సీఎం పదవి మాదంటే మాది

సీఎం పదవి మాదంటే మాది

మహారాష్ట్రలో  సేన, బీజేపీ ధీమా

ముంబై:  మహారాష్ట్ర అసెంబ్లీకి ముహూర్తం దగ్గరపడుతున్నవేళ.. బీజేపీ, శివసేన పార్టీలు ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసినట్టుగా కనబడుతోంది. సీట్ల సర్దుబాటు చర్చలు ఇంకా మొదలుకాకముందే .. సీఎం పోస్ట్‌‌‌‌ తమకే దక్కాలంటూ రెండు పార్టీలు పట్టుబడుతున్నాయి. బీజేపీకి చెందిన నాయకుడే ముఖ్యమంత్రి పదవి చేపడతారని ఆపార్టీ సీనియర్‌‌‌‌ నేత, మహారాష్ట్ర ఆర్థికమంత్రి సుధీర్‌‌‌‌ ముంగతివార్‌‌‌‌ మంగళవారం ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం త్వరలోనే  కొలిక్కివస్తుందని అన్నారు.  సీటు షేరింగ్‌‌‌‌పై రెండుపార్టీల మధ్య ఎలాంటి విభేదాల్లేవని ఆయన చెప్పారు. 288 స్థానాలున్న అసెంబ్లీలో  తమ కూటమి 220 సీట్లను గెలుచుకుంటుందని సుధీర్‌‌‌‌ ధీమా వ్యక్తంచేశారు.

మంత్రి కామెంట్స్‌‌‌‌పై శివసేన యూత్‌‌‌‌ లీడర్‌‌‌‌  వరుణ్‌‌‌‌ సర్దేశాయి రియాక్టయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, బీజేపీ కలిసి పోటీచేస్తాయని, సీఎం పదవిని చెరి రెండున్నరేళ్లు షేర్‌‌‌‌ చేసుకోనున్నాయని  ఆయన  ట్వీట్‌‌‌‌ చేశారు.  లోక్‌‌‌‌సభ ఎన్నికలకు  ముందుమాత్రం రోటేషన్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌లో ముఖ్యమంత్రి పదవిని చెరి రెండున్నరేళ్లు పంచుకోవాలని శివసేన, బీజేపీ  నిర్ణయించినట్టు వార్తలొచ్చాయి.  తాజాగా రెండు పార్టీలు చెరో135  అసెంబ్లీ సీట్లలో పోటీచేయాలని నిర్ణయించుకున్నట్టు  తెలిసింది. మిగిలిన సీట్లను  ఇతర మిత్రపక్షాలకు కేటాయిస్తారని తెలిసింది. 135: 135 ఫార్ములాకు శివసేన అంగీకరించడంలేదని సమాచారం.