హిందీ, ఇంగ్లీష్​ సినిమాలతో పాక్​లో లైంగిక నేరాలు

హిందీ, ఇంగ్లీష్​ సినిమాలతో పాక్​లో లైంగిక నేరాలు

ఇస్లామాబాద్​: సందు దొరికితే చాలు ఇండియా మీద రెచ్చిపోతారు పాకిస్తాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​. బాలీవుడ్​, హాలీవుడ్​ సినిమాల వల్ల పాకిస్తానోళ్లు చెడిపోతున్నరట. దేశంలో సెక్స్​ క్రైమ్​ పెరగడానికి ఆ సినిమాలే కారణమట. ఈ మధ్య ఇస్లామాబాద్​లో కంటెంట్​ డెవలపర్లు, యూట్యూబర్లతో మాటామంతి సందర్భంగా ఆయన ఈ మాటలన్నారు. ఇప్పుడు పిల్లలకూ మొబైల్​ ఫోన్లుంటున్నాయని, గతంలో ఎన్నడూ లేనంతగా అవసరం లేని కంటెంట్​ కూడా దొరుకుతోందని ఆయన అన్నారు. వాటి వల్ల పెద్ద ముప్పు పొంచి ఉందన్నారు. ‘‘పాకిస్తాన్​లో లైంగిక నేరాలు పెరగడానికి కారణం హాలీవుడ్​, బాలీవుడ్​ సినిమాలే కారణం. వాటితో చైల్డ్​ పోర్నోగ్రఫీ, పీడోఫీలియా (పిల్లలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు) వంటివి పెరిగిపోతున్నాయి. ఆ నేరాలన్నింటిపై మా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. వెస్టర్న్​ దేశాల్లోని సంస్కృతి వల్ల కలిగే నష్టాలేంటో హాలీవుడ్​, బాలీవుడ్​ సినిమాలను చూస్తున్న వాళ్లకు తెలియట్లేదు. వాటిని చూడడం వల్ల వెస్టర్న్​ సంస్కృతిని ఇక్కడకు తీసుకొస్తునామన్న విషయం కూడా వారు గుర్తించట్లేదు’’ అని అన్నారు. అంతేగాకుండా కుటుంబాల మధ్య గొడవలు రావడానికి, భార్యాభర్తల విడాకులకూ బయటి దేశాల నుంచి వస్తున్న సినిమాలు, కంటెంటే కారణమని ఆరోపించారు. స్కూళ్లలోనే పిల్లలు డ్రగ్స్​ వాడుతున్నారని, తాను అధికారంలోకి వచ్చే దాకా ఆ విషయాన్ని గుర్తించలేకపోయానని, వీటన్నింటికీ కారణం బయటి దేశాల కంటెంటేనని అన్నారు.