బ్రెస్ట్ క్యాన్సర్ ను ముందుగానే గుర్తిస్తే.. తొందరగానే కోలుకోవచ్చు

బ్రెస్ట్ క్యాన్సర్ ను ముందుగానే గుర్తిస్తే.. తొందరగానే కోలుకోవచ్చు

శరీరంలో ఎక్కడో ఓ చోట చిన్న గడ్డలా మొదలవుతుంది. మెల్లమెల్లగా మిగతా భాగాలకు విస్తరిస్తుంది. నొప్పి లేకుండా మనిషిని ఊపిరితీసుకోనీయని పరిస్థితిలోకి నెట్టేస్తుంది క్యాన్సర్ గడ్డ. దీన్నే క్యాన్సర్ కణితి అంటారు.  అందుకని మొదటి స్టేజ్​లోనే క్యాన్సర్​ని  గుర్తించడం చాలాముఖ్యం. మగవాళ్ల కంటే ఆడవాళ్లలోనే ఎక్కువగా కనిపించే క్యాన్సర్లలో ముఖ్యమైనది బ్రెస్ట్ క్యాన్సర్​. దీన్ని ముందుగానే గుర్తిస్తే.. తొందరగానే కోలుకోవచ్చు, ప్రాణాల్ని కాపాడుకోవచ్చు అంటున్నారు ఆంకాలజిస్ట్ సత్య దత్తాత్రేయ.

ప్రతిఒక్కరికి క్యాన్సర్​ మీద అవేర్​సెన్ ఉండడం చాలా ముఖ్యం. ముఖ్యంగా  బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలో మహిళలు జాగ్రత్తగా ఉండాలి. ఈ క్యాన్సర్  మీద అవగాహన పెంచడం కోసం  అక్టోబర్ నెలను  ‘బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్​నెస్ మంత్​’గా ప్రకటించింది డబ్ల్యూ.హెచ్.​వో  రొమ్ము క్యాన్సర్​ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డయాగ్నసిస్, ట్రీట్మెంట్ గురించి చెప్పడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. 2020లో ప్రపంచవ్యాప్తంగా 22.8 శాతం మంది బ్రెస్ట్​ క్యాన్సర్ బారిన పడ్డారు. వీళ్లలో 6.4 శాతం మంది చనిపోయారు. 
రిస్క్​ని పెంచుతాయి

మిగతా క్యాన్సర్లలాగ రొమ్ము క్సాన్సర్​ రావడానికి ఫలానా కారణం ఇదని కచ్చితంగా చెప్పలేం. అయితే, ఈ క్యాన్సర్​కి ​ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవేంటంటే... చిన్న వయసులోనే (12 ఏండ్లలోపే) పీరియడ్స్​ మొదలవ్వడం, మెనోపాజ్​ ఆలస్యం కావడం, ముప్ఫయ్యేండ్ల తర్వాత పిల్లల్ని కనడం, గర్భం దాల్చకపోవడం వంటివి బ్రెస్ట్ క్యాన్సర్​ ముప్పుని పెంచుతాయి.  లావుగా ఉన్నా ఈ క్యాన్సర్​ బారిన పడే అవకాశం ఉంది. ఇవేకాకుండా... కుటుంబంలో ఎవరికైనా  బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నా లేదంటే బ్రెస్ట్ క్యాన్సర్ జీన్స్​లో​ (బీఆర్​సీఏ 1, బీఆర్​సీఏ 2 జీన్స్​)లో మ్యూటేషన్స్ జరిగినా కూడా ఈ క్యాన్సర్ రావచ్చు. కొందరికి బ్రెస్ట్​లో కొన్ని కణాలు అసంఖ్యాకంగా  పెరిగిపోతుంటాయి. వాటిని ‘లాబ్యులార్ కార్సినోమా ఇన్​ సిటు’ (ఎల్​సీఐఎస్)  అంటారు. ఇవి క్యాన్సర్ కణాలు కాకపోయినా వీళ్లకు తొందరగా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు ఒక బ్రెస్ట్​కి క్యాన్సర్ వస్తే, రెండో బ్రెస్ట్​లో కూడా క్యాన్సర్ కణితులు పెరిగే అవకాశం ఉంది. 

ఈస్ట్రోజన్ రిసెప్టార్ పాజిటివ్ (ఇఆర్​ పాజిటివ్​)​, ప్రొజెస్టిరాన్ రిసెప్టార్ పాజిటివ్ (పీఆర్​ పాజిటివ్) ఉన్నా బ్రెస్ట్ క్యాన్సర్ రావొచ్చు.  దీన్ని ‘ఇఆర్, పీఆర్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్’ అంటారు. హ్యూమన్ ఎపిడెర్మల్ గ్రోత్​ ఫ్యాక్టర్ 2 (హర్​2) పాజిటివ్​ ఉన్నా కూడా ఈ క్యాన్సర్​ వస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నవాళ్లలో మూడోవంతు మందికి ఇది పాజిటివ్ ఉంటుంది. మరికొందరిలో ఈఆర్, పీఆర్, హర్​2  నెగెటివ్ ఉంటాయి. దీన్ని ‘ట్రిపుల్ నెగెటివ్ బ్రెస్ట్ క్యాన్సర్’ అంటారు.  

