కాళేశ్వరం పై సీబీఐ ఎంక్వైరీకి పట్టుబట్టాలి

కాళేశ్వరం పై సీబీఐ ఎంక్వైరీకి పట్టుబట్టాలి
  • బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై నిలదీయాలి
  • బీజేఎల్​పీ సమావేశంలో నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై చర్యలు తీసుకోవడంలో ఆలస్యంపై శాసనసభ, శాసనమండలిలో సర్కారును నిలదీయాలని బీజేపీ నిర్ణయించింది. ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలపై సీబీఐ విచారణకు పట్టుబట్టాలని, బాధ్యులపై చర్యలు తీసుకునే దాకా సభలో నిరసన తెలపాలని డిసైడ్ అయింది. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో బీజేఎల్​పీ సమావేశం జరిగింది. ఇందులో ఆ పార్టీ స్టేట్ చీఫ్ రాంచందర్​రావు, సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారితో పాటు శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి, శాసనమండలి పక్ష నేత ఏవీఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా శనివారం నుంచి జరిగే సమావేశాల్లో బీజేపీ ఏఏ అంశాలపై ఎలా వ్యవహరించాలనే దానిపై రాంచందర్​రావు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నించాలని సూచించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేసి, ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోకపోవడంపై సర్కారును నిలదీయాలని స్పష్టం చేశారు. దీంతో పాటు బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై పట్టుపట్టాలని సూచించారు.

  అనతరం బీజేఎల్​పీ నేత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల సమస్యలు, రైతుల ఇబ్బందులపై అసెంబ్లీ సమావేశాల్లో గట్టిగా నిలదీస్తామని తెలిపారు. భారీ వర్షాల వల్ల ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం వెంటనే స్పందించి హెలికాప్టర్లతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిందని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెంకటరమణారెడ్డి, సూర్యనారాయణ, మల్క కొమరయ్య, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.