భారీగా పెరిగిన టూవీలర్​ అమ్మకాలు

భారీగా పెరిగిన టూవీలర్​ అమ్మకాలు

న్యూఢిల్లీ: టూవీలర్లకు గత కొన్నేళ్లుగా గిరాకీ పెద్దగా లేదు కానీ పరిస్థితులు ఇప్పుడు చక్కబడుతున్నాయి. రూరల్​ డిమాండ్​ కూడా బాగుండటంతో అమ్మకాలు పుంజుకుంటున్నాయి. వీటి సేల్స్​ వరుసగా రెండవ క్వార్టర్​లోనూ పెరిగాయి.  ధరలు పెరుగుతున్నటికీ,  గ్రామీణ మార్కెట్లలో వినియోగదారుల సెంటిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బలంగానే ఉంది. కిందటి క్వార్టర్​లో మోటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైకిళ్లు, స్కూటర్లు, మోపెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల - రిటైల్  అమ్మకాలు  12.3శాతం పెరిగి 3,978,169 యూనిట్లకు చేరుకున్నాయి. డిసెంబరు క్వార్టర్​లో ఇవి 16.6శాతం పెరిగి 4,704,713 యూనిట్లకు చేరుకున్నాయని ఫెడరేషన్​ ఆఫ్​ ఆటోమొబైల్​ డీలర్స్​ అసోసియేషన్ (ఫాడా) తెలిపింది. కరోనా వచ్చినప్పటి నుండి టూవీలర్ల అమ్మకాలు వరుసగా రెండు క్వార్టర్లలో కేవలం రెండుసార్లు మాత్రమే పెరిగాయి. ఈ విషయమై ఇండస్ట్రీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు మాట్లాడుతూ పంటలు బాగుండటం, వ్యవసాయ వస్తువులకు కనీస మద్దతు ధరలు రావడం, నీటినిల్వలు పుష్కలంగా ఉండటం వల్ల రైతుల, గ్రామీణుల ఆదాయాలు పెరుగుతున్నాయని చెప్పారు. దీనివల్ల గ్రామీణ భారతదేశంలోని వినియోగదారుల సెంటిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మరింత బలపడుతుందని చెప్పారు.  ఈ ఆర్థిక సంవత్సరంలో మోటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైకిళ్లు  స్కూటర్ల అమ్మకాలు రెండంకెల వృద్ధిని సాధిస్తాయని కంపెనీలు భావిస్తున్నాయి. కిందటి ఆర్థిక సంవత్సరంలో టూవీలర్ల రిటైల్ సేల్స్​ దాదాపు 16 మిలియన్ యూనిట్లకు చేరుకున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఇన్​ఫ్లేషన్​(ధరల భారం) పెరిగినప్పటికీ, గిరాకీ తగ్గలేదు. ఆర్​బీఐ డేటా ప్రకారం, ఫిబ్రవరి 2023లో గ్రామీణ మార్కెట్లలో ఇది నెలవారీగా 6.72శాతానికి తగ్గింది. పల్లెటూళ్లలో జీతాలు  కూడా  భారీగా పెరిగాయని బీఎన్​బీ పరిబాస్ పేర్కొంది.  

భవిష్యత్​పై భారీ ఆశలు...

సాధారణ వినియోగదారుల సెంటిమెంట్ మెరుగుపడుతోందని మార్కెట్ లీడర్ హీరో మోటోకార్ప్ సీఎఫ్​ఓ నిరంజన్ గుప్తా అన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల డిమాండ్ మరింత బలపడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. అమ్మకాలు కరోనాకు ముందున్నస్థాయికి చేరుకోవచ్చని అన్నారు. హీరో మోటోకార్ప్ - కిందటి ఆర్థిక సంవత్సరంలో 5.3 మిలియన్ యూనిట్లను అమ్మింది. అమ్మకాలలో వార్షికంగా 8శాతం వృద్ధిని అందుకుంది. - దాదాపు డజను మోడళ్లను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. దీని పోటీదారు హోండా  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు ఎలక్ట్రిక్ వెహికల్స్​ సహా దాదాపు అర డజను మోడళ్లను మార్కెట్లోకి తేవాలని యోచిస్తోంది. బజాజ్ ఆటో నుండి కూడా అనేక మోడల్స్​ రాబోతున్నాయి. ఈ కొత్త మోడల్స్ వల్ల అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. చాలాకాలం తరువాత టూవీలర్ల మార్కెట్లలో జోష్​ కనిపిస్తోందని, అన్ని ప్రాంతాల్లో కొనుగోలు శక్తి పెరుగుతోందని బజాజ్ ఆటో ఈడీ రాకేష్ శర్మ అన్నారు. 2022 ఆర్థిక సంవత్సరం మొదటి రెండు క్వార్టర్లలో టూవీలర్ల రిజిస్ట్రేషన్లు వరుసగా 64శాతం, 5శాతం పెరిగాయి. 2020 మొదటి ఆర్నెళ్లలో కరోనా కారణంగా అమ్మకాలు తక్కువగా ఉన్నాయి. 2019 ఆర్థిక సంవత్సరంలో 19.5 మిలియన్ యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇప్పటికీ అమ్మకాలు 2019 నాటిస్థాయిలో లేవు. హెచ్​ఎంఎస్​ఐ అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గోయింగ్ ప్రెసిడెంట్ అట్సుషి ఒగాటా మాట్లాడుతూ, రికవరీ ప్రారంభమైందని, ఇక నుంచి అమ్మకాలు జోరుగా ఉంటాయని స్పష్టం చేశారు.