ఈ లక్షణాలు కనిపిస్తే..

రొమ్ములో చిన్న గడ్డ ఏర్పడినా కూడా అది క్యాన్సర్ గడ్డ కావచ్చని భయపడుతుంటారు చాలామంది. అయితే,  బ్రెస్ట్​లో ఏర్పడే గడ్డలన్నీ క్యాన్సర్ గడ్డలు కావు. వాటిలో కాన్సర్ కణితులు కానివి కూడా ఉంటాయి. మరి... క్యాన్సర్​ గడ్డల్ని ఎలా గుర్తించాలంటే.. అవి గట్టిగా ఉంటాయి. ముట్టుకున్నా కూడా  నొప్పి ఉండదు.  క్యాన్సర్​ గడ్డలు సైజ్( దాదాపు ఐదు సెంటీమీటర్ల వరకు) మెల్లిగా పెరుగుతుంటాయి. వాటి ఆకారం  మారుతుంది. అంతేకాదు క్యాన్సర్ కణితి ఏర్పడిన బ్రెస్ట్​ సైజ్​ కూడా మారుతుంది. ఇవేకాకుండా చనుమొనల దగ్గర సొట్టలు పడడం, బ్రెస్ట్ నుంచి నీళ్లలాంటి ద్రవం కారడం కూడా క్యాన్సర్​ గడ్డ తాలూకూ లక్షణాలే. అంతేకాదు చనుమొనలు లోపలికి వెళ్లినట్టు ఉన్నా,  బ్రెస్ట్ మీది చర్మం ఎర్రగా లేదా ఆరెంజ్​ రంగులోకి మారినా, కణితి ఉన్న చోట చర్మం  తెల్లని పొరలుగా లేచినట్టు కనిపిస్తున్నా బ్రెస్ట్ క్యాన్సర్​ స్క్రీనింగ్ చేయించుకోవాలి.   

ఆలస్యం చేసేకొద్దీ..

బ్రెస్ట్​ లో ఏర్పడిన క్యాన్సర్ గడ్డల్ని ముందుగా గుర్తించడం చాలాముఖ్యం. లేకుంటే కోలుకోవడానికి ఎక్కువ టైం పట్టడమే కాకుండా మిగతా శరీర భాగాల మీద వాటి ప్రభావం ఉంటుంది. ఎలాగంటే... క్యాన్సర్ గడ్డలు  బ్రెస్ట్ నుంచి లింఫ్​ గ్రంథులకు చేరతాయి. దాంతో అవి ఉబ్బుతాయి. అక్కడి నుంచి మెడ వెనక (కాలర్ బోన్) మీద  కూడా ఈ  గడ్డలు ఏర్పడడంతో మెడ నొప్పి మొదలవుతుంది. కొందరిలో మెదడులో కూడా  క్యాన్సర్​ గడ్డలు కనిపిస్తాయి. ఎముకల మీద  ఇవి ఊపిరితిత్తులకు విస్తరిస్తే... దగ్గు, ఆయాసం వస్తాయి. లివర్​ మీద  ఏర్పడితే పొట్ట పైభాగంలో నొప్పి ఉంటుంది. ఈ క్యాన్సర్​లో ఎర్లీ, లోకల్లీ అడ్వాన్స్​డ్, మెటాస్టాటిక్ దశలు ఉంటాయి.  ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్​లో కణితి సైజ్ చిన్నగా ఉంటుంది. అప్పటికీ ఇంకా లింఫ్ గ్రంథుల (లింఫ్​నోడ్స్​) మీద ఈ గడ్డలు ఏర్పడవు. ఒకవేళ ఏర్పడినా ఒకటి రెండు లింఫ్​ గ్రంథుల మీదనే వీటి ప్రభావం ఉండొచ్చు. లోకల్లీ అడ్వాన్స్​డ్ బ్రెస్ట్ క్యాన్సర్​లో క్యాన్సర్ గడ్డలు నాలుగైదు లింఫ్​నోడ్స్​కి పాకుతాయి. వాటి సైజ్ (5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ) పెరుగుతుంది. చనుమొనలు లేదా బ్రెస్ట్ మీది చర్మం లోపలికి వెళ్తుంది. 

మెటాస్టాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్– ఈ స్టేజీలో క్యాన్సర్​ గడ్డలు బ్రెస్ట్​లోనే కాకుండా ఊపిరితిత్తులు, ఎముకలతో పాటు లివర్​ మీద కూడా పెరుగుతాయి. కొందరిలో మెదడుకి కూడా ఈ కణితులు పాకుతాయి. దీన్నే అడ్వాన్స్​డ్​ స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్​  అంటారు. 

బయాప్సీ టెస్ట్​తో..

