జోరందుకున్న ఐటీ జాబ్స్.. ఏడాదిలో 96 వేల ఉద్యోగాలు

జోరందుకున్న ఐటీ జాబ్స్.. ఏడాదిలో 96 వేల ఉద్యోగాలు
  • ఆటోమేషన్​తో ఉద్యోగాలు పోవు  
  • వెల్లడించిన నాస్కామ్ రిపోర్టు

న్యూఢిల్లీ: మిగతా సెక్టార్లలో జాబ్స్ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, ఐటీ సెక్టార్లో మాత్రం కొత్త వారికి  అవకాశాలకు కొదవ లేదని తాజాగా తేలింది. మనదేశంలోని టాప్–కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 96 వేల మందికి జాబ్స్ ఇస్తాయని ఐటీ ఇండస్ట్రీ అసోసియేషన్ నాస్కామ్ ప్రకటించింది.  ఆటోమేషన్ టెక్నాలజీల వాడకం పెరగడం వల్ల 2022 నాటికి  ఐటీ కంపెనీలు 30 లక్షల జాబ్స్ ను తొలగిస్తాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా రిపోర్టు పేర్కొన్న నేపథ్యంలో నాస్కామ్ నుంచి ఈ విషయమై ప్రకటన చేసింది ‘‘ఆటోమేషన్ వంటి టెక్నాలజీలు పెరుగుతున్నప్పటికీ, ఐటీ సెక్టార్​కు కొత్త వాళ్లు తప్పనిసరిగా కావాలి. గత ఆర్థిక సంవత్సరంలోనూ 1.38 లక్షల మందికి ఐటీ జాబ్స్ ఇవ్వడమే ఇందుకు నిదర్శనం. ఇండియాలోనే టాప్– 5 కంపెనీలు 2021–-22 కోసం 96 వేల మంది ఎంప్లాయీస్​ను చేర్చుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి” అని వివరించింది.

ఎప్పటికప్పుడు స్కిల్ అప్​ గ్రెడేషన్..
నాస్కామ్ రిపోర్టు ప్రకారం.. ఇండియా ఐటీ కంపెనీలు ఇది వరకే 2.50 లక్షల మందికి కంపెనీలు డిజిటల్ స్కిల్స్ నేర్పించాయి. అంతేగాక గత ఆర్థిక సంవత్సరంలోనూ 40 వేల మందికిపైగా డిజిటల్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్​ను నియమించుకున్నాయి. క్లయింట్ల నుంచి భారీగా డీల్స్ రావడంతో వర్క్​ ఫోర్స్ మరింత పెంచాలనుకుంటున్నట్టు స్పష్టంగా తెలుస్తున్నది. ఇందుకు ఇన్వెస్ట్​ మెంట్లను కూడా రెడీ చేస్తున్నాయి. ఇక ముందు కూడా ఐటీ సెక్టార్కు మంచి భవిష్యత్ ఉంది.  2025 నాటికి -350 బిలియన్ డాలర్ల టార్గెట్ ను చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

బీపీఎంలోనూ తగ్గలేదు..
బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌‌మెంట్ (బీపీఎం) సెక్టార్ ఇప్పటికే 14 లక్షల మంది జాబ్స్ ఇచ్చింది. వీటిలో డొమెస్టిక్, ఇన్​ హౌస్ జాబ్స్​ను కలిపితే ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. బీపీఎంలో ఆటోమేషన్ పెరుగుతూనే ఉన్నప్పటికీ, జాబ్స్ తగ్గడం లేదు. ఈ ఏడాది మార్చి నాటికి ఐటీ బిపిఎం సెక్టార్లో మొత్తం 45 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. గత మూడేళ్లుగా ఆటోమేషన్, ఆర్పీఏ (రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్) పెరగడం వల్ల బీపీఎం సెక్టార్కు భారీ సంఖ్యలో ఉద్యోగులు అవసరమవుతున్నారు. బీపీఎం సెక్టార్ తన మార్కెట్​ను 220 బిలియన్ డాలర్లకు పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. ‘‘బీపీఎం సెక్టార్ లక్షల మందికి ఉపాధి కల్పిస్తుందని నేను చాలా కాలంగా చెప్తున్నాను. ఇండియాలో బీపీఎం ఇండస్ట్రీ వేగంగా డెవెలప్ అవుతున్నది. గ్లోబల్ కస్టమర్ల సంఖ్యను పెంచుకుంటున్నది. కొత్త ప్రొడక్టులను తీసుకొస్తున్నది. ఎనలిటిక్స్ సాయంతో ఎదుగుతోంది. దీనివల్ల కస్టమర్లకు మరింత సమర్థంగా సేవలు అందుతున్నాయి. కరోనా కాలంలోనూ బీపీఎం సెక్టార్ ఎదుగుదలకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి”అని నాస్కామ్, మెకెన్సీ రిపోర్టు వివరించింది. 

‘‘కొత్త టెక్నాలజీల వల్ల జాబ్స్ పెరుగుతాయి తప్ప తగ్గవని గత అనుభవాలు చెబుతున్నాయి. ఏటీఎంలు, ఆన్లైన్ బ్యాంకింగ్ రాక ముందు జనం బ్యాంకు సిబ్బందిపైనే ఆధారపడేవాళ్లు. బ్యాంకింగ్ సెక్టార్లో ఆటోమేషన్ వచ్చిన తరువాత జాబ్స్ పెరిగాయి తప్ప తగ్గలేదు. మిగతా సెక్టార్లలోనూ డిజిటైజేషన్ పెరిగినా జాబ్స్​ పోలేదు. ఆటోమేషన్ టెక్నాలజీలను వాడేందుకు కూడా స్కిల్డ్ ఐటీ ప్రొఫెషనల్స్ కావాలి. క్లయింట్ల అవసరాలు మారుతూనే ఉంటాయి కాబట్టి తగినంత మ్యాన్పవర్ను ఉంచుకోవడం తప్పనిసరి”అని ఇండస్ట్రీ ఎక్స్​పర్ట్ ఒకరు వివరించారు.