బుక్స్​ బోరింగ్ కాదు.. అలవాటయితే అమృతమే..

బుక్స్​ బోరింగ్ కాదు.. అలవాటయితే అమృతమే..

పుస్తకాలు బతికే ఉన్నయా?

“మంచి స్నేహితులు, మంచి పుస్తకాలు, నిద్రమత్తులో ఉండే అంతరాత్మ - ఇవి చాలు ఆదర్శవంతమైన జీవితానికి’’ అన్నాడు మార్క్ ట్వైన్. ఆత్మీయులు, అంతరాత్మ సరేకానీ, పుస్తకాలు ఏ మాత్రం మన జీవితంలో భాగం అనేది ఇప్పుడు ప్రశ్న. 

స్మార్ట్​ఫోన్స్​, ల్యాప్​టాప్, ట్యాబ్​​ జమానాలో...  వాట్సాప్​, టెలిగ్రామ్, ఫేస్​బుక్​, ఇన్​స్టా సోషల్​ వరల్డ్​లో... బిజీగా ఉండే జమానాలో.. పుస్తకం ఎవరు చదువుతారనేది పెద్ద క్వశ్చన్​? కానీ పుస్తకాలతోనే రోజంతా గడిపేవాళ్లు, పుస్తకాల కోసం వేల రూపాయల డబ్బు ఖర్చుపెట్టేవాళ్లు, పుస్తకాలు చదువుతూ రాత్రిళ్లు నిద్ర పోవాలనే విషయాన్ని మరిచిపోయేవాళ్లు... చాలామందే ఉంటారు. టెక్​ ప్రపంచంలో కొట్టుకుపోతున్న కొత్త జనరేషన్​ పుస్తకాలు చదువుతారా? అని సందేహం రావడం సహజమే. కానీ వాళ్లలో కూడా కాస్త ఎక్కువమందే​ పుస్తకాన్ని ఎంతో ప్రేమగా హృదయానికి హత్తుకుంటున్నారు. అవును అంత ఇంట్రెస్ట్​ ఉండబట్టే​​ దేశంలో.... కాదు కాదు ప్రపంచంలో ఎక్కడ బుక్​ ఎగ్జిబిషన్ జరిగినా సూపర్​ సక్సెస్​ అవుతోంది. అలానే మన హైదరాబాద్​లో జరిగే బుక్​ ఎగ్జిబిషన్​కు కూడా మన రాష్ట్రం నుంచే కాకుండా ఇరుగుపొరుగు రాష్ట్రాలనుంచి బుక్​ లవర్స్​ పోటెత్తుతారంటే అతిశయోక్తి కాదు. క్రితం ఏడాది కరోనా కారణంగా హైదరాబాద్​లో బుక్​ ఎగ్జిబిషన్​ జరగలేదు. ఆ ఏడాదంతా అప్పుడప్పుడు జరిగిన ఒక పుస్తకావిష్కరణ సభ తప్పితే పెద్ద సాహితీ ఉత్సవమేదీ జరగలేదనే చెప్పాలి. అలాంటి పరిస్థితుల్లో నిన్నటినుంచి మొదలైన బుక్​ ఎగ్జిబిషన్​ ఎంతోమంది సాహితీప్రియుల కలయికకు ఒక వేదిక కానుంది. రాసేవాళ్లు, పబ్లిష్​ చేసేవాళ్లు, చదివేవాళ్లు... అందరూ ఒక చోట చేరి సాహిత్యం గురించిన చర్చల్లో మునిగి తేలే హైదరాబాద్ బుక్​ ఫెయిర్ ఈ వారం మళ్ళీ మొదలైంది. 

మధ్యాహ్నం వెచ్చని ఎండలో ప్రారంభమై, రాత్రి మంచు తెరల మధ్య ముగిసే పుస్తక ప్రదర్శన హైదరాబాద్ సాహితీ రంగానికి ఒక ముఖ్యమైన సందర్భమే. అయినా ప్రతిసారీ సందర్శకుల సంఖ్య గురించి, పుస్తకాల అమ్మకాల గురించి నిర్వాహకుల్లో కొంత ఆందోళన ఉంటుంది. దీనికి కారణాలు అనేకం. సంవత్సరాలు గడిచే కొద్దీ పుస్తకాలు కొనేవాళ్ళు తగ్గిపోయారు. డిజిటల్ కాపీలు చదివే వాళ్ల సంఖ్య పెరిగింది. మొత్తానికే అసలు పుస్తకాలు చదివేవాళ్ళ శాతం మాత్రం కాస్త తగ్గిందనే చెప్పాలి.

