అబద్ధాలకు మారుపేరు మంత్రి హరీష్ రావు : సంగప్ప

అబద్ధాలకు మారుపేరు మంత్రి హరీష్ రావు : సంగప్ప

అబద్ధాలకు మారుపేరు మంత్రి హరీష్ రావు అని అన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప. నారాయణ్ ఖేడ్ అభివృద్ధికి అడ్డా అని హరీశ్ రావు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి వెళ్లారంటూ మండిపడ్డారు. హరీష్ రావు మాట్లాడిన దాంట్లో ఏ మాత్రం నిజం లేదని కొట్టిపారేశారు. నారాయణ్ ఖేడ్.. అక్కడి ఎమ్మెల్యే అవినీతికి అడ్డా అని ఆరోపించారు. 

నారాయణ్ ఖేడ్ సెగ్మెంట్ లో వలసలు ఆగిపోయాయని చెప్పడం హరీశ్ రావు భ్రమలో ఉండి అన్నారని చెప్పారు. సిద్దిపేటను అభివృద్ధి చేసుకున్నంత మాత్రాన నారాయణ్ ఖేడ్ కూడా అభివృద్ధి చెందినట్లు కాదని చెప్పారు. హరీష్ రావుకు దమ్ముంటే దీనిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. చర్చించేందుకు ఎక్కడికైనా వచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.

చెరుకు పంట చేతికి అందే సమయానికి పల్లెలన్నీ ఖాళీ అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. చెరుకు రైతుల కోసం ఏమైనా ఫ్యాక్టరీ కట్టించారా..? ఉపాధి కల్పించారా..? అని ప్రశ్నించారు. నారాయణ్ ఖేడ్ ప్రజలు హరీష్ రావును నమ్మితే.. వారిని మోసం చేశారని ఆరోపించారు. మామా, అల్లుడు... ఇద్దరూ మోసగాళ్లే అని ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేసిన రోడ్ల వల్లే నారాయణ్ ఖేడ్ రూపురేఖలు మారాయని చెప్పారు.