సీఎందే  కబ్జాల ఫ్యామిలీ

సీఎందే  కబ్జాల ఫ్యామిలీ

హైదరాబాద్, వెలుగు:సీఎం కేసీఆర్ కుటుంబమే కబ్జాల కుటుంబమని, టీఆర్ఎస్ సర్కారు మొత్తం కబ్జాలు, అవినీతిమయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. టీఆర్ఎస్‌‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు సహా నేతలంతా కబ్జాకోరులేనని, సీఎం కేసీఆర్, హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ సహా అందరిపైనా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈటల కబ్జాలకు పాల్పడ్డారని శుక్రవారం సాయంత్రం కొన్ని చానెళ్లలో వార్తలు రావడం, వెంటనే సీఎం స్పందించి విచారణకు ఆదేశించడంపై సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఇన్నాళ్లుగా మంత్రులపై ఆరోపణలు వస్తుంటే సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు కరోనాను కంట్రోల్‌‌ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ ఫెయిల్యూర్స్‌‌ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే.. ఈటల వ్యవహారాన్ని సీఎం సొంత చానెల్‌‌లో బయటపెట్టారని, వెంటనే ఆయనపై విచారణకు ఆదేశించారని సంజయ్ అన్నారు. కరోనాతో జనం పిట్టల్లా రాలుతున్నా సీఎం ఒక్కసారి కూడా రివ్యూ చేయకపోడం ఏంటన్నారు.  

మీ నిజాయితీ ఏందో తేలిపోయింది

కరోనాను పట్టించుకోని సీఎం ఈ రోజు హడావిడిగా ఈటలపై రియాక్ట్ అవ్వడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని బండి సంజయ్ అన్నారు. ఈటలపై కబ్జా ఆరోపణలను సీఎం తన బూటు మీడియాలోనే వేయించడం ద్వారా ప్రభుత్వంలో అవినీతిని స్వయంగా బయటపెట్టారని, ఇన్నాళ్లు బీజేపీ నేతలు.. టీఆర్ఎస్ సర్కారులో జరుగుతున్న అవినీతి, కబ్జాలపై ఆరోపణలు చేస్తే తప్పుబట్టారని, అసలు ఈ ప్రభుత్వ నిజాయితీ ఏంటో తేలిపోయిందని అన్నారు.

ఓనర్లు.. జీతగాళ్ల కొట్లాట

కేసీఆర్ అవినీతిని కూడా రెండు రకాలుగా విభజించారని,  అనుకూల మంత్రులపై ఆరోపణలు వస్తే పట్టించుకోరు.. వ్యతిరేక మంత్రులపై ఆరోపణలు వస్తేనే విచారణలు చేస్తారన్నారు. టీఆర్‌‌‌‌ఎస్‌‌లో ఓనర్లు.. జీతగాళ్ల కొట్లాట నడుస్తోందన్నారు. ‘ఈటల సహా ప్రభుత్వంలో అందరూ కబ్జాకోరులే. మల్లారెడ్డి, వినయ్‌‌ భాస్కర్, ఎమ్మెల్యే నరేందర్, ధర్మారెడ్డి, యాదిరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సీఎం కుటుంబం మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాల్సిందే’ అని డిమాండ్ చేశారు.

నీ కుక్క పాటి విలువ ప్రజల ప్రాణాలకు లేదా?

సీఎం ఫామ్‌‌హౌస్‌‌లో కుక్కకు రోగమొస్తే అంబులెన్స్‌‌లు, డాక్టర్లు పరిగెత్తుకుని వచ్చారని, దానిపాటి విలువ ప్రజల ప్రాణాలకు లేదా అని నిలదీశారు. ఈటలపై ఆరోపణలు రాగనే స్పందించిన కేసీఆర్ గతంలో ఇంటర్ విద్యార్థుల చనిపోతే ఎందుకు రెస్పాండ్ కాలేదని ప్రశ్నించారు. ‘ఆ రోజు కేటీఆర్‌‌‌‌పై ఆరోపణలు రాలేదా? అవి కూడా అవినీతి ఆరోపణలే కదా. ఆ కేసు విచారణ ఏమైంది’ అని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో టీఆర్‌‌‌‌ఎస్ దొంగల ముఠా తయారై, ప్రజలను దోచుకుంటోందని ఆరోపించారు.