బీజేపీని లైట్​ తీసుకుంటే ఇంత వణుకుడెందుకు?

బీజేపీని లైట్​ తీసుకుంటే ఇంత వణుకుడెందుకు?

కేసీఆర్, టీఆర్ఎస్​ నేతల వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీల ఫైర్

ఈ నలుగురే.. టీఆర్ఎస్​ను బొందలకు తోస్తరు: అర్వింద్​

అలసిపోయి ఫామ్‌ హౌస్​లో పంటున్నదెవరు?

నీ కొడుక్కు ముఖ్యమంత్రి కావాలని షోకున్నది

అది ఇప్పుడే తీర్చేస్కోండి.. భవిష్యత్తులో చాన్స్​ రాదు

రాజకీయం చేయడానికి టీఆర్ఎస్​ మిగలది

మున్సిపల్​ ప్రక్రియలో అవకతవకలు: బండి సంజయ్

 కేసీఆర్‌ దొరతనంతో పోతున్నరు: సోయం బాపురావు

హైదరాబాద్‌‌, వెలుగు : ‘‘బీజేపీ అంటే నీకు భయం లేకుంటే, వణుకు పుట్టలేదనకుంటే, డైరెక్ట్ ఎన్నికలు పెట్టు.. అప్పుడు నీ దమ్ము ఎంతుందో చూస్తం. బీజేపీ గురించి, ఎంపీల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకో. సబ్జెక్ట్‌‌ మీద ప్రశ్నిస్తే దాని మీద మాట్లాడడు. ఏమన్న అంటే అరిచి అరిచి ఊరుకుంటరు అంటడు. బిడ్డా.. చిట్టాలిప్పినమంటే పొట్లాలు పగుల్తయ్‌‌. నలుగురం అరిచి అరిచి అలిసిపోతం అంటున్నవ్‌‌.. అలిసిపొయి ఫామ్‌‌ హౌజ్‌‌లో పంటున్నదెవరు; సెక్రటేరియెట్‌‌కు రానిదెవరు..’’ అని సీఎం కేసీఆర్ పై బీజేపీ నిజామాబాద్‌‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌‌ మండిపడ్డారు. బుధవారం ఢిల్లీలో బీజేపీ ఎంపీలు అర్వింద్‌‌, బండి సంజయ్‌‌, సోయం బాపురావు మీడియాతో మాట్లాడారు. కేసీఆర్​ తన బిడ్డనే గెలిపించుకోలేకపోయారని, టీఆర్ఎస్​ పార్టీని ఏం కాపాడుతారని అర్వింద్​ ఎద్దేవా చేశారు. అర్వింద్​ చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే..

జాగ్రత్తగా మాట్లాడాలె..

‘‘పొద్దస్తమానం నలుగురే గెలిచారని అంటున్నావ్.. దిక్కులు కూడా నాలుగే ఉంటయి, ఈ నలుగురం కల్సి చూపు నీ దిక్కు పెడితే దిక్కుమాలిన స్థితికి చేరుతవ్‌‌.. ఆ నలుగురే నీ టీఆర్‌‌ఎస్‌‌ పార్టీని బొందలకు తొస్తరు. జాగ్రత్తగా మాట్లాడాలె. రాష్ట్ర ప్రజలనే కాదు.. నీ కొడుకును కూడా మభ్య పెడ్తున్నవ్‌‌. ఆయనకు సీఎం కావాలని సోకున్నది. ఆ సోకు ఇప్పుడే తీర్చేస్కో.. రానున్న కాలంల నీ కొడుకు రాజకీయం చేయడానికి రాజకీయ పార్టీ మిగలది. అదేదో ఎమ్మెల్యేల మీటింగ్‌‌ పెట్టుకుని, రిజల్యుషన్‌‌ పాస్‌‌ చేస్కుని సీఎం చేసెయ్‌‌.

తుగ్లక్​ రాజ్యం ఆపు..

ఎవడో స్వామి చెప్పిండని సెక్రటేరియెట్‌‌ కూలగొట్టుడెందుకు? వందల కోట్లతో కొత్తది కట్టుడెందుకు? నీ గవర్నమెంట్ల జీతాలు ఇయ్యనీకే పైసల్లేవ్‌‌. సెక్రటేరియెట్‌‌ ఏడికెళ్లి కడ్తవ్‌‌. చివరికి తెలంగాణ ప్రజలకు సెక్రటేరియెట్‌‌ లేకుంట ఐతది. తుగ్లక్​ రాజ్యం ఆపు. నీకు ఉప ప్రధాని కావాలనె సోకుండె. మోడీ, బీజేపీ భయంతోనే ముందస్తు ఎన్నికలకు పోయినవ్. ఆ భయంతోనే పార్లమెంట్‌‌ రిజల్ట్​ రాకముందే లోకల్‌‌ బాడీ ఎన్నికలు పెట్టుకున్నవ్.. ఇప్పుడా దడతోటే మున్సిపల్‌‌ ఎన్నికల హడావుడి పడ్తున్నవ్. నిజంగ దమ్ము, ధైర్యం ఉంటే.. రిజర్వేషన్లు కన్ఫామ్​ అయినంక వాటిని చాలెంజ్​ చేసుకోవడానికి 15 రోజులు టైమియ్యి.

