
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ శిశుగృహలో ఉంటున్న పదేండ్ల బాలుడిని ఇటలీకి చెందిన దంపతులు మంగళవారం దత్తత తీసుకున్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రూల్స్ ప్రకారం అన్ని వివరాలు పరిశీలించి కలెక్టర్ గోపీ ముందుగా బాలుడిని విచారించారు. దత్తత వెళ్లడానికి నువ్వు సిద్ధమేనా అని అడిగి తెలుసుకున్నారు. తర్వాత కలెక్టర్ మాట్లాడుతూ.. బాబును మంచిగా చూసుకోవాలని దంపతులకు సూచించారు. అలాగే బాబుతో తరచూ మాట్లాడుతూ యోగక్షేమాలు తెలుసుకోవాలని ఐసీడీఎస్ సిబ్బందిని ఆదేశించారు. బాబు ఉండే ఇంటిని ప్రతీ మూడు నెలలకోసారి విజిట్ చేసి, ఎప్పటికప్పుడు ఇండియాకు రిపోర్ట్ పంపిస్తామని ఇటలీకి చెందిన అడాప్షన్ ఏజెన్సీ ప్రతినిధి వెల్లడించారు. డీడబ్ల్యూవో సంధ్యారాణి, బాలల పరిరక్షణ సిబ్బంది శాంత, తిరుపతి, రాజు, తేజస్వి, కవిత తదితరులు పాల్గొన్నారు.