ఫిఫా వరల్డ్ కప్లో స్విట్జర్లాండ్ను ఓడించిన బ్రెజిల్

ఫిఫా వరల్డ్ కప్లో స్విట్జర్లాండ్ను ఓడించిన బ్రెజిల్

దోహా:  ఫిఫా వరల్డ్‌‌‌‌కప్‌‌లో బలమైన బ్రెజిల్‌‌ మరోసారి జిగేల్‌‌మని మెరిసింది. గాయం వల్ల స్టార్‌‌ ప్లేయర్‌‌ నెమార్‌‌ దూరమైనా వరుసగా రెండో విక్టరీతో  మరో మ్యాచ్‌‌ మిగిలుండగానే నాకౌట్‌‌కు దూసుకెళ్లింది. సోమవారం రాత్రి జరిగిన గ్రూప్‌‌–జి మ్యాచ్‌‌లో బ్రెజిల్‌‌ 1–0తో స్విట్జర్లాండ్‌‌ను ఓడించింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో కాసెమిరో  83వ నిమిషంలో చేసిన ఏకైక గోల్‌‌తో గెలిచిన ఐదుసార్లు చాంపియన్‌‌ సాంబా టీమ్​.. డిఫెండింగ్​ చాంప్​ ఫ్రాన్స్​ తర్వాత  ప్రిక్వార్టర్‌‌ ఫైనల్‌‌ చేరిన రెండో జట్టుగా నిలిచింది. ఈ పోరులో స్విట్జర్లాండ్‌‌ ఆరు షాట్లు కొడితే.. బ్రెజిల్‌‌ 12 షాట్లు కొట్టింది. అందులో ఐదు టార్గెట్‌‌పై చేసింది. స్విస్‌‌ టీమ్‌‌ ఒక్క షాట్‌‌ కూడా టార్గెట్‌‌పై కొట్టలేకపోయింది. కానీ, ఫస్టాఫ్‌‌లో కట్టుదిట్టమైన డిఫెన్స్‌‌తో ఆకట్టుకుంది. బ్రేక్‌‌ తర్వాత బ్రెజిల్‌‌ ప్లేయర్లు దాడులు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో 64 నిమిషంలో వినిసియస్‌‌ గోల్‌‌ చేసినా.. రివ్యూలో అది ఆఫ్‌‌ సైడ్‌‌గా తేలింది. దాంతో, మ్యాచ్‌‌ 0–0తో డ్రా అయ్యేలా కనిపించింది. అయితే, చివర్లో  స్విస్‌‌ డిఫెన్స్‌‌ను బ్రెజిల్‌‌ ప్లేయర్లు బ్రేక్‌‌ చేశారు. వినిసియస్‌‌ నుంచి  బాక్స్‌‌లో పాస్‌‌ అందుకున్న  రొడ్రీగొ దాన్ని కాసెమిరోకు అందించాడు. తనముందు బౌన్స్‌‌ అయిన బాల్‌‌ను కాసెమిరో  పర్‌‌ఫెక్ట్‌‌ కిక్‌‌తో నెట్‌‌లోకి పంపడంతో బ్రెజిల్‌‌ విజయం అందుకుంది. వరుసగా రెండో గెలుపుతో  6 పాయింట్లతో గ్రూప్‌‌–జిలో టాపర్‌‌గా ఉన్న బ్రెజిల్‌‌ ముందంజ వేసింది. 

కామెరూన్‌‌‌‌ 3.. సెర్బియా 3

సెర్బియాతో గ్రూప్‌‌‌‌–జి మ్యాచ్‌‌‌‌లో కామెరూన్‌‌‌‌ డ్రాతో గట్టెక్కింది. ఆరు గోల్స్‌‌‌‌ నమోదైన ఈ పోరు 3–3తో సమమైంది. కామెరూన్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌  జీన్‌‌‌‌ చార్లెస్‌‌‌‌ 29వ నిమిషంలోనే జట్టుకు గోల్‌‌‌‌ అందించాడు.  ఫస్టాఫ్‌‌‌‌ ఎక్స్‌‌‌‌ట్రా టైమ్‌‌‌‌లో పవ్లోవిచ్, సెర్గెజ్‌‌‌‌ సవిచ్‌‌‌‌ గోల్స్‌‌‌‌ రాబట్టగా.. సెకాండాఫ్‌‌‌‌ 53వ నిమిషంలో మిత్రోవిచ్‌‌‌‌ చేసిన గోల్‌‌‌‌తో సెర్బియా 3–1తో విజయం దిశగా వెళ్లింది. కానీ, కామెరూన్‌‌‌‌ పట్టు వదల్లేదు. విన్సెంట్‌‌‌‌ అబౌబేకర్‌‌‌‌ (63 వ ని.), ఎరిక్‌‌‌‌ మాక్సిమ్‌‌‌‌ (66వ ని.) మూడు నిమిషాల తేడాతో రెండు గోల్స్‌‌‌‌ కొట్టడంతో మ్యాచ్‌‌‌‌ డ్రాగా ముగిసింది.

కుడుస్‌‌ కేక

నాకౌట్‌‌‌‌ రేసులో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌‌‌‌లో ఘనా జట్టును  మొహమ్మద్‌‌‌‌ కుడుస్‌‌‌‌ డబుల్​ గోల్స్​తో ఆదుకున్నాడు. దాంతో,  గ్రూప్‌‌‌‌–హెచ్‌‌‌‌లో జరిగిన మ్యాచ్‌‌‌‌లో ఘనా 3–2తో సౌత్‌‌‌‌ కొరియాపై థ్రిల్లింగ్‌‌‌‌ విక్టరీ సాధించింది. మొహమ్మద్‌‌‌‌ సలిసు కూడా ఓ గోల్‌‌‌‌తో రాణించాడు.  కొరియా ప్లేయర్‌‌‌‌ చో గెయు–సుంగ్ రెండు గోల్స్‌‌‌‌ కొట్టినా ఫలితం లేకపోయింది.