
ఆసియా దేశాల మధ్య మరో ఐదు రోజుల్లో క్రికెట్ యుద్దం మొదలవబోతుంది. ఆగస్టు 27 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆసియాకప్లో ఇప్పటి వరకు స్పిన్నర్లే ఆధిపత్యం చలాయిస్తూ వస్తున్నారు. ఆసియాకప్ చరిత్రలో ఎక్కువ వికెట్లు స్పిన్నర్లే దక్కించుకున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఆసియా కప్లో ఎక్కువ వికెట్లు సాధించిన బౌలర్లు ఎవరో చూద్దాం..
33 వికెట్లతో టాప్ ప్లేస్.
ఆసియాకప్ లో శ్రీలంక మాజీ పేసర్ లసిత్ మలింగ 15 ఇన్నింగ్స్‌ల్లో 33 వికెట్లు దక్కించుకున్నాడు. దీంతో ఆసియా కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ఇందులో రెండు సార్లు నాలుగు వికెట్లను పడగొట్టాడు. మూడు సార్లు ఐదేసి వికెట్లను దక్కించుకున్నాడు. అత్యుత్తమ గణాంకాలు 2010 ఎడిషన్‌లో పాకిస్తాన్‌పై 34 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. 2014లో నాలుగు మ్యాచ్‌లలో 11 వికెట్లు తీసి శ్రీలంక ఆసియాకప్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.
రెండో స్థానంలో బౌలింగ్ లెజెండ్..
కాంటినెంటల్ ఈవెంట్‌లో లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ 24 ఇన్నింగ్స్‌లలో 30 వికెట్లు దక్కించుకున్నాడు. 2008లో బంగ్లాదేశ్‌పై 31 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. మొత్తంగా ఐదు మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టడం విశేషం. ముఖ్యంగా మురళీధరన్ ఇండియా, పాకిస్థాన్ పై ఎక్కువ వికెట్లను సాధించాడు. రెండు జట్లపై 16 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీసుకున్నాడు.
మెండీస్ మాయ..
ఆసియా కప్‌లో కేవలం ఎనిమిది మ్యాచ్‌లే ఆడిన శ్రీలంక స్పిన్నర్ అజంతా మెండిస్..26 వికెట్లు పడగొట్టి.. ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక 2008లో కరాచీలో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో 13 పరుగులకు ఆరు వికెట్లు పడగొట్టి..భారత్‌ను చిత్తు చేయడంతో కీలక పాత్ర పోషించాడు. 23 ఏళ్ల మిస్టరీ స్పిన్నర్ బంతులకు సమాధానం చెప్పలేక..భారత్..173కే కుప్పకూలింది. ఈ టోర్నీలో UAEపై ఐదు వికెట్లు, పాకిస్తాన్ పై నాలుగు వికెట్లు తీసుకున్నాడు. మొత్తంగా2008 ఎడిషన్ లో ఐదు మ్యాచ్‌లలో 8.52 సగటుతో 17 వికెట్లు సాధించాడు.
ఒకే ఒక్కడు..
ఆసియాకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో పాక్ నుంచి సయీద్ అజ్మల్ ఒక్కడే చోటు దక్కించుకున్నాడు. 12 ఇన్నింగ్స్‌లలో అజ్మల్ 25 వికెట్లతో నాల్గో స్థానంలో ఉన్నాడు. ఈ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ కు అజ్మల్ విజయవంతమైన బౌలర్. 2014లో ఆసియాకప్ లో పాక్ ఫైనల్ చేరడంలో అజ్మల్ పాత్ర ముఖ్యమైనది. ఐదు మ్యాచ్‌లలో 11 వికెట్లు పడగొట్టాడు. ఇక 2012లో పాకిస్థాన్ టైటిల్ గెలవడంలో అజ్మల్ కీ రోల్ ప్లేచేశాడని చెప్పాలి. ఈ టోర్నీలో నాలుగు మ్యాచ్‌ల్లో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు.
షకీబ్ అల్ హసన్
2022 ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌కు నాయకత్వం వహించనున్న ఆల్-రౌండర్ షకీబ్ అల్ హసన్..ఇప్పటి వరకు ఈ టోర్నీల్లో 18 ఇన్నింగ్స్‌లలో 24 వికెట్లు దక్కించుకున్నాడు. అంతేకాదు బంగ్లా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. 2018లో గ్రూప్ దశలో ఆఫ్ఘనిస్తాన్‌పై 42 పరుగులకే నాలుగు వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా ఆ టోర్నీలో ఏడు వికెట్లు తీశాడు. బౌలింగ్లోనే కాదు..బ్యాటింగ్లోనూ షకీబ్ 28.17 సగటుతో 479 పరుగులు సాధించాడు.
టాప్ –6లో శ్రీలంక వెటరన్ బౌలర్..
చమిందా వాస్..లంక గ్రేట్ బౌలర్లలో ఒకడు. ఆసియాకప్ లో చమిందా వాస్.. 19 మ్యాచుల్లో ఆడాడు. 27.78 సగటు, 4.19 ఎకానమీ రేటుతో మొత్తంగా 23 వికెట్లు తీశాడు. టోర్నమెంట్‌లో వాస్ అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 3/3
మష్రఫే మోర్తజా..
ఆసియాకప్ చరిత్రలో మోర్తజా 24 మ్యాచులు ఆడాడు. 42.69 సగటు, 5.82 ఎకానమీ రేటుతో 23 వికెట్లు దక్కించుకున్నాడు. అతని అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు ఆసియా కప్‌లో 2/12.
రవీంద్ర జడేజా
భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా.. ఆసియా కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసుకున్న టాప్ –10 బౌలర్ల జాబితాలో 8వ స్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు 18 మ్యాచులు ఆడిన జడేజా..26.59 సగటు, 4.56 ఎకానమీతో 22 వికెట్లు దక్కించుకున్నాడు. ఈ టోర్నీలో జడేజా అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 4/29.
ఆసియాకప్ లో గడగడలాడించాడు..
ఆసియాకప్లో ప్రత్యర్థి బ్యాట్స్మన్ను టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తన పేస్తో గడగడలాడించాడు. 12 మ్యాచ్‌లలో 27.50 సగటు, 5.54 ఎకానమీ రేటుతో పఠాన్ 22 వికెట్లు తీశాడు. టోర్నమెంట్‌లో అతని అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 4/32.
సనత్ జయసూర్య..
శ్రీలంక లెజండరీ ఆల్ రౌండర్ సనత్ జయసూర్య ఆసియా కప్ చరిత్రలో అత్యుత్తమ బ్యాట్స్మనే కాదు..అత్యుత్తమ బౌలర్. జయసూర్య 25 మ్యాచుల్లో 30.31 సగటు, 4.48 ఎకానమీ రేటుతో 22 వికెట్లు తీశాడు. టోర్నమెంట్‌లో అతని అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 4/49.