సీఎం రేవంత్ జేబు సంస్థగా ఎన్నికల కమిషన్ : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్

సీఎం రేవంత్ జేబు సంస్థగా ఎన్నికల కమిషన్ :  ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
  •     బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శ 

హైదరాబాద్​, వెలుగు: రాజ్యాంగబద్ధమైన ఎన్నికల కమిషన్​.. సీఎం రేవంత్​కు జేబు సంస్థగా మారిపోయిందని బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్​విమర్శించారు. ఆగమేఘాల మీద ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్​ను ఎందుకిస్తున్నదని ప్రశ్నించారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్​లో మీడియాతో మాట్లాడారు. కోట్లకు కోట్లు ఖర్చు చేసి సీఎం రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేశారని ఆరోపించారు. 

ఎన్నికల సంఘం షెడ్యూల్​ను ఇచ్చి ప్రజలను తడిగుడ్డతో గొంతు కోసినట్టయిందని ఫైర్ అయ్యారు. రిజర్వేషన్ల బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్​లో ఉన్నాయని తెలిపారు. 42% రిజర్వేషన్లు ఇస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 9పై హైకోర్టులో కేసు ఉందని, జీవోపై హైకోర్టు స్టే విధించిందని చెప్పారు. దీంతో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తే.. అక్కడ కూడా స్టే వచ్చిందని పేర్కొన్నారు. వచ్చే నెల 12న దీనిపై తీర్పు రావాల్సి ఉందని వెల్లడించారు.

 జీవో 46 ఆధారంగా షెడ్యూల్​ ఇస్తున్నారని, హైకోర్టులో ఆ కేసు పెండింగ్ లో ఉన్నప్పుడు ఆగమేఘాల మీద షెడ్యూల్​ ఎందుకు విడుదల చేస్తున్నారని ప్రశ్నించారు. ఎన్నికలపై డ్రామా చేస్తున్నారా.. సినిమా నడుపుతున్నారా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దలకంటే బుద్ధి లేదని, అధికారులకు కూడా బుద్ధి లేదా అని మండిపడ్డారు.