ఆ అమ్మకాలు పెరిగి...
‘‘నా అభిప్రాయం ప్రకారం 2016లో డీమానిటైజేషన్ నాటి నుంచి ప్రింటింగ్​ ప్రెస్​లపైన ప్రభావం పడటం మొదలైంది. ఆ తర్వాత కరోనా మహమ్మారి కాలంలో రచయితలు ఉత్సాహంగా రాస్తూనే ఉన్నా, ప్రింటింగ్, మార్కెటింగ్, పంపిణీ దుకాణాల్లో అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి. ఆన్​లైన్ అమ్మకాలు పెరిగాయి. పబ్లిష్​ చేసిన పుస్తకాల అమ్మకం దాదాపు అసాధ్యమైంది” అంటారు ఎమెస్కో పబ్లిషర్స్ చంద్ర శేఖర్ రెడ్డి. 
‘‘నాలుగేళ్లపాటు వరుసగా ఏదో ఒక సంక్షోభం వస్తుంటే, ఏ పరిశ్రమ అయినా తట్టుకోలేదు. అందులోనూ పుస్తక ప్రచురణ వంటిది ఒక ప్రత్యేకమైన, జనాభాలో కొంతమందికే సంబంధించినది. పెద్ద ప్రచురణకర్తలు కొంతవరకు నిలదొక్కుకున్నా, చిన్న పబ్లిషర్లు దుకాణాల నుంచి డబ్బు రాక, అమ్మకాలు అనుకున్నంతగా జరగక, లాభాల సంగతి ఎలా ఉన్నా, ఖర్చులు కూడా వెనక్కి రాక ఇబ్బంది పడుతున్నారు. పెద్ద ప్రచురణ సంస్థలు ఫిక్షన్, కవిత్వం, నవలలు వేయడం దాదాపుగా మానేశాయి. కొన్ని ముఖ్యమైన, చరిత్ర, రాజకీయం, ఫిలాసఫీ వంటి విషయాలు, స్కాలర్లీ రచనలకు మాత్రమే ఇంపార్టెన్స్​ ఇస్తున్నాయి. ఇప్పుడు రచయితలూ, కవులు తమ రచనలను సొంతంగా వేసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. పుస్తకం ప్రింట్ చేసుకోవడం ఇప్పుడు చవకే. కానీ... వేసుకున్న కాపీలను ఎలా పంచుతారు? అంతకంటే ముఖ్యంగా వాటిని ఎలా అమ్ముకుంటారు? తమ డబ్బు ఎలా తిరిగి రాబట్టుకుంటారు? అనేది పెద్ద ప్రశ్న’’ అంటారు చంద్రశేఖర్ రెడ్డి.

ఎంతో ఆసక్తితో ఎదురుచూపు
కరోనా తరువాత కాలంలో మొదటి బుక్ ఫెయిర్ కోసం ప్రచురణకర్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘‘మధ్యలో మేము జిల్లాల్లో పుస్తక ప్రదర్శనలు కొన్ని నిర్వహించాం. కానీ తెలుగు రాష్ట్రాల్లో అటువంటివాటికి అంతగా వెసులుబాటు లేదు’’ అంటారు చంద్రశేఖర్ రెడ్డి. 
‘‘చిన్న ప్రచురణకర్తలు దెబ్బతిన్నమాట నిజమే. పుస్తక ప్రచురణ ఖర్చుతో కూడుకున్న పని. ఆ తర్వాత వాటి పంపిణీ బాధ్యత కూడా మనదే అయినప్పుడు, చిన్న సంస్థలకు ఇది తలకు మించిన భారం. రిటర్న్స్ వెంటనే రావు, ఓపిక పట్టాలి” అని చెప్పారు ‘అచ్చంగా తెలుగు’  సంస్థ పద్మినీ భావరాజు. కరోనా తరువాత కాలంలో కూడా ధైర్యంగా ఫిక్షన్ కాకుండా ఇతర రకాల పుస్తకాలు కూడా వేసింది ఈ సంస్థ. 

