
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇస్తే కొత్తగూడెంకు కేంద్రం ఎయిర్ పోర్టు మంజూరు చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. కొత్తగూడెంలో మంగళవారం రాత్రి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొత్తగూడెం క్లబ్లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. బీజేపీ గవర్నమెంట్ రాకముందు దేశంలో 75 ఎయిర్‌పోర్టులుంటే ఇప్పుడు అవి 150కి పెరిగాయన్నారు. షెడ్యూల్ ట్రైబ్ ప్రాంతానికి కాంగ్రెస్ చేసిందేమీలేదన్నారు. రేషన్‌కార్డులపై ప్రధాని మోదీ ఫొటో పెట్టాలన్నారు. అవసరమైనంత యూరియాను కేంద్రం ఇస్తోందని, కానీ రాష్ట్రంలో యూరియా పక్కదారి పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోవడంలో ఫెయిల్అయిందని ఆరోపించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా చేసేందేమీ లేదన్నారు. నల్గొండ, ఖమ్మం బ్యాచ్‌లు సీఎం రేవంత్ రెడ్డితో కుర్చీలాట ఆడుతున్నాయని విమర్శించారు. మతాల ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లు ఇస్తే ఊరుకునేది లేదన్నారు. రిటైర్ అయిన ఉద్యోగులకు డబ్బులను ఇవ్వడం లేదని, రైతు భరోసా సరిగా అమలు చేయడంలేదని తెలిపారు. రాబోయో రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకొని బీజేపీ సత్తా చాటాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ ప్రోగ్రాంలో మాజీ ఎంపీ సీతారాం నాయక్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నేతలు తాండ్ర వినోద్ కుమార్, జీవీ మనోహర్, కేవీ రంగా కిరణ్, సరస్వతి, నరేశ్, కుంజా ధర్మా, ఎన్. కోటేశ్వరరావు, సీతారామరాజు, సలీం, సాగర్ పాల్గొన్నారు.