బ్రెస్ట్​ క్యాన్సర్​ డయాగ్నసిస్ కోసం... మమ్మోగ్రఫీ. అల్ట్రాసౌండ్, ఎక్స్​ రే తీస్తారు. ఆ తర్వాత బయాప్సీ టెస్ట్ చేస్తారు. బయాప్సీలో బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని తెలిస్తే వెంటనే ట్రీట్మెంట్ మొదలుపెడతారు. అయితే అది ఏ రకమైన బ్రెస్ట్ క్యాన్సర్ అనేది తెలుసుకోవడానికి ఇమ్యునో హిస్టో కెమిస్ట్రీ (ఐహెచ్​సీ)  టెస్ట్ చేస్తారు. దీంట్లో  ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ రిసెప్టార్లు ఉన్నాయా? లేదా? అనేది తెలుస్తుంది.  హార్మోన్​ రిసెప్టార్లు పాజిటివ్​ ఉంటే హార్మోనల్ థెరపీ అవసర మవుతుంది.

ట్రీట్మెంట్ రకాలివి

బ్రెస్ట్ క్యాన్సర్ ఏ స్టేజ్​లో ఉంది అనేదాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తారు. ఈ క్యాన్సర్​  తొలిదశలో ఉంటే... ఆపరేషన్ చేసి కణితుల్ని తీసేస్తారు. అయితే... ఆపరేషన్  రిపోర్ట్​ని బట్టి కీమో అవసరమా? రేడియేషన్ థెరపీ చేయొచ్చా? హార్మోనల్ థెరపీ చేయాలా? అనేది నిర్ణయిస్తారు. 

  • ఇంతకుముందు బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్లకు  ‘మాస్​టెక్టోమీ’ చేయాల్సి వచ్చేది. అంటే... ఈ సర్జరీలో మొత్తం బ్రెస్ట్ తీసేస్తారు. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలామందికి ‘బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ’ చేస్తున్నారు. ఇందులో క్యాన్సర్ గడ్డలు ఉన్న రొమ్ము భాగాన్ని  మాత్రమే తీసేస్తారు.  తీసేసిన భాగం మళ్లీ పెరుగుతుంది కాబట్టి పేషెంట్స్​కి మానసిక బాధ ఉండదు.  
  • బ్రెస్ట్  క్యాన్సర్ ముదిరిన వాళ్లకు ‘బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ’తో జబ్బుని నయం చేయడం సాధ్యం కాదు. అలాంటివాళ్లకు 6 నుంచి 8 సెషన్లు కీమో థెరపీ చేయాలి. ఈ థెరపీలో... ఇంజెక్షన్ల రూపంలో కెమికల్స్​ని రక్తంలోకి ఎక్కిస్తారు. ఈ కెమికల్స్​ క్యాన్సర్ కణాల్లోని డి.ఎన్.​ఎ, ప్రొటీన్లను నాశనం చేస్తాయి. దాంతో క్యాన్సర్ గడ్డలు తగ్గిపోతాయి. 
  • ఈస్ట్రోజన్ రిసెప్టార్, ప్రొజెస్టిరాన్ రిసెప్టార్ పాజిటివ్ ఉన్నవాళ్లకు హార్మోనల్ థెరపీ చేస్తారు.   హ్యూమన్ ఎపిడెర్మల్ గ్రోత్​ ఫ్యాక్టర్ 2 పాజిటివ్ ఉన్నవాళ్లకు  టార్గెట్ థెరపీ ట్రీట్మెంట్ చేస్తారు.  ట్రిపుల్ నెగెటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటె కీమో థెరపీతో పాటు ఇమ్యునో థెరపీ చేయాలి.  

రొమ్ము క్యాన్సర్​ని ముందుగానే గుర్తించడం కోసం... మహిళలు నెలకొకసారి సొంతంగా బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి.  రొమ్ముల్ని చేతితో తడుముతూ.. గడ్డలు ఉన్నాయోమో చెక్ చేసుకోవాలి. అలానే బ్రెస్ట్ సైజ్​లో తేడా కనిపించినా అలర్ట్ కావాలి. అంతేకాదు ఏడాదికి ఒకసారి డాక్టర్​ని కలిసి బ్రెస్ట్ స్క్రీనింగ్ చేసుకోవాలి. తల్లిదండ్రుల్లో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్​ ఉంటే జీన్​ టెస్ట్ చేయించుకోవాలి. 

ఈ జాగ్రత్తలతో... 

బ్యాలెన్స్​డ్​ డైట్ తప్పనిసరి.  ఆరోగ్యకర మైన ఫుడ్ తినడమే కాకుండా బరువు పెరగ కుండా చూసుకోవాలి. సీజనల్​గా దొరికే పండ్లు, కూరగాయలు ఎక్కువ తినాలి. వీటిలో ప్రిజర్వేటివ్స్​ తక్కువ కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచివి. సిగరెట్, ఆల్కహాల్​కు దూరంగా ఉండాలి. వారంలో నాలుగైదు రోజులు ఎక్సర్​సైజ్ చేయాలి. 

డాక్టర్. పాలంకి సత్య దత్తాత్రేయ
డైరెక్టర్, చీఫ్​ ఆఫ్​ మెడికల్ ఆంకాలజీ సర్వీసెస్
రెనోవా సౌమ్య క్యాన్సర్ సెంటర్, సికింద్రాబాద్.