IPL 2023: ఐపీఎల్ బెట్టింగ్ టార్గెట్ రూ. 2 లక్షల కోట్లు ..బుకీల ప్రాఫిట్ టార్గెట్ రూ. 600 కోట్లు

IPL 2023: ఐపీఎల్ బెట్టింగ్ టార్గెట్ రూ. 2 లక్షల కోట్లు ..బుకీల ప్రాఫిట్ టార్గెట్ రూ. 600 కోట్లు

ఐపీఎల్ అంటే క్రికెటర్లకు పండగ..ఫ్యాన్స్కు అతిపెద్ద పండగ...వీరితో పాటు పందెం రాయళ్లకు పండగే. ఈ ఖరీదైన లీగ్ ను క్యాష్ చేసుకునేందుకు బుకీలు, మ్యాచ్ ఫిక్సర్లు సిద్దమయ్యారు. ఐపీఎల్ ద్వారా ప్రతీ రోజు రూ. 600 కోట్లు సంపాదించాలన్న లక్ష్యంతో వీరంతా  బెట్టింగ్ బరిలోకి దిగుతున్నారు. దుబాయ్, కరాచీలో ఉన్న అంతర్జాతీయ బెట్టింగ్ కార్టెల్ లు..ఇప్పటికే దేశంలో ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, భోపాల్, హైదరాబాద్ సహా పలు నగరాల్లో ఉన్న బుకీలతో  కాంటాక్టు అయ్యారు.  బెట్టింగ్ కు సంబంధించి కోడ్ నంబర్ల వివరాలను వారికి చెప్పేశారు.

బుకీల నెట్‌వర్క్‌  గుర్తింపు

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతను బ్లాక్ మెయిల్ చేసి లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన కేసులో బుకీ, హవాలా ఆపరేటర్ అనిల్ జైసింఘానిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో ఐపీఎల్ బెట్టింగ్ సిండికేట్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.  ముంబైలో 60 మంది బుకీలు 18 క్రికెట్ బెట్టింగ్ యాప్‌ల ద్వారా ఐపీఎల్ బెట్టింగ్ నెట్ వర్క్ను నడుపుతున్నట్లు ముంబై క్రైం బ్రాంచి పోలీసులు గుర్తించారు. ఈ సమాచారంతో  ఐదుగురు బుకీలను అరెస్టు చేయడంతోపాటు 18 ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లపై నిఘా పెట్టారు. పోలీసుల అదుపులోకి ఉన్న ఐదుగురు బుకీలు -ఆంథోనీ డయాస్, ఇమ్రాన్ ఖాన్, ధర్మేష్ శివదాసాని, ధర్మేష్ వోరా, గౌరవ్ శివదాసాని బెట్టింగ్ గురించి వివరాలు వెల్లడించారు. ముంబై, థానే ప్రాంతంలో పనిచేస్తున్న 60 మంది బుక్‌మేకర్ల నెట్‌వర్క్‌తో పాటు దుబాయ్‌లో ఉన్న ప్రపంచవ్యాప్త క్రికెట్ బెట్టింగ్ సిండికేట్ గురించి సమాచారాన్ని పోలీసులకు తెలిపారు. 

విస్తుపోయే విషయాలు..

బుకీలు తెలిపిన వివరాల ప్రకారం..ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ టర్నోవర్ మహారాష్ట్ర రాష్ట్ర బడ్జెట్ కంటే పెద్దది.  ఐపీఎల్ 2023 లో మొత్తం 74 మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రతి టీమ్ లీగ్ దశలో 14 మ్యాచులు ఆడుతుంది.  ప్రతీ మ్యాచ్ కు రూ. 3500 కోట్ల బెట్టింగ్ జరగనుంది. అంటే మొత్తంగా 2 లక్షల 59 వేల కోట్ల బెట్టింగ్ కేవలం రెండు నెలల్లో జరగనుంది. 

బెట్టింగ్ ఎలా నిర్వహిస్తారు..?

బుకీలు.. ఆరు ఓవర్లు,  పది ఓవర్లు, 20 ఓవర్లు  వంటి సెషన్ల వారీగా బెట్టింగ్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ గెలుపు, ఓటములతో పాటు..అత్యధిక  స్కోర్లు, బౌండరీలు, వికెట్ల వరకు ప్రతిదానిపై బెట్టింగ్ నిర్వహించనున్నట్లు సమాచారం. అంతేకాదు  ఆటగాడి  వ్యక్తిగత ప్రదర్శనపై బెట్టింగ్ నిర్వహిస్తారట. బుకీలకు బెట్టింగ్ సూచనలన్నీ..పాకిస్తాన్, దుబాయ్ నుంచి చేరనున్నాయి. వారి చెప్పిన సూచనల ప్రకారం బుకీలు బెట్టింగ్ నిర్వహిస్తారు.