కాళేశ్వరం ముంపు భూములకు ఒక ఎకరానికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలి : వివేక్ వెంకటస్వామి

కాళేశ్వరం ముంపు భూములకు ఒక ఎకరానికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలి : వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల జిల్లాలో పర్యటిస్తున్న మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి వరద బాధితులను పరామర్శించారు. గోదావరి నది ప్రవాహం, రాళ్లవాగు వరదలతో నీట మునిగిన మంచిర్యాల మున్సిపాలిటీలోని ఎన్టీఆర్ నగర్, రాంనగర్ కాలనీల్లో పర్యటించారు. వరద బాధితులను పరామర్శించారు. వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఇప్పటివరకు 160 టీఎంసీల నీటిని రివర్స్ పంపింగ్ చేసి మళ్లీ120 టీఎంసీల నీటిని కిందకు వదిలేశారని, దీని వల్ల రూ.2 వేల కోట్ల కరెంట్ ఖర్చు వృథా అయ్యిందన్నారు వివేక్ వెంకటస్వామి. 

బ్యాక్ వాటర్ వస్తే ముంపు ప్రాంతాలకు ఇవ్వాల్సిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రాష్ర్ట ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వివేక్ వెంకట స్వామి. రాళ్లవాగుకు కరకట్ట నిర్మించి.. మంచిర్యాల పట్టణం మునగకుండా చేయాలని కోరారు. చెన్నూరు, మంథని నియోజకవర్గాల్లోని కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు భూములకు ఎకరానికి రూ.25 లక్షల పరిహారం ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన అవినీతిపై విచారణ జరగాలని, దీనిపై అన్ని పార్టీలు మౌనంగా ఉండకుండా నిర్మాణంలో జరిగిన అవినీతిపై మాట్లాడాలని కోరారు.