బీజేపీది మతోన్మాద రాజకీయం : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని

బీజేపీది మతోన్మాద రాజకీయం : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని

దేవరకొండ, వెలుగు: బీజేపీ మతోన్మాద రాజకీయాలతో రెచ్చగొడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. మంగళవారం నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో సీపీఐ 23వ జిల్లా మహాసభలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్  కె. శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మాజీ ఎమ్మెల్యేలు పల్లావెంకట్ రెడ్డి, ఉజ్జిని యాదగిరి రావుతో కలిసి పాల్గొన్నారు. ఆపరేషన్  కగార్  పేరుతో మావోయిస్టులను 2026 మార్చి వరకు అంతం చేస్తామని చెప్పడం దుర్మార్గమని అన్నారు. 

అన్ని పార్టీలను ఏకం చేసి కగార్  ఆపరేషన్  ఆపాలని డిమాండ్​ చేశామన్నారు. పదేళ్లు రాష్ట్రంలో నియంతృత పోకడతో పాలించిన కేసీఆర్ ను ఓడించడంలో సీపీఐ కీలక పాత్ర పోషించిందన్నారు. పొత్తు ధర్మాన్ని పాటించడంతో పాటు స్థానిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికల్లో ముందుకెళ్లాలని సూచించారు. నల్గొండ జిల్లాలో పెండింగ్  ప్రాజెక్టులను పూర్తి చేయడంలో గత సర్కారు నిర్లక్ష్యం చేయడంతో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్  ప్రభుత్వం ప్రాజెక్టులకు రూ.1,800 కోట్లు కేటాయించి పనులు ప్రారంభించిందని తెలిపారు.