బోరిస్ జాన్సన్ కోలుకుంటున్నారు, వాకింగ్ చేశారన్న అధికారులు

బోరిస్ జాన్సన్ కోలుకుంటున్నారు, వాకింగ్ చేశారన్న అధికారులు

లండన్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా నుంచి కోలుకుంటున్నారని, వార్డులో స్వల్ప దూరం వాకింగ్ కూడా చేశారని ఆయన కార్యాలయం ప్రకటించింది. గురువారం ఆయనను ఐసీయూ నుంచి వార్డుకు షిఫ్ట్ చేశారు. తనకు ట్రీట్ మెంట్ చేస్తున్న డాక్టర్ల టీమ్ తో ఆయన మాట్లాడి, థ్యాంక్స్ కూడా చెప్పారని అధికారులు చెప్పారు. ఐసీయూ నుంచి బోరిస్ జాన్సన్ ను వార్డుకు షిఫ్ట్ చేయడంపై ఆయన తండ్రి స్టాన్లీ జాన్సన్ డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు మార్చి 23న బ్రిటన్ ప్రధాని 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించారు. వచ్చే సోమవారంతో ఈ గడువు ముగియనుంది. అయితే లాక్ డౌన్ ను పొడిగించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. “మూడు వారాలుగా స్ట్రిక్ట్ గా సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నాం. మన ప్రజలను బలి తీసుకునేందుకు కరోనాకు రెండో చాన్స్ ఇవ్వరాదు. అందరూ ఇళ్లకే పరిమితం కావాలి” అని బ్రిటన్ ఫారిన్ సెక్రెటరీ డొమినిక్ రాబ్ అన్నారు. కరోనాతో బ్రిటన్ లో దాదాపు 9 వేల మంది మరణించగా, 73 వేల మందికిపైగా వ్యాధి సోకింది.