4 రాష్ట్రాల బైపోల్స్​లో బీజేపీ హవా

4 రాష్ట్రాల బైపోల్స్​లో బీజేపీ హవా

న్యూఢిల్లీ, వెలుగు: వివిధ రాష్ట్రాల్లోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగింది. మొత్తం ఆరు రాష్ట్రాల్లోని ఏడు స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా, బీజేపీ ఆరు చోట్ల పోటీ చేసి నాలుగు సీట్లలో విజయం సాధించింది. ఆర్జేడీ, శివసేన (ఉద్ధవ్ ఠాక్రే), టీఆర్ఎస్ ఒక్కో స్థానాల్లో గెలిచాయి. ఆర్జేడీ బీహార్ లో, బీజేపీ యూపీ, బీహార్, ఒడిశాలో తమ సిట్టింగ్ స్థానాలను కాపాడుకున్నాయి.

గోలా గోకర్ణ్​నాథ్(యూపీ): ఇక్కడ సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి వినయ్ తివారీపై బీజేపీ అభ్యర్థి అమన్ గిరి34 వేల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. బీజేపీ ఎమ్మెల్యే అర్వింద్ గిరి (అమన్ గిరి తండ్రి) సెప్టెంబర్ లో చనిపోవడంతో ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది. గోపాల్ గంజ్(బీహార్): ఈ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి కుసుమ దేవి ఆర్జేడీ అభ్యర్థి మోహన్ గుప్తాపై 2,183 ఓట్ల మెజారిటీతో గెలిచారు. బీజేపీ ఎమ్మెల్యే సుభాష్ సింగ్ (కుసుమ దేవి భర్త) మరణంతో ఈ అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక జరిగింది.    

మోకామా(బీహార్): ఇక్కడ ఆర్జేడీ అభ్యర్థి నీలం దేవి16 వేల ఓట్లకుపైగా మెజార్టీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో నీలం దేవి భర్త, ఆర్జేడీ నేత  అనంత్ కుమార్ సింగ్ ఎమ్మెల్యేగా ఉండగా, ఆయుధాల చట్టం కింద దోషిగా తేలడంతో ఆయనపై అనర్హత వేటు పడి ఉప ఎన్నిక వచ్చింది.  

అదమ్ పూర్(హర్యానా): ఈ బైపోల్ లో కాంగ్రెస్ అభ్యర్థి జై ప్రకాశ్ పై బీజేపీ అభ్యర్థి భవ్య బిష్ణోయి16 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. మాజీ సీఎం భజన్ లాల్ మనవడైన భవ్య బిష్ణోయి తమ కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఈ సీటును నిలబెట్టుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న భజన్ లాల్ చిన్న కొడుకు కుల్దీప్ బిష్ణోయి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో ఉప ఎన్నిక వచ్చింది. 

ధామ్ నగర్ (ఒడిశా): ఈ ఉప ఎన్నికలో అధికార పార్టీ బీజేడీ అభ్యర్థి అబంతి దాస్ పై బీజేపీ అభ్యర్థి సూర్యబంశి సూరజ్ 9 వేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. సూరజ్ తండ్రి, బీజేపీ ఎమ్మెల్యే బిష్ణు చరణ్​సేథి సెప్టెంబర్ లో మరణించడంతో ఉప ఎన్నిక జరిగింది. 

ఈస్ట్ అంధేరి(మహారాష్ట్ర): ఇక్కడ శివసేన ఎమ్మెల్యే రమేశ్ లాట్కే చనిపోవడంతో ఉప ఎన్నిక రాగా, శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) తరఫున పోటీలో నిలిచిన రమేశ్ లాట్కే భార్య రుతుజా లాట్కే 66,530 ఓట్లతో ఘన విజయం సాధించారు. ఈ బైపోల్ కు బీజేపీ తన క్యాండిడేట్ ను నిలబెట్టకపోవడంతో ఆరుగురు ఇండిపెండెంట్లపై ఆమె సునాయాసంగా గెలిచారు. ఇక్కడ 12,806 ఓట్లు నోటాకు రావడం విశేషం.  

మునుగోడు(తెలంగాణ): ఈ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 10 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

విద్వేషం నింపెటోళ్లను తరిమేస్తం 
గుజరాత్​ ఎన్నికల ప్రచారంలో మోడీ

గాంధీనగర్: విద్వేషాన్ని వ్యాపింపజేసేవాళ్లను, గుజరాత్‌‌ పేరు ప్రతిష్టలను నాశనం చేసేవాళ్లను రాష్ట్రం నుంచి తరిమికొడతామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు మెజార్టీతో బీజేపీ గెలుపు ఖాయమన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత గుజరాత్​లోని వల్సాద్​లో తొలిసారి ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మాట్లాడారు. ‘‘విద్వేషాన్ని వ్యాప్తి చేయడంలో మునిగిన శక్తులను, రాష్ట్ర పరువు తీయడానికి ప్రయత్నించినోళ్లను గుజరాత్​నుంచి తరిమేశాం. ఈ ఎన్నికల్లోనూ వాళ్లకు అదే గతి పడుతుంది” అని అన్నారు. గుజరాత్‌‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఒక ముఠాను ప్రజలు గుర్తించారని కామెంట్ చేశా రు. రాష్ట్రానికి హాని కలిగించేవాళ్లను ప్రజలు ఎప్పటికీ అనుమతించరని మోడీ అన్నారు. ఈ సందర్భంగా ‘గుజరాత్ సృష్టికర్తను నేనే’ అనే కొత్త స్లోగన్​ను మోడీ ఇచ్చారు.