ఆరెస్సెస్ పట్టు బిగిస్తోందా..?

ఆరెస్సెస్ పట్టు బిగిస్తోందా..?

లేటెస్ట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు క్రెడిట్ అంతా నరేంద్ర మోడీ ఖాతాలో వేయడంపై ఆరెస్సెస్ పెద్దలకు అభ్యంతరాలు ఉన్నట్లు తెలుస్తోంది.దేశవ్యాప్తంగా లక్షలాది మంది సంఘ్ కార్యకర్తలు బీజేపీ విజయానికి తెరవెనుక కృషి చేశారు.  దీనిని గుర్తించకుండా బీజేపీ టాప్ లీడర్లు  రాజకీయ  అవసరాల కోసం సంఘ్ కోర్ అజెండాను పక్కన పెడుతున్నారన్న  అభిప్రాయం  ఆరెస్సెస్ కు కలుగుతోంది. ఈ పరిస్థితుల్లో రాజకీయ లాభాల కోసం ఐడియాలజీకి  బీజేపీ దూరం జరగకుండాఆరెస్సెస్ పట్టు బిగించాలని నిర్ణయించినట్లు  తెలుస్తోంది. తాజాగా బీజేపీ జనరల్ సెక్రటరీ ( ఆర్గనైజేషన్ ) గా రామ్ లాల్ ను మళ్లీ ఆరెస్సెస్ కు రప్పించి, ఆయన స్థానంలో బీఎల్ సంతోష్ ను నియమించడం వెనుక మతలబు అదేనని అంటున్నారు.

బీజేపీకి ఆర్గనైజేషన్ సెక్రటరీగా  దాదాపు 13 ఏళ్లు పనిచేసిన రామ్ లాల్ ను మళ్లీ మాతృసంస్థ  ఆరెస్సెస్ కు నియమించడం యథాలాపంగా జరిగింది కాదంటున్నారు రాజకీయ పండితులు. బీజేపీ ఆర్గనైజేషన్ సెక్రటరీ అంటే చిన్న పోస్టు కాదు. ఆరెస్సెస్, బీజేపీ సర్కార్ మధ్య అన్ని విషయాల్లో అనుసంధానం చేయాల్సిన బాధ్యత ఈ పోస్టులో ఉన్న వారిపై ఉంటుంది. 13 ఏళ్ల కిందట ఆరెస్సెస్ లో పనిచేసే  రామ్ లాల్ ను ఏరికోరి బీజేపీకి డిప్యుటేషన్ మీద పంపారు. అది కూడా ఆర్గనైజేషన్ సెక్రటరీ పదవి ఇచ్చి. ఇన్నేళ్ల కాలంలో   ప్రధాని నరేంద్ర మోడీకి, బీజేపీ ప్రెసిడెంట్ అమిత్ షా కు రామ్ లాల్ దగ్గరయ్యారు. వాళ్ల అభిమానాన్ని పొందారు. అయితే లేటెస్ట్ గా ఆయనను తిరిగి  మాతృసంస్థ ఆరెస్సెస్ కు పంపారు. రామ్ లాల్ స్థానంలో  బీఎల్ సంతోష్ ను పార్టీ  జనరల్ సెక్రటరీ (ఆర్గనైజేషన్ ) గా నియమితులయ్యారు.

ఎన్నికల్లో గెలుపు ఎవరి ఖాతాలో ?

లేటెస్ట్ గా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన అపూర్వ విజయాన్ని  పార్టీ సీనియర్ లీడర్లందరూ నరేంద్ర మోడీ ఖాతాలోనే వేయడం మొదలెట్టారు. మోడీకి ఉన్న  ప్రజా కర్షణ వల్లనే ఈ గెలుపు సాధ్యమైందని కేంద్ర మంత్రులు కూడా బాహాటంగా ప్రకటనలు చేశారు. అయితే ఈ విషయాన్ని అంగీకరించడానికి  ఆరెస్సెస్ సిద్దంగా లేదు. బీజేపీ గెలుపులో  తమ పాత్రను  పార్టీ సీనియర్ లీడర్లు సహా ఎవరూ గుర్తించకపోవడం ఆరెస్సెస్ కు రుచించలేదంటున్నారు  రాజకీయ విశ్లేషకులు.

పార్టీ గెలుపు కోసం తమ స్వయంసేవకులు చేసిన కృషిని ఇటీవల  ఆరెస్సెస్ సీనియర్ లీడర్ మన్మోహన్ వైద్య గుర్తు చేశారు. మన్మోహన్ వైద్య మాటల్లో చెప్పాలంటే మొన్నటి ఎన్నికల్లో దేశవ్యాప్తంగా  నాలుగున్నర లక్షల పల్లెలకు  స్వయంసేవకులు వెళ్లారు. అక్కడ ఎన్నికల కోసం పనిచేశారు. ఈ పల్లెల్లో అనేక కుటుంబాలతో  పరిచయాలు పెంచుకున్నారు. ఈ కుటుంబాలతో  స్వయంసేవకులు రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉండి బీజేపీ కి అనుకూలంగా ప్రచారం చేశారు. చడీచప్పుడు లేకుండా బీజేపీకి అనుకూలంగా జరిగిన ఈ ప్రచారంలో దాదాపు పది లక్షల మంది ఆరెస్సెస్ వాలంటీర్లు  దేశంలోని అన్ని ప్రాంతాల్లో పనిచేశారు. లోక్ సభ ఎన్నికలు కాబట్టి జాతీయ సమస్యలను దృష్టిలో పెట్టుకునే  ఓటు వెయ్యాలంటూ  పరోక్షంగా ప్రజలను ఆ దిశగా ఆలోచించేలా చేశారు. దీంతో  ప్రాంతీయ పార్టీలు లేవనెత్తిన ఇష్యూస్ ను ప్రజలు మరచిపోయి నేషనల్ ఇష్యూస్ గురించి ఆలోచించి బీజేపీకి అనుకూలంగా తీర్పు ఇచ్చారనేది ఆరెస్సెస్​ పెద్దల అభిప్రాయం. బీజేపీ గెలుపు కోసం  ఇంతగా కృషి చేసినప్పటికీ అదంతా మోడీ ఘనతేనని ప్రచారం జరగడం ఆరెస్సెస్ కు ఇష్టం లేదన్నది రాజకీయ పండితుల విశ్లేషణ.

2014 లో కూడా ప్రజలు మార్పు కోరుకున్నారు

2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచినప్పుడు కూడా అందరూ అది నరేంద్ర మోడీ ఘనతేనని ఊదరగొట్టారు. ఈ ప్రచారాన్ని  ఆరెస్సెస్ చీఫ్  మోహన్ భగవత్  ఆనాడే తప్పు పట్టారు. “ప్రజలు రాజకీయ మార్పు కోరుకున్నారు. అందుకు తగ్గట్టే తీర్పు చెప్పారు. దీని ఫలితంగానే కాంగ్రెస్ ఓడింది. బీజేపీ గెలిచింది” అనిచెప్పారు.

ఆరెస్సెస్ ఐడియాలజీకి  తగ్గట్టు నిర్ణయాలు

వాజ్ పేయి హయాంతో పోలిస్తే  ప్రస్తుతం ఆరెస్సెస్, బీజేపీ మధ్య  మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇందులో రెండో అభిప్రాయమే లేదు. ప్రధాని మోడీ సాక్షాత్తూ  ఆరెస్సెస్ ప్రచారక్ గా పనిచేసిన నాయకుడు. పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్న అమిత్ షా గతంలో  విద్యార్థి సంఘమైన ఏబీవీపీలో  పనిచేశారు. వీరిద్దరికీ  ఆరెస్సెస్  ఇంపార్టెన్స్ ఏంటో ఎవరూ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆరెస్సెస్ ఐడియాలజీకి అనుగుణంగానే  ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటోంది. ఆరెస్సెస్ నాయకత్వం కూడా ఈ విషయాన్ని  కాదనడం లేదు. అయితే ఆరెస్సెస్, బీజేపీ మధ్య ఉన్న సన్నని లక్ష్మణ రేఖ రామ్ లాల్ హయాంలో మసకబారినట్లు  నాగ్ పూర్ ఆరెస్సెస్ నాయకులు ఫీలయ్యారు. ఈ లక్ష్మణ రేఖ అలాగే ఉండాలని ఆరెస్సెస్ కోరుకుంటోంది. అంతేకాదు బీజేపీ గెలుపులో  తమ పాత్ర కూడా ఉందన్న విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి  ఆరెస్సెస్ నాయకులు తాపత్రయపడుతున్నారు. కిందటి వారం విజయవాడలో మూడు రోజుల పాటు జరిగిన ‘ ప్రాంత్  ప్రచారక్ ’ ల సమావేశం కూడా ఇదే విషయాన్ని  స్పష్టం చేసింది. బీజేపీ   విజయంలో ఆరెస్సెస్ పాత్ర కూడా ఉందన్న విషయంపై  కార్యకర్తలు క్లారిటీ తో ఉన్నారు.

రామ మందిరం సంగతేంటి ?

విజయవాడ సమావేశం పరోక్షంగా మరో అంశాన్ని  మోడీ సర్కార్ కు గుర్తు చేసింది. అదే.. అయోధ్యలో  రామ మందిర నిర్మాణం. గత సెప్టెంబర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో మోహన్ భగవత్ మాట్లాడుతూ  సాధ్యమైనంత త్వరగా గుడి కట్టడానికి  ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. ఆరెస్సెస్ కార్యకర్తలు ఇప్పుడు అదే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఆరెస్సెస్ అజెండాలో అయోధ్య రామాలయం ఒక కీలకాంశం. అయితే రాజకీయంగా గత్యంతరం లేని పరిస్థితుల వల్ల బీజేపీ ఈ విషయంలో ముందుకు పోవడం లేదన్నది ఆరెస్సెస్ ఆరోపణ. పొలిటికల్ కంపల్సన్స్ కంటే  ఐడియాలజీ కే ప్రయారిటీ ఇవ్వాలని ఆరెస్సెస్ పెద్దలు కోరుతున్నారు.

ఇది జాతీయ శక్తుల గెలుపు : భయ్యాజీ జోషి

లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే మోడీని అభినందించడానికి బీజేపీ లీడర్లంతా క్యూ కడుతుంటే “మరోసారి కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం రావడం అందరికీ సంతోషం కలిగించింది. ఇది జాతీయ శక్తుల గెలుపు. ఈ గెలుపునకు సహకరించిన వారందరికీ అభినందనలు ”  అంటూ ఆరెస్సెస్ జనరల్ సెక్రటరీ భయ్యాజీ జోషి  చేసిన స్టేట్మెంట్ పరోక్షంగా ఆరెస్సెస్ పాత్ర ను ప్రస్తావించింది. భయ్యాజీ జోషి  తన ప్రకటనలో ఎక్కడా ప్రధాని మోడీ ప్రస్తావన తీసుకురాలేదు. ఎన్నికల్లో విజయాన్ని ఏ ఒక్క వ్యక్తి  ఖాతాలో వేయడాన్ని  ఆరెస్సెస్ ఏమాత్రం అంగీకరించదన్న విషయం జోషి  ప్రకటనతో స్పష్టమైంది.

ఎవరీ బీఎల్ సంతోష్?

ఇంజనీరింగ్ చదువుకున్న బీఎల్ సంతోష్ ఆరెస్సెస్ సీనియర్ లీడర్. 1993 నుంచి ఫుల్ టైమ్ వర్కర్ గా పనిచేస్తున్నారు. గతంలో బీజేపీ జనరల్ సెక్రటరీ (ఆర్గనైజేషన్) గా కర్ణాటకలో ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. కర్ణాటకలో బీజేపీ ని బలోపేతం చేశారన్న పేరు తెచ్చుకున్నారు. 2014 నుంచి రామ్ లాల్ కు సహాయకుడిగా పనిచేశారు. బీజేపీ జాయింట్ సెక్రటరీ (ఆర్గనైజేషన్) పదవిలో దక్షిణాది రాష్ట్రాల ఇన్ చార్జ్ గా కొనసాగారు. సౌత్ లో బీజేపీని బలోపేతం చేయడానికి కృషి చేశారు. లేటెస్ట్ గా ఆయనకు ప్రమోషన్ ఇచ్చారు. జాయింట్ సెక్రటరీ నుంచి జనరల్ సెక్రటరీ అయ్యారు. ఎన్నికల వ్యూహాలు పన్నడంలో ఘటికుడిగా ఆయనకు పేరుంది. వ్యూహకర్తగా పార్టీ ఇన్నర్ సర్కిల్స్ లో ఆయన పేరు తెచ్చుకున్నారు.  చెప్పాల్సింది నిర్మొహమాటంగా ముక్కుసూటిగా చెప్పే మనిషి. ఎన్నికల్లో లాభాల కోసం ఆరెస్సెస్ ఐడియాలజీ విషయంలో  రాజీపడే మనస్తత్వం కాదు. ఎవర్నైనా విమర్శించడానికి వెనుకాడని కరడుగట్టిన ఆరెస్సెస్ వాది. కర్ణాటక బీజేపీకి పెద్ద దిక్కుగా ఉన్న యడ్యూరప్పతో  కూడా గతంలో  ఆరెస్సెస్ సిద్దాంతాలను పట్టించుకోవడం లేదంటూ సంతోష్ గట్టిగా మాట్లాడిన  సందర్భాలున్నాయి. సంతోష్ లో మరో ప్లస్ పాయింట్ ఉంది. ఐదు భాషల్లో మాట్లాడగలడు. దీంతో బీజేపీ ప్రెసిడెంట్ తర్వాత అత్యంత కీలకమైన పోస్టులో పార్టీ ఆయనను నియమించింది.