ఘోర ప్రమాదం: 57 మంది ప్రయాణిస్తున్న బోట్ బోల్తా

ఘోర ప్రమాదం: 57 మంది ప్రయాణిస్తున్న బోట్ బోల్తా

ఒడిశా రాష్ట్రంలో శనివారం తెల్లవారుజామున ఘోర విషాదం చోటుచేసుకుంది. ఝార్సుగూడ జిల్లాలో మహానది నదిలో 57మందితో ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. ఛత్తీస్‌గఢ్‌లోని ఖర్సియా ప్రాంతానికి చెందిన 50 మందికి పైగా ప్రయాణికులు బార్‌ఘర్ జిల్లాలోని పథర్సేని కుడాలోని ఆలయాన్ని సందర్శించి పడవలో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జార్సుగూడ జిల్లాలోని రెంగలి పోలీస్ స్టేషన్ పరిధిలోని శారదా ఘాట్ వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా బోటు బోల్తా పడింది. 

ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రయాణికులు చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. స్థానిక మత్స్యకారులు 35 మంది ప్రయాణికులను రక్షించారు. మరో 13 మందిని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. ఇంకా ఏడుగురు నదిలో గల్లంతయ్యారు.  వారిలో నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. పోలీసులు, డిజాస్టర్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. 

ప్రమాదానికి కారణాలు..

బోటు కెపాసిటీ 50మందే కాగా.. అందులో 57 మందిని ఎక్కించారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. అంతేకాకుండా బోటుకు ఫిట్ నెస్ సర్టిఫికేట్ లేదని, లైవ్ జాకెట్ కూడా ప్రయాణికులకు ఇవ్వలేదని ఆరోపణలు వస్తున్నాయి.

అధికారుల సహాయక చర్యలు..

ప్రధాన కార్యదర్శి పికె జెనా, స్పెషల్ రిలీఫ్ కమీషనర్ (ఎస్‌ఆర్‌సి) సత్యబ్రత సాహు భువనేశ్వర్ నుండి రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నప్పుడు, రెవెన్యూ డివిజనల్ కమిషనర్ (ఆర్‌డిసి), జార్సుగూడ జిల్లా కలెక్టర్, ఎస్సీ మహానది ఉండి ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు. నాలుగు బృందాలను ఏర్పాటు చేశామని, కనీసం ఐదుగురు స్కూబా డైవర్‌లతో పాటు రెండు నీటి అడుగున సెర్చ్ కెమెరాలను సెర్చ్ ఆపరేషన్‌లో మోహరించినట్లు ఐజి చెప్పారు. భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో స్కూబా డైవర్లు, నీటి అడుగున సెర్చ్ కెమెరాలను ఘటనాస్థలికి తరలించారు. మృతుల బంధువులకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియాను ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు.