
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో జరగబోతున్న రాజ్యసభ ఉప ఎన్నికలకు దూరంగా ఉండాలని బీజేపీ నిర్ణయించుకుంది. ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి సుష్మితా దేవ్‌పై తమ పార్టీ తరఫున పోటీ పెట్టడం లేదని బీజేపీ ప్రకటించింది. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య పరంగా తృణమూల్ బలం ఎక్కువ కావడంతో ఆ పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయమైన నేపథ్యంలో ఈ ఎన్నికలపై సమయం వృథా చేసుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేదు. దానికి బదులు ఎమ్మెల్యేగా ఓడిపోయి సీఎంగా ఉన్న మమతా బెనర్జీని మరోసారి ఓడించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయాన్ని బెంగాల్ ప్రతిపక్ష నేత, బీజేపీ నాయకుడు సువేందు అధికారి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘పశ్చిమ బెంగాల్‌లో వచ్చే నెలలో జరగనున్న రాజ్యసభ బైపోల్‌లో బీజేపీ అభ్యర్థిని పెట్టబోవడం లేదు. ఈ ఎన్నికల్లో ఫలితం ముందుగానే తెలిసిందే. ఓడిపోయి సీఎంగా ఉన్న వ్యక్తిని మరోసారి ఓడించడంపైనే మా ఫోకస్. జై కాళీ మాత” అంటూ సువేందు అధికారి సోమవారం ట్వీట్ చేశారు.
నందిగ్రామ్‌లో ఓడిన సీఎం.. భవనీపూర్ బైపోల్‌లో పోటీ
పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్న తృణమూల్ నేత మానస్ భునియా ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ మిడ్నాపూర్‌లో పోటీ చేసి గెలిచారు. దీంతో ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఆ సీటుకు ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ బైపోల్ అక్టోబర్ 4న జరగనుంది. ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ తమ అభ్యర్థిగా సుష్మితా దేవ్‌ను ప్రకటించింది. అయితే గెలుపు దాదాపు ఖాయం కావడంతో బీజేపీ పోటీకి సిద్దంగా లేదు. అయితే ఈ నెలాఖరులోనే జరగనున్న భవానీపూర్ అసెంబ్లీ బైపోల్‌పై బీజేపీ సీరియస్‌గా ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో పోటీ చేసిన సీఎం మమతా బెనర్జీని బీజేపీ నేత సువేందు అధికారి ఓడించగా.. ఇప్పుడు ఆమె భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆమెను మరోసారి ఓడించాలని లక్ష్యంగా బీజేపీ పని చేస్తోంది. మమతపై లాయర్ ప్రియాంక టిబ్రేవాల్‌ను బరిలోకి దించింది. అధికార, ప్రతిపక్షాలు రెండూ హోరాహోరీగా ఇప్పటి నుంచే ప్రచారంలోకి దిగాయి. రెండోసారి కూడా మమతను ఓడించి ఆమెను సీఎం పదవి నుంచి దించడమే టార్గెట్‌గా బీజేపీ పని చేస్తోంది. ఆమె ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ ప్రస్తుతం సీఎంగా కొనసాగుతున్నారు. అయితే సీఎంగా ప్రమాణం చేసిన నాటి నుంచి ఆరు నెలల లోపు ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నికవ్వకుంటే ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాల్సిందే. పశ్చిమ బెంగాల్‌లో శాసన మండలి లేకపోవడంతో మమత సీఎంగా కొనసాగాలంటే ఆమె భవానీపూర్‌లో ఎమ్మెల్యేగా గెలవడం తప్పనిసరి.