బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో సుశాంత్‌ రూమ్‌మేట్‌ సిద్దార్థ్‌కు బెయిల్‌ 

బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో సుశాంత్‌ రూమ్‌మేట్‌ సిద్దార్థ్‌కు బెయిల్‌ 

బాలీవుడ్‌ డ్రగ్‌ కేసులో అరెస్టయిన సిద్దార్థ్‌ పితానీకి ఊరట లభించింది. దివంగత నటుడు సుశాంత్‌ రాజ్‌పుత్‌ మరణం తర్వాత డ్రగ్స్‌ కేసులో అతని రూమ్‌మేట్‌ అయిన సిద్ధార్థ్‌ గతేడాది అరెస్టయిన విషయం తెలిసిందే. దాదాపు 403 రోజుల తర్వాత సిద్ధార్థ్‌ పితానీకి సోమవారం (జులై 4న) బాంబే హైకోర్టు బెయిల్‌మంజూరు చేసింది. రూ.50వేల వ్యక్తిగత పూచీకత్తుపై సిద్ధార్థ్‌కు జస్టిస్‌ భారతీ డాంగ్రే బెయిల్‌ మంజూరు చేశారు.

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్ మరణానంతరం వెలుగులోకి వచ్చిన డ్రగ్స్‌ కేసులో సిద్ధార్థ్‌ను నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సిబి) గతేడాది మే 28న అరెస్ట్‌ చేసింది. ఈ కేసులో ఇప్పటికే మూడుసార్లు బెయిల్‌ పిటిషన్లను తిరస్కరించడంతో సిద్ధార్‌ హైకోర్టును ఆశ్రయించాడు. సిద్ధార్థ్‌ డ్రగ్స్‌ రవాణా చేసినట్లు ఎక్కడా ఆధారాలు లేవని తన తరపు న్యాయవాది వాదించారు. అయితే, అతని ల్యాప్‌టాప్‌, ఫోన్‌లో వీడియోలు, ఇతర ఆధారాలు ఉన్నాయని ఎన్‌సీబీ వాదించింది.

సుశాంత్ జూన్ 2020లో ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుశాంత్‌ సింగ్‌ ఆకస్మిక మరణం అనంతరం సినీ పరిశ్రమలో డ్రగ్స్‌ వాడకం, సంబంధాలపై ఎన్‌సీబీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో సుశాంత్‌ ప్రియురాలు రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షౌవిక్‌ చక్రవర్తి సహా పలువురిని అరెస్టు చేశారు. ప్రస్తుతం చాలా మంది బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసులో పలువురు ప్రముఖ బాలీవుడ్‌ నటీనటుల పేర్లు వెలుగులోకి వచ్చాయి.