ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి రోడ్ మ్యాప్..కీలక రంగాల్లో కలిసి పనిచేస్తాం: శ్రీధర్ బాబు

ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి రోడ్ మ్యాప్..కీలక రంగాల్లో కలిసి పనిచేస్తాం: శ్రీధర్ బాబు

    టెక్నాలజీ, మెడికల్ హబ్​గా హైదరాబాద్: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 

    "తెలంగాణ- నార్త్ ఈస్ట్ కనెక్ట్" ఫెస్టివల్ ఫేజ్2 ప్రారంభం  

హైదరాబాద్, వెలుగు: మెడిసిన్, టెక్నాలజీ రంగాల్లో ఎన్నో ఆవిష్కరణలకు హైదరాబాద్ కేంద్రంగా నిలిచిందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఫేజ్1లో మహిళా సాధికారత, సినిమా, చిత్రకళ, ఫొటోగ్రఫీ, క్రీడలపై  కార్యక్రమాలు అద్భుతంగా సాగాయన్నారు. 

ఫేజ్ 2లో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. డిజిటల్ కనెక్టివిటీ, ఎంట్రప్రెన్యూర్షిప్, టెక్నాలజీ, స్కిల్ డెవలప్ మెంట్, లైఫ్ సైన్సెస్, బయో ఇన్నోవేషన్, గ్రామీణాభివృద్ధి తదితర రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యానికి సమగ్ర రోడ్ మ్యాప్ రూపొందిస్తామన్నారు. 

మంగళవారం రాజ్ భవన్ లో "తెలంగాణ–నార్త్ ఈస్ట్ కనెక్ట్” టెక్నో–కల్చరల్ ఫెస్టివల్ ఫేజ్2 ప్రారంభోత్సవంలో గవర్నర్, మంత్రి పాల్గొని మాట్లాడారు. ప్రాంతం, రాష్ట్రంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని అక్కున చేర్చుకునే గొప్ప మనస్సు తెలంగాణ ప్రజలదని శ్రీధర్ బాబు అన్నారు. కనెక్టివిటీ, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లాంటి సవాళ్లను సైతం అధిగమించి డిజిటల్ అక్షరాస్యత, ఐటీ స్కిల్లింగ్, ఫిన్ టెక్, డిజిటల్ సర్వీస్ లను ఈశాన్య రాష్ట్రాలు అందిపుచ్చుకుంటున్నాయని చెప్పారు. 

తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్, ఏఐ యూనివర్సిటీ, ఏఐ సిటీ, దేశంలోనే తొలి ఏఐ ఆధారిత డేటా ఎక్స్ చేంజ్, ఏఐ ఇంటిగ్రేటెడ్ అకడమిక్ కరిక్యులం కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ వంటివి రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్ గా మార్చుతాయన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో స్టార్టప్ లను ప్రోత్సహించేందుకు టీ హబ్ తరహాలోనే "వన్ బయో" పేరిట ప్రత్యేక ఇంక్యుబేషన్ కేంద్రాన్ని తెచ్చామని తెలిపారు.

 రాబోయే రోజుల్లో నార్త్ ఈస్ట్–తెలంగాణ టెక్ కారిడార్, జాయింట్ ఇన్నోవేషన్ ల్యాబ్స్, బయో ఇంక్యుబేటర్స్ క్రియేటివ్ టెక్ స్టూడియోలు, గ్రీన్ ఎనర్జీ కొలాబరేషన్స్ తదితర అంశాల్లో ఈశాన్య రాష్ట్రాలతో కలిసి పని చేస్తామన్నారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చోంగ్తూ, తదితరులు పాల్గొన్నారు.