అమ్మడం కష్టం
పుస్తకాలు అమ్మడం ఎందుకంత కష్టం? ఈ ప్రశ్నకు పబ్లిషర్లు చెప్పిన సమాధానాలు ఇంట్రెస్టింగ్​గా ఉన్నాయి. ‘‘పుస్తకాలకు, పాఠకులకు మధ్య ఒక గ్యాప్ వస్తోంది. చదివే వాళ్ళు కచ్చితంగా ఉన్నారు. మనం వాళ్లకు పుస్తకాలు ఎలా అందిస్తాం? అన్నదే కష్టమైన పని అంటారు పద్మిని. 
తెలుగు పుస్తకానికి విజిబిలిటీ తక్కువ. హైదరాబాద్ నగరంలో ఒక డజన్ దుకాణాలు, ఇతర నగరాల్లో ఒకటో రెండో ఉన్నాయంతే. మండల, తాలూకా స్థాయిల్లో చూస్తే అది కూడా ఉండదు. స్టేషనరీ షాపుల్లో టెక్స్ట్ బుక్స్ తప్పితే సాహిత్యం కనిపించదనేది చంద్రశేఖర్​ రెడ్డి అభిప్రాయం.
అసలు పుస్తకం పబ్లిష్​ అయినట్లు ఎలా తెలుస్తుంది? దుకాణాల్లో అయినా కనిపించాలి లేదా పత్రికల్లో సమీక్షలు రావాలి. ఈ విషయంలో పబ్లిష్​ అయ్యే పుస్తకాల సంఖ్యకి, ప్రచారంలో వచ్చేవాటికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటోంది. ఇలాంటి పరిస్థితిలో ఏ ధైర్యంతో ప్రచురణ సంస్థలు కొత్త పుస్తకాలు పబ్లిష్ చేస్తాయి? అసలు పుస్తకాల అమ్మకాలను దెబ్బతీసిన దోషం మెయిన్​గా డిజిటల్ మీడియాది అని కొందరంటే, అసలు రీడింగ్​ అనేదే తగ్గిపోయింది అని మరి కొందరు చెప్తున్న విషయం. ‘‘సికిందరాబాద్​లో గత 40 ఏండ్లుగా మా బుక్ రీడింగ్ క్లబ్​ వారం వారం కొత్త పుస్తక పరిచయ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తోంది. కానీ గత పదేళ్లుగా సభ్యుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఒక్కోసారి పాత వాళ్ళమే ఇద్దరు, ముగ్గురం కూర్చుని ఏదో ఒక పుస్తకం చదువుతున్నాం” అని చెప్పారు న్యూ ఎరా బుక్ రీడింగ్ క్లబ్ కార్యదర్శి ఎం. సుబ్రహ్మణ్యన్. మెంబర్​షిప్​ పెరగకపోవడమే కాదు, క్లబ్ సమావేశాల్లో కొత్త పుస్తకాలు రావడం లేదనీ, ఆధ్యాత్మికం, చరిత్ర లేదా క్లాసిక్స్ మళ్ళీ మళ్ళీ చదువుకుంటున్నాం అని చెప్పారాయన.

వంద రోజుల బుక్​ రీడింగ్
ఈ పరిస్థితిని గమనించిన సామాజిక ఉద్యమకర్త డాక్టర్ సూర్యప్రకాష్ వింజమూరి స్ప్రెడింగ్ లైట్ పేరిట 100 రోజుల బుక్​ రీడింగ్​ ప్రోగ్రామ్​ చేశారు. ‘‘పుస్తకాలు చదవడం అనేది మాయమైపోతున్న అలవాటు. చదివే అలవాటును మళ్లీ గుర్తు చేయాలంటే దాన్నో ఉద్యమంలా చేయాలి. అందుకు ఒక వేదిక సరిపోదు. అది నిరంతరం సాగే ప్రక్రియగా ఉండాలి. అదే ఉద్దేశంతో మేము నగరంలో వివిధ కాలనీలు, ప్రాంతాల్లో అక్కడ స్థానికంగా బుక్ రీడింగ్ సెషన్లు పెట్టుకునేలా ప్రోత్సహించాం. ప్రతి ప్రాంతంలో ఔత్సాహికులు కమ్యూనిటీ హాల్, పార్క్, గుడి, అపార్ట్​మెంట్ బేస్​మెంట్, లేదా ఎవరో ఒకరి ఇంట్లో చిన్న స్థాయిలో అయినా సరే మూడు గంటల కార్యక్రమం ఏర్పాటు చేసుకునేలా ఒక నమూనా తయారు చేసాం. ప్రతి కార్యక్రమంలో ఒకరు లేదా ఇద్దరు వాళ్లు రాసిన పుస్తకం లేదా వాళ్లకి నచ్చిన పుస్తకం గురించి మాట్లాడాలి. ఈ మోడల్ చాలా విజయవంతమైంది’’ అని  డాక్టర్ సూర్య ప్రకాష్ చెప్పారు. స్ప్రెడింగ్ లైట్ కింద ఇప్పుడు హైదరాబాద్, ఇతర ప్రదేశాల్లో స్థానికంగా వందకి పైగా లైబ్రరీలు ఏర్పాటు చేయించారు డాక్టర్​ సూర్య ప్రకాష్​. 