ఓటరు పేరు డాడా.. నాయన పేరు హాహా

ఓటరు లిస్టు తప్పుల తడకగా ఉంది. మీడియాలో కూడా వార్తలొచ్చినయి. జనగాంలో ఓ బీసీ ఓటరును ఎస్సీగా చూపించిన్రు. ఒక ఓటరు పేరు డాడా.. వాళ్ల నాయన పేరు హాహా అని ఉన్నది. ఆర్మూర్‌‌ ప్రాంతంలో రెండు గ్రామాలను వార్డులో కలిపిండ్రు. మూడు వేల ఓట్లు పెరిగినై. అనుకూలంగా రిజర్వేషన్లు మార్చుకుంటున్నడు. బీజేపీని లైట్‌‌ తీసుకునేది ఉంటే ఇంతగనం వణుకు ఎందుకు పుడుతున్నది? ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిసినవ్‌‌. మహిళలు, యువకులను భయపెట్టించి.. ఓడిపోతే సంక్షేమ పథకాలు ఆగుతయని బెదిరించింది నిజం కాదా?” అని అర్వింద్  ప్రశ్నించారు.

తప్పదోవపట్టిస్తున్నరు: బండి సంజయ్‌‌

సీఎం కేసీఆర్‌‌, టీఆర్‌‌ఎస్‌‌ నేతలు అబద్ధాలతో దేశ ప్రజలు, పార్లమెంట్‌‌ను కూడా తప్పుదారి పట్టిస్తున్నారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌‌ విమర్శించారు. డబుల్‌‌ బెడ్రూం ఇండ్లకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఇప్పటిదాకా ఎంత మందికి ఇచ్చారు, ఇంకా ఎంత మందికి ఇస్తారు, ఎంత మంది గృహ ప్రవేశం చేయబోతున్నారో చెప్పాలని డిమాండ్​ చేశారు. మున్సిపల్‌‌ ఎన్నికలకు టీఆర్ఎస్​ సర్కారే సమయం అడిగిందని, కోర్టు సమయం ఇచ్చినా.. హడావుడిగా ఎలక్షన్లు ఎందుకు పెడుతున్నారని నిలదీశారు. ‘‘కొత్త మున్సిపాలిటీ చట్టంపై చర్చ జరగకుండానే, అసెంబ్లీ ఆమోదం తెలపకముందే ఎన్నికల కోసం హడావుడిగా పోతున్నరు. ఓటరు జాబితా, గ్రామాల విలీనం, వార్డుల విభజన, రిజర్వేషన్లు అందించడంలో మొత్తం అవకతవకలు జరిగాయి. రాష్ట్రంలోని అనేక మున్సిపాలిటీల్లో ఎలక్షన్​పై కోర్టు స్టే ఇచ్చింది. దీనిపై టీఆర్‌‌ఎస్‌‌ పార్టీ సిగ్గుతో తలవంచుకోవాలి”అని సంజయ్‌‌ పేర్కొన్నారు. పచ్చ జెండా, గులాబీ జెండా కలిసి నగరాల్లో అధికారం చలాయించడానికి వస్తున్నాయని, తాము మాత్రం అభివృద్ధి కోసం కాషాయ జెండాతో వస్తున్నామని చెప్పారు. టీఆర్‌‌ఎస్‌‌ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మున్సిపల్​ ఎలక్షన్లలో బీజేపీ జెండా ఎగురవేస్తుందన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని, పట్టణాల్లో అభివృద్ధి జరగాలంటే తమ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు.

కేసీఆర్​ది దొరతనం

సీఎం కేసీఆర్‌ దొరతనంతో వ్యవహరిస్తున్నారని, దాన్ని వ్యతిరేకించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు అన్నారు. కొత్త అసెంబ్లీ, సెక్రటేరియెట్‌ నిర్మాణంతో రాష్ట్ర ప్రజలపై భారీగా ఆర్థిక భారం పడుతుందని చెప్పారు. సీఎం కేవలం పేరు కోసమే కొత్త అసెంబ్లీ, సెక్రటేరియెట్‌ కడతామంటున్నారని.. అనవసరంగా డబ్బులు దుబారా చేసి, అభివృద్ధికి అడ్డు పడుతున్నారని విమర్శించారు.