక్కయ్యాడాయన. అందులో కనీసం రెడ్ మీ ఫోన్ కూడా లేదు కదా.. రెండు మార్బుల్ స్టోన్స్ కనిపించాయి.

పోలీసులకు ఫిర్యాదు

రూ.11,999 ఫోన్ ఆర్డర్ పెడితే రాళ్లు వచ్చాయంటూ ఈ-కామర్స్ వెబ్ సైట్ పై ఎంపీ ముర్ము ఇవాళ పోలీసు కేసు పెట్టారు. దీనిపై విచారించి యాక్షన్ తీసుకుంటామని పోలీసు అధికారి అలోక్ రాజోరియా చెప్పారు.

నా తొలి ఆన్ లైన్ ఆర్డర్ ఇది

తాను గతంలో ఎప్పుడూ ఆన్ లైన్ లో ఎటువంటి ఆర్డర్లూ పెట్టలేదని ఎంపీ ముర్ము చెప్పారు. ఆన్ లైన్ లో తాను చేసిన తొలి ఆర్డర్ ఇదేనని అన్నారాయన. ఈ రకమైన మోసాలు జరగడం దారుణమని, దీనిపై తాను కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.