టీవీలో ఫలితాలు చూస్తూ భావోద్వేగం..

టీవీలో ఫలితాలు చూస్తూ భావోద్వేగం..
  • గుండెపోటుతో బీజేపీ కార్యకర్త మృతి
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఘటన  

అశ్వారావుపేట, వెలుగు: భద్రాద్రి కొత్తూగూడెం జిల్లా అశ్వారావుపేటలో మంగళవారం టీవీలో ఎన్నికల ఫలితాలను చూస్తూ భావోద్వేగానికి గురైన ఓ బీజేపీ కార్యకర్త గుండెపోటుతో చనిపోయాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం..అశ్వారావుపేటలోని శివయ్య గారి బజారుకు చెందిన చల్లా నిరంజన్ దాస్ (48) బీజేపీకి వీరాభిమాని. మంగళవారం ఎన్నికల ఫలితాలు వెలువడతాయని ఉదయాన్నే టీవీ ముందు కూర్చున్నాడు. 

11 గంటల వేళలో ఎన్​డీఏ కూటమి ఆధిక్యం వైపు దూసుకువెళ్తుండడంతో మళ్లీ బీజేపీ ప్రభుత్వమే వస్తుందంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. వెంటనే ఛాతిలో నొప్పి వస్తోందని భార్యకు చెప్పి బైక్ పై స్వయంగా టౌన్​లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్లాడు. డాక్టర్​కు విషయాన్ని చెప్పి బల్లపై కుప్పకూలాడు. డాక్టర్లు సీపీఆర్ ​చేసి మెరుగైన వైద్యం కోసం సత్తుపల్లి దవాఖానకు రెఫర్ ​చేశారు. అంబులెన్స్ లో సత్తుపల్లి తీసుకువెళ్తుండగా చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ లీడర్లు నిరంజన్ దాస్ మృతుడి కుటుంబానికి ధైర్యం చెప్పి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.