సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ అకౌంట్ల సప్లై..బోడుప్పల్‌‌‌‌ కేంద్రంగా ఆటోడ్రైవర్ల దందా

సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ అకౌంట్ల సప్లై..బోడుప్పల్‌‌‌‌  కేంద్రంగా ఆటోడ్రైవర్ల దందా
  •     క్రిమినల్స్  చేతికి 127 మ్యూల్ అకౌంట్లు
  •     వాటిలో రూ.24 కోట్ల సైబర్ క్రైం మనీ డిపాజిట్
  •     ఒక్కో ఖాతాకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు వసూలు
  •     ఎనిమిది మంది అరెస్టు
  •     పరారీలో రాజస్తాన్‌‌‌‌  గ్యాంగ్‌‌‌‌ 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ అకౌంట్లను సప్లయ్ చేస్తున్న ఆటోడ్రైవర్ల గ్యాంగ్‌‌‌‌ గుట్టు రట్టు అయింది. మ్యూల్‌‌‌‌ అకౌంట్లను రాజస్తాన్‌‌‌‌ ముఠాకు విక్రయిస్తున్న ఎనిమిది మంది సభ్యుల ముఠాను హైదరాబాద్‌‌‌‌ సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఆటోడ్రైవర్ల గ్యాంగ్‌‌‌‌ విక్రయించిన మ్యూల్‌‌‌‌ ఖాతాల్లో రూ.24.10 కోట్ల సైబర్ క్రైం మనీ డిపాజిట్‌‌‌‌ కాగా అందులో రూ 23.99 కోట్లను సైబర్ నేరగాళ్లు విత్‌‌‌‌‌‌‌‌‌‌డ్రా చేసుకున్నట్లు గుర్తించారు. అకౌంట్లలో నిల్వ ఉన్న రూ.16.31 లక్షలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. 

బోడుప్పల్‌‌‌‌  పరిసర ప్రాంతాల్లోని ఆటోడ్రైవర్లు చేస్తున్న మ్యూల్‌‌‌‌  ఖాతాల దందా వివరాలను సిటీ సైబర్ క్రైమ్  డీసీపీ అరవింద్‌‌‌‌  బాబు, అడిషనల్ సీపీ (క్రైమ్స్‌‌‌‌) శ్రీనివాస్‌‌‌‌  మంగళవారం మీడియాకు వెల్లడించారు. మేడ్చల్  మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్‌‌‌‌కు చెందిన పూజారి జగదీశ్ అలియాస్‌‌‌‌ జగ్గు (31) ఆటోడ్రైవర్‌‌‌‌‌‌‌‌. రాజస్థాన్‌‌‌‌కు చెందిన కన్నయ్య అనే మ్యూల్ అకౌంట్ల ఏజెంట్‌‌‌‌కు గేమింగ్ యాప్స్ లావాదేవీల కోసం బ్యాంకు ఖాతాలను సప్లయ్ చేస్తున్నాడు. భార్య, తల్లి, బంధువులు,స్నేహితుల పేర్లతో జగ్గు బ్యాంక్  అకౌంట్లు ఓపెన్  చేశాడు. 

కన్నయ్య అందించిన ఫోన్ నంబర్లను ఆ అకౌంట్లకు లింక్‌‌‌‌ చేశాడు. పాస్‌‌‌‌బుక్, ఏటీఎం కార్డ్ సహా బ్యాంక్ లావాదేవీలకు అవసరమైన అన్ని క్రెడిన్షియల్స్‌‌‌‌ ను అప్పగించేవాడు. ఇందుకోసం జగ్గు ఒక్కో అకౌంట్‌‌‌‌కు రూ.10  వేల నుంచి రూ.15 వేలు తీసుకునేవాడు. బోడుప్పల్‌‌‌‌కు చెందిన మరో ఆటోడ్రైవర్‌‌‌‌‌‌‌‌ గురుదాస్  సునీల్తో కలిసి జగ్గు గ్యాంగ్‌‌‌‌ను ఏర్పాటు చేసుకున్నాడు. పలు బ్యాంకుల్లో అకౌంట్లు ఓపెన్‌‌‌‌ చేశాడు. వాటి కిట్‌‌‌‌లను కన్నయ్యకు ఇచ్చేవాడు. 

