బ్లడ్ ​నిల్వలు తగ్గుతున్నయ్!

బ్లడ్ ​నిల్వలు తగ్గుతున్నయ్!
  • మేజర్​ సర్జరీలకు బ్లడ్ బ్యాంకుల్లోనూ దొరకని పరిస్థితి

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​లోని బ్లడ్‌‌ బ్యాంకుల్లో రక్తం నిల్వలు తగ్గిపోతున్నాయి. ఎమర్జెన్సీ పేషెంట్లకు కూడా అందించలేకపోతున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. సర్జరీలు పెరగడం, ట్రీట్ మెంట్ కోసం వివిధ రాష్ట్రాలతోపాటు విదేశాల నుంచి పేషెంట్లు హైదరాబాద్​కు వస్తుండడంతో బ్లడ్ నిల్వలు​ సరిపోవడం లేదని తెలుస్తోంది. సిటీలోని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్​లో చిన్న, పెద్ద సర్జరీలు కలిపి డైలీ 3 వేల వరకు జరుగుతున్నాయి. మైనర్​సర్జీలు మినహా మిగిలిన అన్నింటికీ బ్లడ్ అవసరం ఉంటుంది. గతంలో కంటే రాష్ట్ర వ్యాప్తంగా బ్లడ్ ​బ్యాంకులు పెరిగినప్పటికీ నిల్వలు తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. కరోనాకి ముందు రాష్ట్రంలో174 బ్లడ్ ​బ్యాంకులు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 274కి పెరిగింది. గ్రేటర్​ పరిధిలో 83 బ్లడ్ ​బ్యాంకులు ఉండగా, ఇప్పుడు 100కు పైగా ఉన్నాయి. మామూలు రోజుల్లో ఒక్కో బ్యాంకులో అన్ని రకాల గ్రూపులకు సంబంధించి 150 నుంచి 200 యూనిట్ల రక్తం అందుబాటులో ఉంటుంది. వీటిలో పేషెంట్లకు సంబంధించిన బంధువులు, స్నేహితులు ఇచ్చిన బ్లడ్​తో పాటు డొనేషన్​ క్యాంపుల నుంచి వచ్చిన బ్లడ్​ను కూడా నిల్వ చేస్తారు. అయితే కరోనాకు ముందు విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు తరచూ క్యాంపులు నిర్వహించి బ్లడ్​ ఇస్తుండేవి. లీడర్ల బర్త్​డేల సందర్భంగా క్యాంపులు పెట్టి బ్లడ్​ సేకరించేవారు. ఇప్పుడు అలాంటివి అన్నీ తగ్గిపోయాయి. ఐటీ కంపెనీలు సైతం గతంలో లాగా క్యాంపులు పెట్టడం లేదు. ఫలితంగా బ్లడ్ బ్యాంకులకు వచ్చే వేలాది యూనిట్ల బ్లడ్​ ఆగిపోయింది.

సోషల్​ మీడియానే దిక్కు..

సిటీలో బ్లడ్ డోనర్లకు సంబంధించి 10 వేలకుపైగా వాట్సాప్ గ్రూప్​లు ఉన్నాయి. కొన్ని ట్విట్టర్, ఫేస్​ బుక్ ​పేజీలు ఉన్నాయి. గతంలో వీటిలో ఫలానా పేషెంటుకు బ్లడ్ కావాలంటూ పోస్ట్ ​చేస్తే అందుబాటులో ఉన్న డోనర్ స్పందించి హాస్పిటల్​కి వెళ్లి బ్లడ్​ఇచ్చేవారు. అయితే కరోనాతో చాలా గ్రూపుల్లోని డోనర్లు యాక్టివ్​గా ఉండటం లేదు. డోనర్ వస్తాడన్న నమ్మకం ఉండటం లేదు. దగ్గరి వారైతే తప్ప ముందుకు రావడం లేదు. గతంలో 5 నుంచి 10 సార్లు బ్లడ్ డోనేట్ చేసిన వారు కూడా కాల్​ చేస్తే స్పందించడం లేదు. కేవలం 30 శాతం మంది మాత్రమే రక్తదానం చేసేందుకు ముందుకు వస్తున్నారు. స్పందన లేకున్నా బ్లడ్ ​అవసరమైనవారు సోషల్ ​మీడియాలో పోస్ట్ ​చేస్తూనే ఉన్నారు.