చదవడం తగ్గిందా?
జనాలు పుస్తకాలు చదవడం లేదా అంటే... ‘‘కచ్చితంగా చదువుతున్నారు? నేను ఇంట్లో కూర్చుని ఆరు లక్షల కాపీల పుస్తకాలు అమ్మగలిగానంటే.. అర్థం పుస్తకాలు చదువుతున్నారనే కదా” అన్నారు పద్మిని. 
‘‘తెలుగులో ప్రధాన సమస్య.. ఎంట్రీ పాయింట్ సాహిత్యం లేకపోవడం’’ అంటున్నారు రైటర్, పబ్లిషర్​ వెంకట్ శిద్దారెడ్డి. ‘‘అంటే కొత్తగా పుస్తకాలు చదవాలన్న ఆసక్తి ఉన్నవాళ్లకు మనం సరైన సాహిత్యం అందించలేకపోవడం. బుక్​ పబ్లిషింగ్​ అంటే అదొక పెద్ద పరిశ్రమ అని, పుస్తకం అంటే ఒక ఇజం, ఒక పెద్ద భావజాలం ఉండాలనే అభిప్రాయాన్ని కలిగించారు. కానీ, కొత్తగా, ఒక టీనేజ్​లో అడుగుపెట్టిన రీడర్​కు కావాల్సింది ఈజీ రీడ్... - అంటే తేలికగా అర్థంచేసుకునేలా, ఆకట్టుకునేలా ఉండే రచనలు. ఒక ప్రేమ కథ, ఒక సింపుల్ జీవిత సత్యం, చిన్న కవితలు... ఇలా అందిస్తే చదవడం అనేది ఒక ప్రధాన వ్యాపకంగా మారుతుంది” అంటారాయన.
పుస్తకాలు చదవడం లేదనో, మార్కెట్ లేదనో పబ్లిషింగ్ పరిశ్రమ దెబ్బ తిన్నది అన్న వాదనతో అంగీకరించరు వెంకట్ శిద్దారెడ్డి. అన్వీక్షికీ పబ్లిషర్స్ ద్వారా తాము రెండేళ్లలో 56 పుస్తకాలు ప్రింట్‌ చేసి, వేలాది కాపీలు అమ్మిన విషయాన్ని గుర్తు చేశారు. ‘‘ఆ పుస్తకాల్లో ప్రేమకథలు ఉన్నాయి. సినిమా గురించిన రచనలు ఉన్నాయి. సీరియస్ పుస్తకాలు ఉన్నాయి. హైదరాబాద్ బుక్ ఫెయిర్ జరుగుతుండగానే కొన్ని పుస్తకాలు రీ ప్రింట్​కి వెళ్లాయి. అంటే మా విధానం, మేము వేస్తున్న పుస్తకాలకు ప్రజాదరణ ఉన్నట్లేగా?” అంటారాయన.

స్టయిల్​ మారింది అంతే...
‘‘ఇదివరకు పాఠకుల ప్రొఫైల్ కూడా ఒక మూసలో పోసినట్లు ఉండేది. మహిళా పాఠకులు నవలలు, కాల్పనిక సాహిత్యం, వంటల పుస్తకాలు చదువుతారని, పురుషులు ఆర్ధిక, రాజకీయ విషయాలపై ఆసక్తి చూపుతారని ఉండేది. అలాగే రీసెర్చ్ విద్యార్థులు మాత్రమే క్లిష్టమైన పుస్తకాలను టెక్స్ట్ బుక్స్​గా చదువుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదనేది నా అభిప్రాయం. అనేక రకాల సబ్జెక్ట్స్​ పట్ల ఆసక్తి పెరుగుతోంది. సగటు పాఠకుడు ఎవరు? అనే నిర్వచనం మారిపోయింది. టెక్నాలజీ బాగా వాడుకోగలిగిన వారు పుస్తకాల కోసం వెతుకుతున్నారు. బుక్​ రీడింగ్​ కానీ, పబ్లిషింగ్​ కానీ నష్టపోయాయని నేను అనుకోను. స్టయిల్​ మారింది అంతే’’ అంటున్నారు అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీలో గత నాలుగు దశాబ్దాలుగా పబ్లిషింగ్ ప్రచారంలో ఉన్న బాలకృష్ణన్ సత్యం. ఒక రచయితని, ఒక రచనని పరిచయం చేయడంలో మేం అనుసరించే పద్ధతులు మారాయంతే అంటారాయన. 

కొత్త పుస్తకాలు లక్షల్లో
ప్రపంచంలో ప్రతి ఏడాది లక్షల కొత్త పుస్తకాలను పబ్లిష్​ చేస్తారు. కొన్ని లక్షల క్లాసిక్​ బుక్స్​ రీప్రింట్​చేస్తారు. భారత్​లోనే దాదాపు 20 వేల ప్రచురణ సంస్థలు ఉన్నాయని, ఏడాదికి 90 వేలకు పైగా కొత్త పుస్తకాలు పబ్లిష్​ అవుతాయనేది ఒక అంచనా. వాటిల్లో దాదాపు50 శాతం హిందీ, ఇంగ్లీష్ కాగా, మిగిలినవి భారతీయ భాషల్లో పబ్లిష్​ అవుతాయి. 

‘‘ఇంటర్​నెట్ బ్యాండ్ విడ్త్ పెరిగే కొద్దీ పుస్తకాల పట్ల ఆసక్తి తగ్గుతోంది అనిపిస్తోంది. ముఖ్యంగా వందల పేజీలు చదివే ఓపిక, తీరిక ఈ జనరేషన్​కు ఉండడం లేదు. ఏదైనా బ్రీఫ్​గా, మూడు ముక్కల్లో తేల్చే విషయం ఉండాలి. చాలాసార్లు కొత్తగా బుక్స్​ రాసిన వాళ్ళు, సోషల్ మీడియాలో ఆపసోపాలు పడి పబ్లిసిటీ చేసుకోవడం చూస్తుంటాను. నిజానికి నేను రాసిన పుస్తకానికి కూడా మంచి సమీక్షలు వచ్చాయి. మా పబ్లిషర్ కూడా బాగా  ప్రచారం చేసినప్పటికీ ఆ ఎఫెక్ట్​ సేల్స్​లో కనిపించలేద”ని రచయిత రామయ్య ఆర్య చెప్పారు. తాను రాసిన ఇంగ్లిష్ నవల వెయ్యి కాపీలు అమ్మడమే కష్టమవడంతో ఇంకో పుస్తకం తేవడానికి ధైర్యం చాలడం లేదన్నారాయన.

