కాశ్మీర్ లోయలో భారీ వర్షాలు... బోటు బోల్తా పడి నలుగురు మృతి

కాశ్మీర్ లోయలో భారీ వర్షాలు... బోటు బోల్తా పడి నలుగురు మృతి

కాశ్మీర్ లోయలో గత 72 గంటల నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. జీలం నదిలోకి వరద నీరు చేరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. శ్రీనగర్ సమీపంలో మంగళవారం ఉదయం జీలం నదిలో ప్రయాణికులతో ఉన్న పడవ బోల్తా పడింది. ఈ  ప్రమాదంలో  నలుగురు చనిపోగా.. మరో ముగ్గురు గల్లంతైయ్యారు. ఎస్‌డిఆర్‌ఎఫ్ టీంలు సెర్చ్ ఆపరేషన్ చేసి 12 మందిని రక్షించారు.

పడవలో ఎక్కువగా స్కూల్ కు వెళ్లే పిల్లలు, కొంతమంది స్థానికులు ఉన్నట్లు సమాచారం. శ్రీనగర్‌లోని బట్వారా జిల్లా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జమ్మూ కాశ్మీర్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లోని గందర్‌బాల్ జిల్లాలోని సోనామార్గ్‌లో మంచు కురిసింది. కిష్త్వార్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలతో చుట్టు పక్కల ప్రాంతాల్లోఎడతెరిపి లేకుండా  వర్షాలు కురుస్తున్నాయి.

ఇటీవల జమ్ము కశ్మీర్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. దాదాపుగా ఇక్కడ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. వంపులు కలిగిన రహదారులు, కొండ ప్రాంతం కావడంతో మలుపులు తిరిగే సమయంలో వాహనాలు అదుపు తప్పి తరచూ లోయల్లో పడుతుంటాయి. కానీ ఈసారి మాత్రం పడవ ప్రమాదం చోటుచేసుకుంది. తాజా ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.