వీరికి బ్లడ్​ తప్పనిసరి..

తలసేమియా, సికిల్​సెల్‌‌ అనీమియాతో బాధపడేవారికి నెలనెలా తప్పనిసరిగా రక్తం ఎక్కించాలి. ఈ పేషెంట్లు తమకు అందుబాటులో ఉన్న బ్లడ్‌‌ బ్యాంకులో ముందుగానే పేర్లు నమోదు చేసుకుం
టారు. ప్రస్తుతం వీరితోపాటు అత్యవసరమైన డెలివరీ కేసులకు మాత్రమే బ్లడ్ ఇస్తున్నామని పలు బ్లడ్ బ్యాంకుల నిర్వాహకులు చెబుతున్నారు. క్యాన్సర్ పేషెంట్లకు వైట్ బ్లడ్ సెల్స్ అవసరం ఉంటాయి. వీటి నిల్వలు కూడా ప్రస్తుతం నిండుకున్నాయి. సర్జరీలు మరింత పెరిగితే చాలా ఇబ్బంది అవుతుందని బ్లడ్ బ్యాంకుల నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ బయటి బ్లడ్ బ్యాంకుల నుంచి రక్తం తీసుకొస్తామంటే అనుమతించడం లేదు. ఇన్​టైంలో డోనర్​ దొరక్క కొన్ని నెగెటివ్ బ్లడ్ గ్రూప్​పేషెంట్లకు సర్జరీలు ఆగిపోతున్నాయి. కొన్ని హాస్పిటల్స్​మాత్రమే అనుమతిస్తున్నాయి. 

డోనర్లు ముందుకు రావాలి

బ్లడ్ డొనేట్ చేసేందుకు డోనర్లు ముందుకు రావాలి. గతంలో రెగ్యులర్​గా డోనెట్ చేసేవారు ఇప్పుడు కూడా ఇవ్వాలి. మా వద్ద 500కు పైగా డోనర్ల వాట్సాప్​
గ్రూప్​లు ఉన్నాయి. గతంలో వేల మంది స్వచ్ఛందంగా బ్లడ్​ ఇచ్చేవారు. ప్రస్తుతం చాలా మంది స్పందిస్తున్నప్పటికీ.. అంతకు మించిన డిమాండ్ ఉంది. రేర్​బ్లడ్​గ్రూప్ ​పేషెంట్లకు కొన్నిసార్లు బ్లడ్​అందివ్వడం కష్టమవుతోంది. బ్లడ్ దొరకక సర్జరీలు పోస్ట్​పోన్ అయితే చాలా బాధ అనిపిస్తోంది.

– బంటి, బీయింగ్​ హ్యుమన్ 
ఏక్ ఉమీద్ సంస్థ​ నిర్వాహకుడు

అవసరం లేకున్నా పర్మిషన్ ​ఇస్తున్నరు

రాష్ట్రంలో బ్లడ్ బ్యాంకులు పెరుగుతున్నాయి. అవసరం లేకున్నా ప్రభుత్వం కొత్త వాటికి పర్మిషన్లు ఇస్తోంది. ఫలితంగా ఉన్నవి నడవడం లేదు. బిజినెస్ లేక కొందరు బ్లడ్ బ్యాంకులు తీసేస్తుండగా, మరికొందరు అమ్ముకుంటున్నారు. 10 ఏండ్లుగా కొనసాగుతున్న వాటికి దగ్గరలోనే మరో దానికి పర్మిషన్ ​ఇస్తున్నారు. దీంతో కొత్తది, పాతది రెండూ నడవడం లేదు. 20 బెడ్లు ఉన్న హాస్పిటల్​లో బ్లడ్ బ్యాంకుకు పర్మిషన్ ​ఇస్తే మిగిలినవి ఎలా నడుస్తాయి. బ్లడ్ షార్టేజ్ పెరగడానికి ఇదొక కారణం.

– ఎల్.లక్ష్మీరెడ్డి, ప్రెసిడెంట్, 
తెలంగాణ వాలంటరీ బ్లడ్ బ్యాంక్ అసోసియేషన్