పరిష్కారం ఏంటి? 
‘‘ఎంట్రీ పాయింట్ సాహిత్యం పెరగాలి. పిల్లలు, టీనేజర్లను ఆకర్షించే సాహిత్యం రావాలి. కొరుకుడు పడని పెద్ద పుస్తకాలు, పెద్ద విషయాలు మాత్రమే కాదు. పెద్ద ప్రచురణ సంస్థలు కూడా రీడర్స్​కు ఇంట్రెస్ట్​ కలిగించేలా తమ పబ్లిషింగ్ మార్చుకోవాలి’’ అంటారు వెంకట్ శిద్దారెడ్డి. 
యూరోపియన్ దేశాల వంటి చోట్ల బుక్​ రీడింగ్​ అనేది ఒక సంస్కృతి. పుస్తకాల దుకాణాలు కాఫీ షాపులుగా, ప్రదర్శనా స్థలాలుగా రూపాంతరం చెంది, ఒక పుస్తకం కొనుక్కోవడానికి వచ్చే వ్యక్తి, అక్కడ కొంత టైం ఉండి, ఒక 50 పుస్తకాలు తిరగేసి, పది పేజీలు చదివి, నాలుగు పుస్తకాలు కొనుక్కునేందుకు అనువైన వాతావరణం ఉంటుంది అక్కడ. అక్షరాస్యులైన ప్రతి ఒక్కరికీ అక్కడ పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. 
‘‘మనకి లైబ్రరీలు తగ్గిపోతున్నాయి. ఉన్న లైబ్రరీలు కొత్త పుస్తకాలు కొనడం లేదు. ప్రతి ఊరిలో ఒక సాహితీ, సాంస్కృతిక కేంద్రం ఏర్పాటు కావాలి. ఉదాహరణకి ఒక ఊళ్లోనో, కాలనీలోనే ఉన్న ఒక గొప్ప రచయిత పేరు పెట్టి, అక్కడ బుక్​ ఎగ్జిబిషన్​ పెట్టాలి. అప్పుడు బుక్స్​ మీద ఇంట్రెస్ట్​ పెరుగుతుంది’’ అన్నది చంద్రశేఖర్ రెడ్డి సజెషన్​. 

అది మంచిది కాదు 
డిజిటల్ వినోదం వల్ల కలుగుతున్న నష్టాన్ని మిడిల్​ ఏజ్​ వాళ్లు ఇప్పుడు గుర్తిస్తున్నారు అనిపిస్తోంది అంటున్నారు రామయ్య. ఏదీ లోతుగా చదవకపోవడం, పైపైన తిరగేయడం, ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ కోసం వెతుక్కోవడం మంచి అలవాట్లు కాదనే విషయం తెలుస్తోంది. పుస్తకాలవైపు మళ్ళీ మొగ్గు చూపుతున్న సూచనలు ఉన్నాయి. చిన్న గ్రూపులుగా ఏర్పడి మాల్స్​ వంటి వాటిలో బుక్స్​ మీద డిస్కషన్స్​ చేయడం కనిపిస్తోంది ఈ మధ్య కాలంలో. 
రచనలు చేసేవాళ్లే సొంతంగా పుస్తకాలు వేసుకున్నా, పబ్లిసిటీ చేసుకునేందుకు ఇప్పుడు మార్గాలు అనేకం. అమెజాన్ వంటి పోర్టల్స్ ద్వారా ప్రచురణ, ముద్రణ, అమ్మకాలు కూడా వీలవుతున్నాయి. ఆడియో బుక్స్ కూడా యూత్​కు పుస్తకాల పట్ల ఆసక్తి కలిగించే అవకాశం ఉందంటున్నారు బాలకృష్ణన్.

