బీజేపీనా మజాకా : ప్రతి రోజూ రూ.2 కోట్ల పార్టీ ఫండ్

బీజేపీనా మజాకా : ప్రతి రోజూ రూ.2 కోట్ల పార్టీ ఫండ్

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.719.83 కోట్ల విరాళాలు వచ్చాయి. వివిధ సంస్థలు, ఎలక్టొరల్‌ ట్రస్టులు, వ్యక్తులు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ నిధులను అందజేశారు.  ఈ లెక్కన  బీజేపీ పార్టీ సంపాదన సగటున రోజుకు దాదాపు రూ. 2 కోట్లకు చేరుకుందన్న మాట.  ఇది ఇతర ఏ జాతీయ రాజకీయ పార్టీలతో పోలిస్తే చాలా ఎక్కువ అని చెప్పాలి.  బీజేపీ తరువాత  సగటున రోజుకు 21 లక్షల రూపాయలతో కాంగ్రెస్ రెండవ అత్యధిక విరాళాన్ని పొందింది.  

గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలు ఏటా రూ. 20,000 పైన వచ్చిన విరాళాలను ఎన్నికల కమిషన్‌కు ప్రకటించాలి.   ప్రస్తుతం దేశంలో ఆరు జాతీయ పార్టీలు ఉన్నాయి.  ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), నేషనల్ పీపుల్స్ పార్టీ ఈ జాతీయ పార్టీలన్నింటిలో బీఎస్పీకి అత్యల్పంగా విరాళాలు వచ్చినట్లుగా పేర్కొంది.  వివిధ సంస్థల నుండి రూ. 20,000 కంటే ఎక్కువ నిధులు పొందలేదని మాయావతి పార్టీ ప్రకటించింది. 

ఇప్పటి వరకు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ,  CPI, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ కూడా జాతీయ పార్టీలే అయితే 2023 ఏప్రిల్‌లో అవి తమ హోదాను కోల్పోయాయి. తాజాగా ఆ జాబితాలో ఆప్  చేరింది.  జాతీయ పార్టీలకు ఇప్పటివరకు మొత్తంవ రూ. 850 కోట్లు రాగా ఇందులో ఎక్కువ భాగం ఒక్క బీజేపీకి రూ. 719.83 కోట్లు వచ్చింది. ఇక మిగితాపార్టీల విరాళాలు  కేవలం రూ.130.51 కోట్లు. 2022-23 మధ్యకాలంలో కాంగ్రెస్ రూ. 79.92 కోట్ల విరాళాలను అందుకోగా, ఆప్ రూ. 37.1 కోట్లతో మూడో స్థానంలో ఉంది.