పోటాపోటీగా మ్యూల్ అకౌంట్ల నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ 

హైదరాబాద్ సహా శివారు ప్రాంతాల్లోని నిరక్షరాస్యు లు, ఆటోడ్రైవర్లు, కూలీల పేరున మ్యూల్ అకౌంట్లు ఓపెన్‌‌‌‌ చేసేందుకు జగదీశ్ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ ఏర్పాటు చేసుకున్నాడు. ఇందులో బోడుప్పల్ ప్రాంతానికే చెందిన మరో ఆటోడ్రైవర్‌‌‌‌‌‌‌‌ గుంటి మణిదీప్‌‌‌‌ (27), ఉప్పల్‌‌‌‌కు చెందిన పర్లపల్లి నిఖిల్‌‌‌‌ను చేర్చుకున్నాడు. 

వీరి ఒక్కో అకౌంట్‌‌‌‌కు రూ.1,500 నుంచి రూ.3 వేలు చెల్లించేవాడు.ఈ మ్యూల్‌‌‌‌ అకౌంట్ల దందాలో సులువుగా డబ్బు వస్తుండడంతో మణిదీప్‌‌‌‌ మరో గ్యాంగ్‌‌‌‌ను ఏర్పాటు చేశాడు. రాజస్తాన్‌‌‌‌కు చెందిన పూనమ్‌‌‌‌తో డైరెక్ట్‌‌‌‌గా కాంటాక్ట్‌‌‌‌ అయ్యాడు. అకౌంట్లు ఓపెన్‌‌‌‌  చేసేందుకు జూబ్లీహిల్స్‌‌‌‌లోని కరూర్ వైశ్య బ్యాంక్‌‌‌‌లో బిజినెస్‌‌‌‌  డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌  ఎగ్జిక్యూటివ్‌‌‌‌గా పనిచేస్తున్న.. బాలాజీ నాయక్ (27), యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్‌‌‌‌‌‌‌‌కు చెందిన బొల్లు బాలు(21), అంబర్‌‌‌‌‌‌‌‌పేటకు చెందిన బత్తుల పవన్ (24), బోడుప్పల్‌‌‌‌కు చెందిన  పోలాస్  ప్రవీణ్‌‌‌‌(29) తో కలిసి మణిదీప్ మ్యూల్ అకౌంట్ల ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. 

ఖాతాదారుల కోసం వెతుకుతూ దొరికిపోయారు

జగదీశ్, మణిదీప్‌‌‌‌  మొత్తం 127 బ్యాంక్  అకౌంట్ల కిట్లను కొరియర్  ద్వారా రాజస్తాన్‌‌‌‌కు తరలించారు. వీటిని రాజస్థాన్ ముఠా సైబర్  నేరగాళ్లకు విక్రయించింది. రెండేండ్లుగా ఈ గ్యాంగులు మ్యూల్  అకౌంట్ల దందా చేస్తున్నాయి. అకౌంట్‌‌‌‌ ఇస్తే డబ్బులు ఇస్తారని ఆటోడ్రైవర్లలో ప్రచారం జరుగుతుండగా సిటీ ఈస్ట్‌‌‌‌జోన్ టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ పోలీసులకు సమాచారం అందింది. 

దీంతో జగదీశ్, మణిదీప్‌‌‌‌ గ్యాంగ్ లోని మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశారు. మ్యూల్ అకౌంట్లలో 21 కేసులకు సంబంధించిన డబ్బు డిపాజిట్‌‌‌‌ అయినట్లు గుర్తించారు. రాజస్థాన్‌‌‌‌లోని మ్యూల్  ఏజెంట్లను అరెస్టు చేసేందుకు స్పెషల్  టీమ్స్ ఏర్పాటు చేశామని అడిషనల్  సీపీ శ్రీనివాస్ తెలిపారు.