కష్టమేం కాదు
పుస్తకం కాగితంరూపంలో అమ్మడం కష్టం కావచ్చు. కానీ పుస్తకం మనుగడ ప్రశ్నార్థకం ఏ మాత్రం కాదని ప్రచురణ రంగంలో ఉన్న వారంతా ఢంకా బజాయించి చెప్తున్న విషయం. కొత్త పుస్తకం పేజీల్లో పరిమళాన్ని గుండెల నిండుగా పీల్చుకుని పులకించేవారి సంఖ్య తగ్గొచ్చు. కానీ, చదవడం మరో రూపంలో నిరంతరం జరుగుతూనే ఉంటుంది అనేది వారి వాదన. బుక్​ ఎగ్జిబిషన్స్​ తిరణాళ్ళ మాదిరి జరగాలి. పుస్తకాలను గిఫ్ట్స్​గా ఇచ్చిపుచ్చుకోవాలి. బుక్స్​​కు సంబంధించిన మీటింగ్స్​ను  పండుగలుగా జరుపుకోవాలి. ఆ సంస్కృతి వస్తే పుస్తకానికి ఇక తిరుగులేదు అంటున్నారు పబ్లిషర్స్​.

బుక్స్​కు, రీడర్స్​కు మధ్య వారధి కట్టడం ఇప్పుడు తక్షణ కర్తవ్యం. ‘చదవాలి’ అని అనుకునేవారికి అనువైన ఒక వాతావరణం. ఒక ఎకో సిస్టం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాలు, పబ్లిషర్స్​ అందరి మీదా ఉంది. మన సమాజంలో అక్షరాన్ని ప్రేమించేందుకు సిద్ధంగా ఉన్న అసంఖ్యాకమైన పాఠకులు రోజూ కొత్తగా పుడుతూనే ఉంటారు. వారి చేతికి పుస్తకం అందించడంలోనే లోపం ఉండకూడదు. నాణ్యమైన సాహిత్యం... అది ప్రేమ కథ అయినా, వ్రత కథ అయినా, చరిత్ర పాఠాలు అయినా, రాజకీయ విశ్లేషణ అయినా, సరైన శిల్పంతో, ఆకర్షణీయమైన శైలితో రాస్తే, ఆ రచయితకు పాఠకుల కొరత ఉండదు. ఆ పుస్తకం చేరుకోలేని ప్రదేశం ఉండదనే అభిప్రాయం అందరూ ఏకగ్రీవంగా చెప్తున్నారు. ఈ సందర్భంగా కరోనా తరువాత హైదరాబాద్​, తెలంగాణ కళా భారతి (ఎన్టీఆర్​ స్టేడియం)లో మొదలైన బుక్ ఫెయిర్ మళ్ళీ పుస్తక ప్రియులకు పండుగ కాలం తీసుకొచ్చింది అనడంలో సందేహం లేదేమో!

బుక్స్​ బోరింగ్ కాదు
బుక్స్​ చదవాలి.. చదవాలి.. అంటే ఎవరూ చదవరు. చదవాలనే ఇంట్రెస్ట్ వాళ్లలో కలిగితేనే చదువుతారు. ఆ ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? అసలే ఈ మధ్య చిన్నపిల్లలు, పెద్దవాళ్లు డిజిటల్ లైఫ్​కు అలవాటు పడిపోయారు. లేచినదగ్గరి నుంచి పడుకునే వరకు ఫోన్, టీవీ, ల్యాప్​ట్యాప్​లతో గడుపుతున్నారు. పోయినేడాది లాక్​డౌన్​ వల్ల స్కూల్​లో బుక్స్​ చదివే అలవాటు కూడా పోయింది పిల్లలకి. అడపాదడపా బుక్స్ చదివే పిల్లలు రికార్డులకెక్కినట్టు కూడా వార్తల్లో కనిపించాయి. అయినా అవి చూసి ‘గ్రేట్’ అనుకోవడం, తర్వాత మర్చిపోవడం. మరి ఇలా అయితే బుక్స్​ చదవాలన్న ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది? ఆదివారం నాడు న్యూస్​ పేపర్​లో వచ్చే వీక్లీ బుక్స్​ కూడా చదవలేకపోతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. బుక్స్​ అంటే ప్రజలు ఎంత బోరింగ్​గా ఫీలవుతున్నారో అని. కానీ... వాస్తవానికి బుక్స్​ బోరింగ్ కాదు, గెయినింగ్ ఆఫ్ నాలెడ్జ్​. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కూడా. ఎవర్ని అడిగినా బుక్స్​ మీద ఇదే అభిప్రాయం చెప్తారు. మరి చదవడానికేం? అంటే జవాబు ఉండదు. ఎక్కడో షాపింగ్ మాల్స్​లో, కాఫీ షాపుల్లో మోటివేషన్​ చేస్తూ బుక్​స్టాల్స్​ పెట్టి రూపాయికో, ఫ్రీగానో బుక్స్​ ఇస్తూ, అవేర్​నెస్ ప్రోగామ్స్​ చేస్తే.. ఇంట్రెస్ట్ వస్తుందా? రాదు. అప్పుడు కూడా ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లే కొని చదువుతారు. కాబట్టి అర్థం చేసుకోవాల్సిన విషయమేంటంటే... పిల్లలుగా ఉన్నప్పుడే బుక్స్​ చదవడం అలవాటు చేయాలి. ఈ మధ్య పిల్లల్ని స్కూల్​కి పంపక ముందే చాలా విషయాలు నేర్పిస్తున్నారు పేరెంట్స్.  మరి బుక్స్​ మాటేంటి? బుక్స్​ చదవడం ఎంత మంచిదో తెలిసి చెప్పకపోతే ఫ్యూచర్​ జనరేషన్​ చాలా నష్టపోతుంది. 

