అవినీతిపరులు వెళ్లాల్సింది జైలుకే

అవినీతిపరులు వెళ్లాల్సింది జైలుకే

న్యూఢిల్లీ: అర్వింద్ కేజ్రీవాల్ జైలు నుంచి ప్రభుత్వాన్ని నడుపుతారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చేసిన ప్రకటన ప్రజలను, చట్టాన్ని, ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని బీజేపీ మండిపడింది. కేజ్రీకి ప్రతిపక్ష నేతలు మద్దతు ఇవ్వడం.. దొంగల మధ్య ఉండే సోదరభావమని ఆరోపించింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, శరద్ పవార్​లను అరెస్టు చేయాలని గతంలో కేజ్రీవాల్ డిమాండ్ చేసిన సంగతిని గుర్తు చేస్తూ.. లిక్కర్ స్కాంలో అక్రమాలకు పాల్పడినందుకు ఇప్పుడు ఆయన అరెస్టు అయ్యారని వివరించింది. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ అధికార ప్రతినిధులు సుధాన్షు త్రివేది, సంబిత్ పాత్రా మీడియాతో మాట్లాడారు. కేజ్రీవాల్ తనను తాను చట్టం కంటే అధికుడిని అని భావిస్తున్నారని అనురాగ్ విమర్శించారు. ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తొమ్మిదిసార్లు సమన్లు ఇస్తే కేజ్రీవాల్​పట్టించుకోలేదని, విచారణకు సహకరించలేదని చెప్పారు. జైలుకెళ్లి కూడా సీఎంగా కొనసాగాలన్న ఆయన నిర్ణయం ఢిల్లీ ప్రజలను, చట్టాన్ని, ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని మండిపడ్డారు.

లాలూను మించి పోయారు: సుధాన్షు

బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌‌‌‌ను కేజ్రీవాల్​ మించి పోయారని సుధాన్షు త్రివేది విమర్శించారు. దాణా స్కాం కేసుల్లో సీబీఐ అరెస్టు చేయకముందే లాలూ రాజీనామా చేసి తన భార్య రబ్రీ దేవిని సీఎంగా నియమించారు. కేజ్రీ మాత్రం పదవికి రాజీనామా చేయకుండా సీఎం పదవిలో ఉండగా అరెస్టు అయిన ఫస్ట్ సీఎంగా నిలిచారని అన్నారు. నిజాయితీ అనే ముసుగులో ఆయన ఇన్నాళ్లు చేసిన పనులు ఇప్పుడు బయటపడుతున్నాయని తెలిపారు.  అవినీతికి పాల్పడిన వారు జైలుకు వెళ్లక తప్పదని సంబిత్ పాత్రా అన్నారు. ప్రతిపక్ష పార్టీలు కేజ్రీవాల్‌‌‌‌కు అండగా నిలవడం, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం దొంగల మధ్య సోదరభావాన్ని స్పష్టం చేస్తున్నదని అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు కూడా అవినీతి కేసుల్లో బెయిల్‌‌‌‌పైనే ఉన్నారని కేజ్రీకి వాళ్లకు మధ్య ఉన్న రిలేషన్ ఇదే అని ఎద్దేవా చేశారు. పట్టుబడినప్పుడు ప్రతి దొంగ తాను నిర్దోషిననే అంటాడని, ప్రజలు.. ఆప్ నేతలు, ప్రతిపక్ష పార్టీల నేతల మాటలు నమ్ముతారా? కోర్టుల మాటను నమ్ముతారా అని ప్రశ్నించారు.