పుస్తకాల్ని కొనిపించే బుక్ చోర్
చదివే అలవాటు తగ్గిపోతోంది. అంతకంటే ఎక్కువగా పుస్తకాల్ని కొనే అలవాటుపోతోంది. డిజిటల్, ఇ–బుక్ ఫార్మాట్స్ వచ్చాక కొత్త పుస్తకాల్ని కూడా పైరసీ చేయడం పబ్లిషర్స్​కు, రచయితలకు ఇబ్బందిగా మారింది. ఇలాంటి టైంలో పుస్తకాల్ని కొనిపించే కొత్త ఐడియాతో కొంతమంది ముందుకొచ్చారు. దాని పేరే ‘బుక్ చోర్’. ఒక్క పుస్తకం కొనాలంటే తక్కువలో తక్కువ రూ.100 నుంచి రూ.500కు పైగా ఉంటుంది. అదే ఫిక్స్​డ్ రేట్​తో ఒకేసారి పదికిపైగా పుస్తకాల్ని కొనే అవకాశం ఉంటే రీడర్స్​ను ఆకట్టుకోవచ్చన్న ఆలోచనతో బుక్ చోర్ కాన్సెప్ట్ వచ్చింది. ఇందులో వేర్వేరు సైజుల్లో మూడునాలుగు రకాల అట్టపెట్టెలు ఉంటాయి. వాటిలో కనీసం10 పుస్తకాల నుంచి 20 పుస్తకాల వరకు పట్టే వీలుంటుంది. బాక్స్ సైజును బట్టి దానికి ఫిక్స్​డ్ రేటు ఉంటుంది. ఆ రేటుకు నచ్చిన బాక్స్​ను ఎంచుకొని బుక్ ఎగ్జిబిషన్​లో ఉండే వేలాది పుస్తకాల్లోంచి కావాల్సిన వాటిని ఎంచుకోవచ్చు. వాటి కవర్ ప్రైస్​తో సంబంధం లేకుండా బాక్స్​లో నింపుకోవచ్చు. బుక్ సైజును బట్టి పెట్టెలో ఎన్ని పుస్తకాలైనా నింపి తీసుకుపోవచ్చు. ఇట్లా కనీసం 10 పుస్తకాలు తీసుకున్నా సగటున రూ.100 నుంచి 150 కే ఒక్కో పుస్తకం దొరుకుతుంది. వాటిలో కవర్ ప్రైస్ రూ.500పైగా ఉన్న బుక్స్ ఉన్నా రీడర్​కు చాలా తక్కువ రేటుకే దొరుకుతుంది. ఇట్లా రీడర్స్​కు ఆసక్తి కలిగించడంతో పాటు ఎక్కువ పుస్తకాలను సేల్ చేసే అవకాశం ఉంటుంది. ఈ కాన్సెప్ట్​తో మన హైదరాబాద్​తో పాటు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో తరచూ బుక్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆన్ లైన్​లోనూ ఈ విధానంలో బుక్ సేల్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ‘lockthebox.in’ అనే వెబ్ సైట్​లో చూడొచ్చు. ఒకరకంగా చెప్పాలంటే ఇది పుస్తకాల్ని గంపగుత్తగా అమ్మడం. ఇది కొంతమందికి నచ్చకపోయినా పుస్తకాల్ని కొనిపించి, రీడింగ్ హ్యాబిట్​ను కాపాడడానికి ఇలాంటి కొత్త ఆలోచనలు అవసరమన్న అభిప్రాయం ఉంది. గంపగుత్తగా కొంటున్నా నచ్చిన పుస్తకాల్నే తీసుకోవచ్చన్నది కాదనలేని మాట.

ఇది మొదట నార్త్​ ఇండియాలో స్టార్ట్ అయింది. ఈ ఆర్గనైజేషన్​ని భవేశ్ శర్మ, ప్రతీక్ మహేశ్వరి, విద్యుత్ శర్మ, అలోక్​ శర్మలు నడుపుతున్నారు. ఇక్కడ బుక్స్​ కొనాలంటే ఫోన్​ చేసి లేదా బుక్​చోర్.కామ్ వెబ్​సైట్ నుంచి ఆర్డర్​ చేయొచ్చు. బుక్స్​ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఆర్డర్ చేసిన 15 రోజులకు బుక్స్​ డెలివరీ చేస్తారు. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే బుక్స్​తో పాటు చేత్తో రాసిన ఒక నోట్ పంపుతారు. ఒకవేళ బుక్స్​ రిటర్న్​ చేయాలనుకుంటే 24 గంటల్లో వాళ్లకు తెలియజేయాలి. వాపస్ చేసిన బుక్స్​ డబ్బులు 15 రోజుల్లో తిరిగి ఇస్తారు. 24 డిసెంబర్​ నుంచి జనవరి 2, 2022 వరకు ఖైరతాబాద్​లోని ‘వాసవీ కల్యాణ మండపం’లో ఈ బుక్​చోర్ ఫెయిర్​ జరగబోతోంది.

ఆడియో బుక్స్​
బుక్స్​ అంటే ఇంట్రెస్ట్ ఉండాలే కానీ... ఈ బిజీ లైఫ్​లో కూడా బుక్స్​ వెంట తీసుకెళ్లొచ్చు. అంటే బుక్స్​ని చదవడం కాదు, వినొచ్చు. అదెలాగంటే... ఆడియో బుక్ యాప్స్​ ద్వారా. ఆండ్రాయిడ్, స్మార్ట్ ఫోన్​లన్నింటిలో ఆడియో బుక్​ యాప్స్ డౌన్​లోడ్ చేసుకోవచ్చు. నచ్చిన బుక్​ని సెలెక్ట్ చేసుకుని వినొచ్చు. అలాంటి యాప్స్​ ఇవి... పాకెట్ బుక్​ రీడర్, లిబ్బీ, కోబో, ఆడిబుల్, గూగుల్ ప్లే బుక్స్, అమెజాన్ కిండిల్ వంటి యాప్​లన్నీ అవే. వీటిని కంప్యూటర్, స్మార్ట్ ఫోన్, టాబ్లెట్​లలో సాంగ్స్​ విన్నట్టే ప్లే లిస్ట్​లో పెట్టుకుని మరీ వినొచ్చు. 

బుక్స్​ చదివేవాళ్ల సంఖ్య పెరిగింది
హైదరాబాద్​లో​ 34వ జాతీయ పుస్తక ప్రదర్శన ఈ నెల18 నుంచి మొదలైంది. ‘తెలంగాణ కళా భారతి’ (ఎన్టీఆర్​ స్టేడియం)లో పదిరోజుల పాటు జరుగుతుంది. మొత్తం 260కి పైగా బుక్​స్టాల్స్​ ఉన్నాయి. కరోనా వల్ల దాదాపు రెండేండ్ల తర్వాత దేశంలోనే మొదటిసారి జరుగుతున్న బుక్​ ఎగ్జిబిషన్​ ఇది. దీని తర్వాత విజయవాడలో, ఆ తర్వాత ఢిల్లీలో బుక్​ ఎగ్జిబిషన్​ ఉంటుంది. డిజిటల్​లో బుక్స్ అందుబాటులో ఉన్నప్పటికీ కరోనా టైంలో బుక్స్​ చదవడం పెరిగిందని ప్రపంచవ్యాప్త నివేదికలు చెప్తున్నాయి. వాటిలో థాయ్​లాండ్, చైనా, ఇండియా మొదటిస్థానంలో ఉన్నాయి. అంటే బుక్స్​ చదివేవాళ్ల సంఖ్య పెరిగిందే తప్ప, తగ్గలేదు. పేరెంట్స్ పిల్లలకు, టీచర్స్​ స్టూడెంట్స్​కి బుక్స్​ చదవమని ఎంకరేజ్​ చేయాల్సిన అవసరం ఉంది. స్కూల్స్​, కాలేజీల్లో బుక్స్​ చదవాలనే రూల్ ఒకటి పెట్టాలి. మొత్తంమీద ఈ ఏడాది జరుగుతున్న బుక్​ ఫెయిర్​లో పది రోజుల్లో పది లక్షల మంది ఒక చోట చేరి పుస్తకాల పండుగ చేసుకుంటారు.
- జూలూరి గౌరీ శంకర్​, హైదరాబాద్ బుక్​ ఫెయిర్ అధ్యక్షుడు

తెలుగు సాహిత్యంలో చెరగని ముద్ర వేసిన తెలంగాణ రచయితలు, కవుల రచనలు ఇప్పటికీ రీడర్స్ ని ఆకర్షిస్తున్నాయి. వాటిలో జనం జీవితాలను, సామాజిక పరిస్థితులను కళ్లకు కట్టిన రచనల్లో కొన్ని ఇవి... 
అంపశయ్య - నవీన్, విశ్వంభర - డాక్టర్ సి.నారాయణరెడ్డి, ఆంధ్రుల సాంఘిక చరిత్ర - సురవరం ప్రతాపరెడ్డి, ప్రజల మనిషి -వట్టికోట ఆళ్వారు స్వామి, చిల్లర దేవుళ్లు -దాశరథి రంగాచార్య, నా గొడవ -కాళోజీ నారాయణరావు, అతడు అడవిని జయించాడు -కేశవరెడ్డి, కవిత్వం - అలిశెట్టి ప్రభాకర్, పోతనచరిత్ర -వానమామలై వరదాచార్యులు, లోపలి మనిషి -పి.వి.నరసింహారావు.

::: ఉషా తురగా రేవెల్లి